top of page

ఆలింగన విధానమే విదేశాంగం కాదు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 2 min read

రానురాను దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. గతంలో పాలక, ప్రతిపక్షాల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు, విధాన నిర్ణయాలపై విభేదాలు మాత్రమే ఉండేవి. అవి మినహా మిగతా సందర్భాల్లో అన్ని పక్షాల నాయకులు పరస్పరం స్నేహపూర్వకంగానే వ్యవహరించేవారు. కానీ సమకాలీన రాజకీయాల్లో అటువంటి స్నేహపూర్వక వాతావరణం కనుమరుగవుతోంది. దాని స్థానంలో రొచ్చు రాజకీయాలు పెరిగిపోతున్నాయి. సిద్ధాంత సంవాదాలు, విధానపరమైన వాదనలు చేయాల్సిన నాయకులు అది చేతకాకో.. ఆవేశంతో అదుపుతప్పుతున్నారో తెలియడం లేదుగానీ.. ఆ చర్చలను, వాదనలను దారి తప్పించి వ్యక్తిగత అంశాల్లోకి చొరబడుతున్నారు. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని కుటుంబాలను సైతం తమ కుళ్లు రాజకీయాల్లోకి లాగుతున్నారు. సభ్యత మరచి కువిమర్శలు చేస్తున్నారు. చివరికి నాయకుల ఆహార్యాన్ని, బాడీ లాంగ్వేజ్‌ను, వారి వ్యవహార శైలిని కూడా అసభ్యంగా చిత్రీకరిస్తున్నారు. ఆ మాయలో పడి తాము అభాసుపాలవుతున్నామన్న విషయాన్ని నాయకులు గమనించలేకపోతున్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ఇలాంటి అపసవ్య ధోరణులే కనిపిస్తున్నాయి. దానికి తాజా ఉదాహరణే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ లేవనెత్తి హగ్గింగ్ రాజకీయం. ఆ విమర్శలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంధించినవే కావడం, మరో దేశాధినేత ప్రస్తావన కూడా ఉండటంతో అవి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్‌వర్గాలు చెబుతున్నట్లు సరదాగానో, వ్యంగ్యంగానో ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు, ఆ సందర్భంగా విదేశీ నేతలతో కొనసాగిస్తున్న సాన్నిహిత్యం, వారితో మెలుగుతున్న వైనాన్ని తప్పుడు భావం స్ఫురించేలా వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కారు అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని తప్పు పట్టే క్రమంలో ఆయన కాస్త అదుపు తప్పినట్లు ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘మోదీకి కొన్ని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తుంటాయో తెలియదు గానీ.. అవి చాలా వింతగా ఉంటాయి. వాటినే ఆయన విదేశాంగ విధానం అనుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే అదే వేదికపై ఉన్న ఢిల్లీ కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌ను ఆలింగనం చేసుకుని తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని పరోక్షంగా వెల్లడించారు. వాటిని అర్థం చేసుకున్నట్లుగా సందీప్ దీక్షితే వెంటనే స్పందిస్తూ ‘నన్ను మెలోనీ అనుకుని ఆలింగనం చేసుకున్నారా?’ అని రాహుల్‌ను ప్రశ్నించారు. దాంతో అసలు విషయం అర్థమై సభలో ఉన్న నాయకులంతా ఒక్కసారి గొల్లుమని నవ్వారు. సందీప్ ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ ‘ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు’ అని బదులివ్వడంతో ఆ నవ్వులు తారస్థాయికి చేరాయి. ఆ ఘట్టం క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడం, రాజకీయం దుమారం చెలరేగడంతో కాంగ్రెస్ పార్టీ దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయగా.. బీజేపీ వర్గాలు కాంగ్రెస్‌ను మరింతగా ఇరికించి డిఫెన్స్‌లో పడేయాలని ప్రయత్నిస్తున్నాయి. తాను విదేశీ పర్యటనకు వెళ్లినా, విదేశీ నేతలు భారత పర్యటనకు వచ్చినా.. ప్రధాని మోదీ వారితో గౌరవపూర్వకంగా కరచాలనం చేయడం, ఆత్మీయతను ప్రకటించే క్రమంలో హగ్(ఆలింగనం) చేసుకోవడం కొత్త సంప్రదాయం కాదు.. దుస్సంప్రదాయం అసలే కాదు. విదేశీయులు, విదేశీ నేతలందరూ వీటినే పాటిస్తుంటారు. గతంలో మన ప్రధానులుగా ఉన్నవారు కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరించినవారే. కానీ ఇప్పుడు మోదీని విమర్శించే క్రమంలో, ఆయన ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని తప్పుపట్టే క్రమంలో మోదీ బాడీ లాంగ్వేజ్‌ను, విదేశీ నేతలను ముఖ్యంగా ఇటలీ ప్రధాన మంత్రి మెలోనీ వంటి మహిళా నేతలను ఆలింగనం చేసుకోవడంలో రాహుల్ సంప్రదాయాన్ని కాకుండా అసభ్యతను చూసినట్లుంది. ఇటలీకి చెందిన తల్లి పెంపకంలో పెరిగిన, తరచూ విదేశాల్లో పర్యటించే రాహుల్ ఆలింగనాన్ని ఆత్మీయ స్పర్శగా కాకుండా అదేదో తప్పుడు పనిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాజకీయంగా దిగజారుడుతనమే అవుతుంది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై రాహుల్ నిర్మాణాత్మక విమర్శలు చేశారు. కానీ అవన్నీ ఈ ఆలింగన వివాదంలో కనిపించకుండా కొట్టుకుపోయాయి. కాగా రాహుల్, సందీప్ దీక్షిత్‌ల చర్యలను బీజేపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఆ క్రమంలో దీక్షిత్ తల్లి విషయంలో మోదీ చూపిన సంస్కారాన్ని ప్రస్తావిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన షీలా దీక్షిత్ తనయుడే సందీప్ దీక్షిత్. 2024లో షీలా దీక్షిత్‌పై తీవ్ర ఆరోపణలు రాగా ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ షీలాపై అటువంటి ఆరోపణలు రావడం బాధాకరమని వ్యాఖ్యానించిన విషయాన్ని బీజేపీ నేతలు తెరపైకి తెస్తూ.. ఆ కృతజ్ఞత కూడా లేకుండా నేడు షీలాదీక్షిత్ కుమారుడే మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని విమర్శిస్తున్నారు. ఇక బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మరో అడుగు ముందుకేసి రాహుల్ నానమ్మ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి విషయాలను తెరపైకి తీసుకొచ్చి కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టారు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నాటి క్యూబా విప్లవనేత ఫిడెల్ క్యాస్ట్రో, పాలస్తీనా విమోచన సమితి(పీఎల్‌వో) వ్యవస్థాపకుడు యాసిర్ అరాఫత్‌లను ఇప్పుడు మోదీ చేసిన మాదిరిగానే ఆలింగనం చేసుకున్న ఉదంతాలను నిశికాంత్ వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మోదీ చేసింది అసభ్యకర చర్య అయితే నాడు ఇందిర చర్యలను కూడా అలాగే ట్రీట్ చేస్తారా అని ప్రశ్నించారు. కాగా ఈ సంవాదంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన మరో పేరు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ పేరు. ఇటలీ పర్యటనకు వెళ్లినప్పుడు మోదీ ఆమెకు చాక్లెట్లు బహూకరించడం దానిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తడం తెలిసిందే. కానీ ఇద్దరు దేశాధినేతలు పరస్పరం గౌరవించుకునే తీరును వక్రీకరించడం రాజకీయం అనిపించుకోదు.

1 Comment


Sylani Madina
Sylani Madina
2 hours ago

DOING SUCH COMMENTS ON PM MODI IS OBJECTABLE THEY ARE NOT SUPPOSE TO SHOW IT IN WRONG WAY PEOPLE WILL HAVE SOMANY WAYS OF DOING FORIEGN POLICIES THERE IS NO WRONG IN MODI"S GESTURE RG SHOULD FEEL SORRY FOR THAT.

Like

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page