పేరు పెద్ద.. ఊరు దిబ్బ!
- DV RAMANA

- 56 minutes ago
- 3 min read

నగర జీవనం అందరికీ ఇష్టమే. అందులోనూ ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో దాదాపు అన్ని దేశాల్లోనూ నగరీకరణ శరవేగంగా విస్తరిస్తున్నది. దానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వినోద కేంద్రాలు, ఇతరత్రా వ్యాపకాలు చాలావరకు పట్టణాలు, నగరాల్లోనే కేంద్రీకృతమవుతన్నాయి. ఫలితంగా ప్రజలు తమ అవసరాలను వెతుక్కుంటూ పల్లెలను వీడి నగరాల బాట పడుతున్నారు. దాంతో నగరాలు జనాలతో కిక్కిరిసిపోతూ కాంక్రీట్ జంగిల్స్‌గా మారుతున్నాయి. అయితే దూరపు కొండలు నునుపు అన్నట్లు నగర జీవనం దూరం నుంచి చూసేవారికి అదో అద్భుత యోగం, అనుభవంలా కనిపిస్తుంది కానీ.. వాటిలోకి వెళ్లి కొన్ని రోజులు గడిపితే అసలు విషయం అర్థమవుతుంది. అద్దంలా కనిపించే నగరాల తెరలు తొలగిపోయి అసలు సమస్యలు కళ్లకు కడతాయి. మౌలిక సౌకర్యాల కొరత, శాంతిభద్రతల సమస్యలు, ట్రాఫిక్ చిక్కులు, అరకొర ఉపాధి అవకాశాలు, ఆకాశమే హద్దుగా ఉండే జీవన వ్యయం వంటివి కళ్లు తేలేసేలా చేస్తాయి. అయితే వీటన్నింటినీ అధిగమించి సకల సౌకర్యాలతో, ప్రశాంత జీవనానికి సరైన వేదికలుగా కనిపించే పలు నగరాలు మాత్రం ప్రపంచ ప్రజలను రా.. రమ్మని ఆహ్వానిస్తుంటారు. అత్యంత నివాసయోగ్య నగరాలుగా గ్లోబల్ ఇండెక్స్‌లో అగ్రస్థానంలో నిలుస్తుంటాయి. పర్యాటక, హాస్పిటాలిటీ రంగాలకు ఈ ఇండెక్స్‌లే కీలకం. దీని ఆధారంగానే విదేశీయులు ఆయా నగరాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. చాలామంది అక్కడే ఉద్యోగాలు సంపాదించి స్థిరపడాలని కూడా తహతహలాడుతుంటారు. అలా ఈ ఏడాది ప్రపంచ స్థాయిలో అత్యంత నివాసయోగ్య నగరాల జాబితా(గ్లోబల్ లివబులిటీ ఇండెక్స్`2026)ను ఇటీవలే విడుదల చేశారు. ఈ జాబితాల్లో భారత్‌లో మెట్రో నగరాలుగా చెప్పుకొంటున్నవేవీ ముందు వరుసలో లేకపోవడం విచారకరం. మనకంటే పాకిస్తాన్ స్థానం మరీ దయనీయంగా ఉంది. ప్రపంచంలో జీవించడానికి అత్యంత సౌకర్యవంతమైన నగరాలు ఏవి? అన్న కోణంలో ‘ది ఇకనామిస్ట’ గ్రూపునకు చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యÖనిట్ పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్లోబల్ లివబులిటీ ఇండెక్స్`2026 పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 173 నగరాలను పరిశీలించి ర్యాంకులు ఇచ్చారు. ఆయా నగరాల్లో విద్యా సౌకర్యాలు, శాంతిభద్రతలు, వైద్యసేవలు, మౌలిక వసతులు, సంస్కృతి, పర్యావరణం వంటి అంశాలను పరిశీలనాంశాలుగా తీసుకుని స్కోర్లు ఇచ్చారు. అయితే ఈ జాబితాలో యÖరోపియన్ దేశాలు అగ్రస్థానాల్లో నిలవగా.. ఆసియా దేశాలు వెనుకబడిపోయాయి. ఈ ఇండెక్స్‌లో డెన్మార్క్ రాజధాని కోపెన్‌హెగెన్ మొదటి స్థానం కైవశం చేసుకుని జాబితాలో టాప్‌లో నిలిచింది. ఆ నగరం ఫస్ట్ ప్లేస్ సాధించడం వరుసగా ఇది రెండోసారి కావడం విశేషం. ఈ నగరం 100కు 98 పాయింట్లు సాధించింది. స్టెబిలిటీ, విద్య, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో వందశాతం స్కోర్ నమోదు చేసింది. హెల్త్‌కేర్ విభాగంలో 