వరద విలయంలో అసోం విలవిల
- DV RAMANA

- 16 hours ago
- 2 min read

అసోం దుఃఖదాయినిగా బ్రహ్మపుత్ర నదికి ఒక చెడ్డపేరు ఉంది. ఈ పేరు నిన్నో మొన్నో రాలేదు. కొన్ని శతాబ్దాల నుంచి అది కొనసాగుతున్నది. ఈ పేరు ఎందుకు వచ్చిందో తాజాగా అసోంను ముంచెత్తుతున్న వరదలను, వాటి విలయాన్ని చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఏటా వరద తాకిడికి గురికావడం ఈశాన్య రాష్ట్రమైన అసోంకు అలవాటే. కానీ ఈసారి ఈ విలయం మరింత విషాదం సృష్టించింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 67 మంది వరదల్లో కొట్టుకుపోవడమో, చనిపోవడమో జరిగింది. 650కి పైగా గ్రామాýను వరద ముంచెత్తింది. ఆరు లక్షలమందికి పైగా ప్రజలు ఆస్తులు కోల్పోవడం, అయినవారిని కోల్పోవడం, రహదారులు, పశుసంపద, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినడం తదితర నష్టాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వరద బాధితులుగా మిగిలారు. 37 వేల హెక్టార్లకు పైగ పంట భూములు మునకకు గురయ్యాయి. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా దాడి చేసిన ఈ విపత్తు బ్రహ్మపుత్ర నది పుణ్యమే. ఈ దుస్థితికి ఆ నదితో పాటు అసోం రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు కూడా కారణమవుతున్నాయి. హిమాలయాల్లో పుట్టి టిబెట్ మీదుగా మన దేశంలోకి ప్రవేశిస్తున్న బ్రహ్మపుత్ర అరుణాచల్‌ప్రదేశ్ మీదుగా ప్రవహిస్తూ ఆ మార్గంలో అపారంగా ఉన్న కొండ ప్రాంతాల్లోని వరద నీటిని తనతో తీసుకొస్తుంది. అంతేకాకుండా అసోం రాష్ట్రంలో ఉన్న 50కి పైగా ఉపనదులు బ్రహ్మపుత్రలో కలుస్తాయి. ఇవన్నీ కలసి ఆ నది అత్యంత ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఇంకో విషయం ఏమిటంటే.. ఈ నది తనలో ఉన్న నీటినే కాకుండా దాంతో పాటు భారీస్థాయిలో ఇసుక, మట్టిని మోసుకొస్తుంది. వీటి కారణంగా నదీగర్భం పూడికతో నిండిపోయి.. నీటిని తనలో పూర్తిస్థాయిలో ఇముడ్చుకోలేకపోతున్నది. ఫలితంగా భారీ వర్షాలకు వచ్చే వరదనీరు గట్లను దాటుకుని ఊళ్లను ముంచేస్తున్నది. రాష్ట్రం మొత్తం భూభాగంలో దాదాపు 40 శాతం వరద ముంపు ప్రాంతంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రతి ఏటా దాదాపు లక్ష హెక్టార్ల వ్యవసాయ భూమి ముంపునకు గురవుతున్నదంటే అసోంలో వరద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇవి చాలవన్నట్లు ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనే అసోంతో పాటు ఈశాన్య భారతంలోని నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో తక్కువ సమయంలోనే అసాధారణ స్థాయిలో వర్షాలు కురిశాయి. ఆ వరదంతా బ్రహ్మపుత్రలో కలిసి విలయం సృష్టిస్తున్నది. వరద ముప్పు నుంచి అసోంను కాపాడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా.. బహ్మ్రపుత్రకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కావడంలేదు. నష్టాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాతకాలంలో కట్టిన కరకట్టలు వంటివి శిథిలం కావడం వల్ల నీటికి అడ్డుకట్ట వేయలని పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్రంలో