విదేశీ నిధులపై అంకుశం!
- DV RAMANA

- 22 hours ago
- 2 min read

స్వచ్ఛంద సంస్థలు(ఎన్జీవోలు), క్రైస్తవ మిషనరీలకు అందుతున్న విదేశీ నిధులపై కేంద్రం పెత్తనం చేయాలనుకుంటున్నదా? ఆ ఉద్దేశంతోనే 2010 నాటి సంబంధిత చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఇప్పుడు ఆ వర్గాల్లో ఆందోళన రేపుతున్నది. ఈ నెల 12న ఈ బిల్లు సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని అనేక క్రైస్తవ సంస్థల ప్రతినిధులు రెండురోజుల క్రితం కేంద్ర హÃంమంత్రి అమిత్‌షాను కలిసి తమ ఆందోళన గురించి విన్నవించుకున్నారు. క్రైస్తవ మిషనరీలకే కాకుండా విదేశీ నిధులపై ఆధారపడి నడుస్తున్న సంఘాలకు ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. దీని పూర్వాపరాలు పరిశీలిస్తే.. దేశంలోని అనేక సంస్థల నిర్వహణకు విదేశాల నుంచి నిధులు అందుతుండటం గతం నుంచీ జరుగుతున్నదే. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 16వేల సంస్థలు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫఆర్‌సీఏ) పరిధిలో పని చేస్తున్నాయి. వీటికి ప్రతి ఏటా అక్షరాల రూ.22వేల కోట్ల విదేశీ నిధులు అందుతున్నాయి. ఈ నిధులు దుర్వినియోగం కాకుండా, దేశవ్యతిరేక కార్యక్రమాలకు మళ్లించకుండా పర్యవేక్షించేందుకు భారత ప్రభుత్వం 2010లో ఎఫఆర్‌సీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకు పలు కొత్త నిబంధనలతో సవరణ బిల్లును రూపొందించి ఆమోదం కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. విదేశీ నిధుల వినియోగంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం ఈ సవరణ బిల్లు ప్రధాన లక్ష్యం. ఏవైనా కారణాలతో లైసెన్సు రద్దయిన ఎన్జీవో సంస్థల వద్ద ఉన్న విదేశీ నిధులను ఎవరు పర్యవేక్షిస్తారన్న అంశంలో ఉన్న అస్పష్టతను తొలగించి చట్టబద్ధమైన విధానం తీసుకురావడం మరో ఉద్దేశం. విదేశాల నుంచి అందే నిధులతో డబ్బులు ముట్టజెప్పి బలవంతపు మతమార్పిడులను ప్రోత్సహించడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం వంటి వాటిని అడ్డుకోవడం ఈ బిల్లు ఉద్దేశం. 2010లో తొలిసారి తీసుకొచ్చిన ఈ చట్టానికి 2020లో కొన్ని సవరణలు చేశారు. ఇప్పుడు రెండోసారి మళ్లీ సవరణలు చేస్తున్నారు. లైసెన్సు రద్దయిన సంస్థల ఆస్తులకు, నిధులకు పర్యవేక్షణ ఎవరిదన్న దానిపై ఇప్పుడున్న చట్టంలో స్పష్టత లేదు. ఇటువంటి సంస్థలకు డిజిగ్నేటెడ్ అథారిటీలను ఏర్పాటు చేయాలని తాజా సవరణల్లో ప్రతిపాదించారు. లైసెన్సు రద్దయిన, సరెండర్ చేసిన, గడువు ముగిసిన సంస్థల ఆస్తులను మొదట తాత్కాలికంగా.. ఆ తర్వాత అవసరమైతే శాశ్వతంగా డిజిగ్నేటెడ్ అథారిటీలకు బదిలీ చేయాలన్నది కీలక సవరణగా ఉంది. ఆయా సంస్థల ఆస్తులను అమ్మడం, ఇతర సంస్థలకు బదిలీ చేయడం వంటి అధికారాలు ఈ అథారిటీలకు దఖలు పడతాయి. ఇక ఒక సంస్థ లైసెన్స్‌ను గడువులోగా రెన్యువల్‌కు దరఖాస్తు చేయకపోతే దాని మనుగడ ఏమిటన్నదానిపై ఇప్పటి చట్టంలో స్పష్టత లేదు. కొత్తగా ప్రతిపాదించిన సెక్షన్ 148 సవరణ ప్రకారం గడువులోగా ఒక సంస్థ రెన్యువల్‌కు దరఖాస్తు చేయకపోయినా, చేసిన దరఖాస్తు పెండింగులో ఉన్నా గడువు