96, సంస్కృతిలో 95 పాయింట్లు రాబట్టడంతో పాటు ప్రజాసేవ, శాంతిభద్రతల్లో స్థిరత్వం ఉన్న నగరంగా నిలిచింది. దాని తర్వాత 97.1 పాయింట్లతో ఆస్ట్రియా రాజధాని వియన్నా నగరం రెండోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా నగరాలైన మెల్‌బోర్న్, సిడ్నీ నగరాలు టాప్‌లో ఉండటం విశేషం. మెల్‌బోర్న్ మÖడో స్థానం, సిడ్నీ నాలుగో స్థానం సాధించాయి. ఆ తర్వాత స్థానాల్లో స్విట్జర్లాండ్‌కు చెందిన రెండు నగరాలు నిలిచాయి. జూరిచ్ ఐదోస్థానం, జెనీవా ఆరోస్థానం సాధించాయి. సంస్కృతి, పర్యావరణ విభాగాల్లో పాయింట్లు తగ్గడంతో ఆ రెండు నగరాలు ర్యాంకింగుల్లో ఒక మెట్టు దిగువన ఉండిపోయాయి. జపాన్‌కు చెందిన ఒసాకా నగరం ఏడో స్థానంలో నిలిచింది. ఉత్తమ వైద్య వసతులు, తక్కువ నేరాల రేటు ఈ నగరానికి ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. విచారకరమైన విషయం ఏమిటంటే.. టాప్ టెన్‌లో కాదు కదా.. కనీసం టాప్ 100 నగరాల్లోనూ మన దేశానికి చోటు లభించలేదు. ఈ విశ్లేషణ ప్రకారం విద్య, వైద్యం, శాంతిభద్రతలు, మౌలిక సౌకర్యాలు వంటి కీలక రంగాల్లో భారతీయ నగరాలు ప్రపంచస్థాయిలో పోటీ పడలేకపోతున్నట్లు అర్థమవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ నగరమే ఈ ఇండెక్స్‌లో 120వ స్థానంలో ఉంది. ఇక భారత ఆర్థిక రాజధానిగా చెప్పుకొనే ముంబై మహానగరం 121వ స్థానంలో, చెన్నై 123వ స్థానంలో, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు 127వ స్థానం మాత్రమే సాధించాయి. ఢిల్లీ నగరం మొత్తం వంద పాయింట్లకు గాను 48.1 స్కోరు మాత్రమే సాధించగలిగింది. విద్యారంగంలో 66.7 పాయింట్లతో కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ, వైద్యరంగంలో 41.7, పర్యావరణం`సంస్కృతి విభాగంలో 35.4 స్కోరుతో వెనుకబడిపోయింది. విపరీతంగా పెరుగుతున్న వాయు కాలుష్యం, మౌలిక వసతుల కొరత, అడ్డదిడ్డంగా సాగుతన్న పట్టణీకరణ వల్ల తలెత్తుతున్న సమస్యలే ప్రపంచ ఇండెక్సుల్లో భారతీయ నగరాలు వెనుకబడటానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నట్లు ఈ అధ్యయన నివేదిక వెల్లడించింది. మన పరిస్థితి ఇలా ఉంటే.. మన దాయాది పాకిస్తాన్ మరింత దయనీయ స్థితిలో ఉంది. పాక్ వాణిజ్య రాజధాని, ప్రముఖుల ఆవాసమైన కరాచీ నగరం ఈ ఇండెక్స్‌లో అట్టడుగు నుంచి మÖడో స్థానంలో అంటే 170వ ర్యాంకు సాధించింది. ప్రపంచంలో జీవించడానికి అత్యంత అననుకూల నగరాల్లో కరాచీ ఒకటని ఈ నివేదిక పేర్కొనడం విశేషం. ఈ నగరానికి వంద పాయింట్లకు 43 మార్కులే వచ్చాయి. శాంతిభద్రతల విభాగంగా అతితక్కువగా 20 పాయింట్లు, హెల్త్‌కేర్‌లో 54, పర్యావరణంలో 36, విద్యారంగంలో 75, మౌలిక వసతుల్లో 52 పాయింట్లు వచ్చాయి. కరాచీ కంటే దిగువన అట్టడుగున బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, లిబియా రాజధాని ట్రిపోలి, సిరియా రాజధాని డెమాస్కస్ నగరాలు చివరి స్థానాల్లో నిలిచాయి.ఈ ఇండెక్స్ ప్రకారం అసియా నగరాల్లో హెల్త్‌కేర్ రంగం మెరుగవుతున్నా పెరుగుతున్న జనాభా, కాలుష్యం వాటిని మింగేస్తున్నాయి.






Comments