సుమారు 4473 కరకట్టలు ఉన్నా.. వాటిలో చాలావరకు వరద తాకిడికి బలహీనపడటమో, కొట్టుకునిపోవడమో జరుగుతోంది. ఇలాంటివాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా ప్రభుత్వాలు తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెట్టేస్తున్నాయి. కరకట్టల సక్రమ నిర్వహణతో పాటు సహజ నీటిప్రవాహ మార్గాలను పరిరక్షించడం వంటి చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి. నీటిప్రవాహ ఉధృతి కారణంగా నదితీరం కోతకు గురవుతుండటం మరో ప్రధాన సమస్య. బ్రహ్మపుత్రతో పాటు దాని ఉపనదులు కూడా వర్షాకాలంలో ప్రవాహ ఉధృతితో ఏటా పెద్ద పరిమాణంలో భూమిని కోతకు గురి చేస్తుంటాయి. దీనివల్ల తీరప్రాంతాల ప్రజలు వ్యవసాయ భూములు, ఇళ్లను కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం వల్ల పర్యావరణంలో తీవ్రమార్పులు సంభవిస్తున్న కారణంగా కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు వంటి ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయని వాతావరణ నిపుణులు కొన్నేళ్లుగా హెచ్చరిస్తున్నారు. అసోం వంటి కొండప్రాంతాలు, నదీతీర రాష్ట్రాల్లో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో వరద రావడం గురించి కన్నా.. వస్తే అది ఎంత తీవ్రంగా ఉంటుందన్నదే ఆలోచించాల్సిన విషయం. వాతావరణ మార్పుల కారణంగానే ఇటీవలి కాలంలో అయితే వర్షాభావం లేదా అకాల వర్షాలు కురవడం తరచూ జరుగుతోంది. వర్షాలు కురిసినప్పుడు కూడా అడపాదడపా కాకుండా పైనుంచి ఒకేసారి కుమ్మరించినట్లు.. ఆకాశానికి చిల్లుపెట్టినట్లుగా ఒకేసారి గంటలు, రోజుల తరబడి కుంభవృష్టి కురుస్తోంది. కొన్ని నెలలు లేదా ఏడాది మొత్తంలో కురవాల్సిన వర్షమంతా ఆ కొద్ది రోజుల్లోనే కురవడం వల్ల కొండ ప్రాంతాల నుంచి వరద ఊహించని స్థాయిలో మైదాన ప్రాంతాలను ముంచెత్తుతున్నది. నదులు, వాగులు కూడా భారీ పరిమాణంలో చేరిన నీటిని తమలో దాచుకోలేక బయటకు ఇళ్లు, పొలాలపైకి తోసేస్తున్నాయి. ప్రస్తుతంలో అసోంలో వరద విలయానికి ఇదే ప్రధాన కారణం. దీన్ని తట్టుకోవడం ప్రభుత్వాలకు కూడా కష్టమే. ఇక ప్రజల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ పరిస్థితుల్లో అసోంను ప్రతి ఏటా ముంచెత్తుతున్న వరదలను అడ్డుకోవడానికి, సమస్యను పరిష్కరించడానికి వరదకట్టలు నిర్మించడం ఒక్కటే పరిష్కారం కాదని నిపుణులు చెబుతున్నారు. జనావాసాలు పెరుగుతుండటం వల్ల అడవులు తరిగిపోతున్నాయి, నదుల సహజ ప్రవాహ గతి(మార్గం) మారిపోతున్నది. ఇవే వరదలు వంటి అనర్థాలకు హేతువులుగా మారుతున్నాయని అంటున్నారు. వీటని పరిగణనలోకి తీసుకుని నదీ ప్రవాహాల సహస ప్రవాహక్రమాన్ని పరిరక్షించడంతో పాటు ముందస్తు వరద హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను అరికట్టడం వంటి చర్యల ద్వారా వరద విలయాన్ని చాలావరకు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ప్రతి ఏడాది ఈ ముప్పును ఎదుర్కొంటున్న అసోం వంటి రాష్ట్రాలను శాశ్వాతంగా కాపాడటానికి ఎటువంటి చర్యలు అవసరమన్నదానిపై ప్రభుత్వాలు ఇప్పటికైనా శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది.






Comments