మీరితే మాత్రం ఆ లైసెన్స్ ఆటోమేటిగ్గా రద్దయిపోయినట్లే. మరో కీలక విషయం ఏమిటంటే.. ఇప్పటి చట్టంలో విదేశీ నిధులు స్వీకరించడం, వాటిని వినియోగించడంపై ఎటువంటి కాలపరిమితి లేదు. ప్రతిపాదిత సవరణ ప్రకారం వీటికి కచ్చితమైన కాలపరిమితి ఉంటుంది. ఎఫ్‌సీఆరఏ చట్టాన్ని ఉల్లంఘించే సంస్థలు లేదా వ్యక్తులకు గరిష్టంగా ఐదేళ్ల జైలుశిక్ష విధించాలని ఇప్పుడున్న నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఈ శిక్షను గరిష్టంగా ఒక ఏడాదికి తగ్గించాలని తాజాగా ప్రతిపాదించారు. నిబంధనల ఉల్లంఘన, నిధుల దుర్వినియోగానికి సంబంధించి నిర్వాహకులపైనే చర్యలు తీసుకోవాలని ప్రస్తుత చట్టం నిర్దేశిస్తుండగా తాజా సవరణ ప్రకారం ఆయన సంస్థల డైరెక్టర్లు, ట్రస్టీలపైనా చర్యలు తీసుకునేలా సవరణలు ప్రతిపాదించారు. సవరణ బిల్లులోని అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, క్యాథలిక్స్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా సభ్యులు, జాయింట్ యాక్షన్ ఫోరమ్ ఆఫ్ మైనారిటీస్ నాయకులు డీఎంకే రాజ్యసభ సభ్యుడు విల్సన్ ఆధ్వర్యంలో హÃంమంత్రిని కలివారు. తమ సంస్థల మనుగడకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని లేదా విస్తృత చర్చ కోసం సెలక్ట్ కమిటీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆస్తులను ప్రభుత్వ నియమించే అధికారికి బదలాయించాలనే నిబంధనను తొలగించాలని, పాత చట్టంలోని సంబంధిత సెక్షన్‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మిజోరం ముఖ్యమంత్రి లాల్డూహÃమా వంటి ఈశాన్య రాష్ట్రాల నాయకులు కూడా ఎఫ్‌సీఆరఏ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కూడా వీరితో గొంతు కలుపుతున్నాయి. ఎన్జీవో సంస్థలను, క్రైస్తవ మిషనరీలను ఈ నెపంతో తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న దురుద్దేశంతోనే ప్రభుత్వ పెద్దలు ఈ సవరణలు ప్రతిపాదించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మత కార్యక్రమాలు నిర్వహించే క్రైస్తవ సంఘాలతోపాటు విద్య, వైద్య, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్(ఎన్జీవో)లు విదేశీ విరాళాలతోనే పాఠశాలలు, ఆస్పత్రులతో సహా ఇతరత్రా స్థిరాస్తులను భారీగా నిర్మించాయి. తాజా సవరణలు అమల్లోకి వస్తే రిజిస్ట్రేషన్ సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ ఆస్తులు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లిపోతాయని భయపడుతున్నారు. దీనివల్ల దాతృత్వ కార్యకలాపాలకు ఆటంకం వాటిల్లుతుందని వాదిస్తున్నారు. ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాలు, కేరళం వంటి రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం పరిమితంగానే మౌలిక సౌకర్యాలు కల్పిస్తుండగా, ఈ ఎన్జీవోలే అనేక వసతులు కల్పిస్తూ అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పలువురు ప్రభుత్వ చర్యలను సివిల్ సొసైటీ స్వేచ్ఛపై అంకుశం పెట్టే చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సవరణ బిల్లుపై ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.






Comments