ప్రజాస్వామ్యంలో విరాళాలస్వామ్యం!
- DV RAMANA

- 13 hours ago
- 3 min read

ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు. వారి ఓట్లతోనే ఎవరైనా అధికార పగ్గాలు చేపట్టగలిగేది. వారు తిరస్కరిస్తే ఎంతటి వారైనా శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే. పవిత్రమైన ఈ ప్రక్రియలో ఓటుకే తప్ప నోటుకు అసలు విలువ ఉండకూడదు. కానీ పరిస్థితి ఒకప్పటిలా లేదు. ప్రజాసమస్యల పరిష్కారంలో, వారి తరఫున చట్టసభలకు ఎన్నికయ్యే విషయంలో, నిరంతరం ప్రజల్లో ఉండేందుకు, కార్యక్రమాలు, కార్యాలయాలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలకు కొంత ఖర్చవుతుందన్నది వాస్తవం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వాలు రాజకీయ పార్టీల కార్యాలయ భవనాల నిర్మాణానికి వీలుగా ప్రభుత్వ స్థలలను రాయితీ ధరపై అందిస్తున్నాయి. ఇక మిగిలింది ఎన్నికలు, కార్యాలయాల నిర్వహణ ఖర్చులే. వీటి కోసం పార్టీ కార్యకర్తల నుంచి ఏటా విరాళాలు, సభ్యత్వ రుసుములు వసూలు చేస్తూనే ఉంటారు. ఇక ఎన్నికల సమయంలో ఆ ఖర్చుల కోసం పార్టీలకు అనేక స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ప్రముఖ వ్యక్తులు విరాళాలు ఇస్తూనే ఉంటారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఖర్చవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు పార్టీల ఆస్తులు వందలు, వేల కోట్లకు ఎగబాకడం చూస్తే ప్రజాస్వామ్యం క్రమంగా ధనస్వామ్యంగా మారుతున్నదనడానికి నిదర్శనంగా ప్రజాస్వామ్య ప్రియులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సంప్రదాయం శృతిమించకుండా హెచ్చరిస్తూ అప్రమత్తం చేయడానికే అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ ఎప్పటికప్పుడు దేశంలోని రాజకీయ పార్టీల ఆస్తులు, వాటికి అందుతున్న విరాళాలు, ఆదాయాల వివరాలను నిర్ధిష్ట కాలవ్యవధిలో సేకరించి విడుదల చేస్తుంటుంది. అదే క్రమంలో తాజాగా విడుదల చేసిన పార్టీల ఆస్తుల చిట్టా చూస్తే దేశంలో అధికారంలో ఉన్న పార్టీలకే విరాళాలు అందుతుంటాయన్నది మరోమారు స్పష్టమైంది. రాజకీయ పార్టీల్లో ఏ పార్టీ ఆదాయపరంగా పెద్దదని అడిగితే చాలామంది సహజంగానే దేశంలో అతి పురాతన, పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌నే ప్రస్తావిస్తారు. కానీ అది వాస్తవం కాదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రధాన భాగస్వామి అయిన భారతీయ జనతాపార్టీ దేశంలో రిచ్చెస్ట్ పార్టీగా ఏడీఆర్ ప్రకటించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే శతాబ్దానికిపైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ కంటే అర్థ శతాబ్ది కూడా పూర్తిగా నిండని బీజేపీ ఈ విషయంలో ముందుంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీలే దేశ రాజకీయాలను శాసిస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం ఎక్కువ కాలం దేశాన్ని పాలించిన పార్టీగా కాంగ్రెస్.. వరుసగా మÖడుసార్లు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీ రెండూ ఘనమైన పార్టీలే. ఆ రెండు పార్టీలకు విస్తృత ప్రజామద్దతు కూడా ఉంది. కానీ వాటికి లభించే ఆదాయంలో మాత్రం హస్తిమసకాంతరం వ్యత్యాసం ఉంది. ఎన్నికల సంఘానికి ఆయా పార్టీలు సమర్పించిన ఆడిట్ రిపోర్టులు, ఏడీఆర్ వర్గాలు సేకరించిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో అత్యంత క్యాష్‌రిచ్ పార్టీ బీజేపీయే. దాని తర్వాత స్థానంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పటికీ.. ఆ రెండింటి ఆదాయాల మధ్య ఎన్నో రెట్ల వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీ వద్ద నగదు నిల్వలు, వార్షికాదాయం, స్థిర చరాస్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి. పలు నివేదికల ప్రకారం బీజేపీకి బ్యాంకుల్లోనే ఆరువేల నుంచి ఏడువేల రూపాయల నగదు నిల్వలు ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ బ్యాంకు బ్యాలెన్స్ రూ.133.97 కోట్లు మాత్రమే. అంటే కాంగ్రెస్ కంటే బీజేపీ వద్ద ఉన్న నగదు నిల్వలే 75 రెట్లు అధికం. ఇవి కాకుండా ఇతర ఆదాయాలు, ఆస్తిపాస్తుల లెక్కలు వేరే ఉన్నాయి. ఎన్నికల సంవత్సరమైన ఒక్క 2024`25లో బీజేపీ రూ.6769.14 కోట్ల ఆదాయం సంపాదించింది. ఈ మొత్తం దేశంలోని ఆరు జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 85 శాతం వరకు ఉండటం విశేషం. కాగా అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఎన్నికల సంవత్సరంలో బీజేపీ ఆదాయం 56 శాతం పెరిగినట్లు అంచనా. మరోవైపు దాని ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అదే ఏడాదిలో తన ఆదాయం రూ.918.28 కోట్లుగా ప్రకటించింది. అంతకుముందు ఏడాది కంటే 25 శాతం తగ్గుదల కనిపించింది. దేశంలో గత మÖడు దఫాలుగా వరుసగా గెలుస్తూ అధికారంలో కొనసాగుతున్న బీజేపీకి ప్రధానంగా బడా వాణిజ్య సంస్థలు, వ్యాపారవేత్తల నుంచి విరాళాల రూపంలో భారీ ఆదాయం సమకూరుతున్నది. ఆ పార్టీ మొత్తం ఆదాయంలో వీటి వాటాయే 90.4 శాతం వరకు ఉంది. మిగిలిన 9.6 శాతం అంటే సుమారు రూ.634 కోట్లు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రూపంలో అందుతోంది. ఇక కాంగ్రెస్‌కు కూడా పారిశ్రామిక, వాణిజ్య సంస్థల నుంచే సింహభాగం ఆదాయం వస్తున్నా.. అది పార్టీ మొత్తం ఆదాయంలో రూ.522.13 కోట్లు (56.8 శాతం) మాత్రమే. మిగతా ఆదాయం కూపన్ల విక్రయం, ప్రజావిరాళాల సేకరణ ద్వారా లభిస్తున్నది. పార్టీ కార్యాలయాలు, సిబ్బంది వేతనాలు వంటి నిర్వహణ ఖర్చుల కోసం బీజేపీ ఏటా రూ.323.05 కోట్లు ఖర్చు చేస్తుంటే.. కాంగ్రెస్‌కు రూ.159.68 కోట్లు ఖర్చవుతున్నది. అన్ని రకాలు కలిపి బీజేపీ మొత్తం ఆస్తులు రూ.12,171.17 కోట్లు కాగా కాంగ్రెస్ ఆస్తులు రూ.1351 కోట్లు మాత్రమేనని నివేదికలు వెల్లడిస్తున్నాయి. నగదు నిల్వలు, వార్షికాదాయం, ప్రచార ఖర్చులు.. తదితర ఆదాయ వ్యయాల విషయంలో బీజేపీ ముందుండటం చూస్తుంటే విరాళాలు అధికారంలో ఉన్న పార్టీలకే ఎక్కువగా లభిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో ఎన్నో దశాబ్దాలు అధికారంలో ఉన్న, వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కూడా గతంలో ప్రభుత్వాలు నడిపినప్పుడు ఇతర పార్టీల కంటే అధికంగా విరాళాలు అందేవి. కానీ 2014 నుంచి వరుసగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తున్నందువల్ల విరాళాలు, ఆస్తుల విషయంలో కాంగ్రెస్‌ను బీజేపీ డామినేట్ చేసింది. అధికార పార్టీలకే అధికంగా విరాళాలు సులభంగా పనులు చేయించుకోవచ్చన్న భావన కావచ్చు. అయితే ఇలాంటి దృక్పథం మంచిది కాదని మేథావులు అంటున్నారు.






Comments