top of page

పదవులొచ్చినా ఏపీ బీజేపీ నాట్ హ్యాపీ!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 hours ago
  • 3 min read

పదవులతో రాజకీయ నాయకులకు ఉన్నంత లింకు ఇంక దేనితోనూ ఉండదనడం అతిశయోక్తి కాబోదు. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో వస్తున్నామని అందరూ రికార్డెడ్ స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు. కానీ వారి మనసు, దృష్టి మాత్రం పదవులపైనే ఉంటుందన్నది వాస్తవం. ఇక అధికార పార్టీలో ఉన్నవారైతే పార్టీపరంగా కంటే ప్రభుత్వ పదవులపైనే దృష్టిసారించి, అగ్రనాయకత్వం గుడ్‌లుక్స్‌లో పడేందుకు తెగ తాపత్రయపడుతుంటారు. ఆ అవకాశం లేకపోతే ఎట్‌లీస్ట్ పార్టీ పదవులతో సర్దుకోవడానికి సిద్ధపడటం సహజం. అయితే అంతర్గతంగా మాత్రం అసంతృప్తి వారిని వేధిస్తూనే ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకు.. అప్రస్తుతం కదా! అనుకునేరు. ఎందుకంటే తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ సుదీర్ఘ జాప్యం తర్వాత ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి చోటు లభించగా.. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు అసలు ప్రాతినిధ్యం లభించకపోగా, ఇప్పటివరకు జాతీయ కార్యవర్గంలో ఉన్న డి.కె.అరుణకు కొత్త కార్యవర్గంలో చోటు దక్కలేదు. మామÖలుగా అయితే ఈ పరిణామాలు ఏపీ బీజేపీలో ఆనందం, తెలంగాణ బీజేపీలో అసంతృప్తికి కారణం కావాలి. కానీ చిత్రంగా దానికి పూర్తి రివర్స్ సీన్ రెండు రాష్ట్రాల బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ చాలా నెలల క్రితమే బాధ్యతలు చేపట్టినా.. జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించడంలో అనేక కారణాల వల్ల చాలా ఆలస్యం జరిగింది. అయితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఆరు రాష్ట్రాల ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో ఇంకా జాప్యం చేస్తే సంస్థాగతంగా నష్టం వాటిల్లుతుందని భావించిన బీజేపీ నాయకత్వం ఎట్టకేలకు కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. వాస్తవానికి కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, పార్టీ జాతీయ కార్యవర్గ నియామకం రెండూ జరగాల్సి ఉంది. వాటిలో ముందుగా కార్యవర్గం ప్రకటించారు. ఇదే తెలుగు రాష్ట్రాల్లోని కమలదళాల్లో విభిన్న వాతావరణాన్ని క్రియేట్ చేసింది. సాధారణంగా పార్టీల్లో ఒక సంప్రదాయం కొనసాగుతోంది. పార్టీ పదవుల్లో ఉన్నవారిని ప్రభుత్వ పదవుల్లోకి తీసుకోకపోవడం, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారికి పార్టీ బాధ్యతలు అప్పగించకపోవడమే ఆ సంప్రదాయం. కొన్ని సందర్భాల్లో.. కొందరి విషయంలో మినహాయింపులు ఉండవచ్చేమోగానీ.. స్థూలంగా దేశంలో అన్ని పార్టీలు ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత బీజేపీ కొత్త కార్యవర్గం విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మాజీమంత్రి, రాజమహేంద్రవరం ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి కమలదళం జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అలాగే యువ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి అనూహ్యంగా కార్యవర్గంలో చోటు దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణను కాదని పెద్దగా సంస్థాగత బలం లేని ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వడం ఆ నేతలకు, పార్టీ శ్రేణులకు బూస్ట్ ఇవ్వాలి. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. దానికి కారణాలను కూడా ఆ పార్టీవారే విశ్లేషించి చెబుతున్నారు. జాతీయ కార్యవర్గంలో రాష్ట్రం నుంచి ఇద్దరికి చోటు కల్పించారంటే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర కోటాను పెంచే ఉద్దేశం కేంద్ర పెద్దలకు లేదనే అర్థమని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కొద్దిరోజుల్లో జరగనున్న కేంద్ర కేబినెట్ ప్రక్షాళనలో రాష్ట్రం నుంచి ఆ పార్టీ ఎంపీ పురంధేశ్వరికి అవకాశాలు మెండుగా ఉన్నాయని మెజారిటీ బీజేపీ శ్రేణులు ఇంతవరకు భావించాయి. దానికితోడు రాష్ట్రంలో బీజేపీకి అంతగా పట్టు లేదు. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నందున రాష్ట్రంలో ఆ పార్టీకి కొన్ని ఎంపీ సీట్లు, కేబినెట్‌లో మంత్రి పదవి లభించాయి. అయితే అధికారంలో ఉన్న సమయంలోనే ఏపీలో పార్టీని పటిష్టపరచాలంటే రాష్ట్ర బీజేపీ ఎంపీల్లో మరొకరికి కేంద్ర కేబినెట్‌లో చేర్చుకోవడం అవశ్యమని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆ ప్రకారం చూస్తే కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఉన్న రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికే అవకాశాలు ఎక్కువని చాలామంది అంచనా వేశారు. కానీ నాయకత్వం ఆలోచన మరోలా ఉన్నట్లు కొత్త కార్యవర్గ ప్రకటనతో స్పష్టమైంది. పురంధేశ్వరిని కార్యవర్గంలోకి తీసుకోవడంతో ఇక ఏపీ నుంచి బీజేపీ కోటాలో ఇంకెవరికీ అమాత్యయోగం లభించే అవకాశాలు లేనట్లే! కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. వారిలో రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, శ్రీనివాసవర్మ బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విస్తరణలో ఏపీ నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలనుకుంటే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు ఆ అవకాశం లభించవచ్చని చర్చలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే బీజేపీ కోటాలో రాష్ట్రం నుంచి కేంద్రమంత్రి పదవి ఆశిస్తున్న పురంధేశ్వరిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడం ద్వారా అమాత్య రేసు నుంచి తప్పించినట్లు కనిపిస్తోంది. మరోవైపు దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం తెలంగాణ బీజేపీలో నెలకొంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కమలదళం చాలా పటిష్టంగా ఉండి, అధికారమే టార్గెట్‌గా పని చేస్తోంది. ఆ లక్ష్యం కోసమే ప్రస్తుతం ఆ రాష్ట్రం నుంచి మంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు తోడుగా మరొకరికి ఇవ్వడం ద్వారా పార్టీకి మరింత ఊపు తేవాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తోంది. ఆ మేరకు పలువురు బీజేపీ ఎంపీలు కేబినెట్ ఛాన్స్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ కొత్త కార్యవర్గంలో ఈ రాష్ట్ర నేతలను తీసుకుని ఉంటే.. కేబినెట్ అవకాశాలకు గండి పడేది. అయితే కార్యవర్గంలో రాష్ట్రానికి చోటు కల్పించకపోవడంతో తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త ఆశలు మోసులేస్తున్నాయి. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనలో రాష్ట్రానికి మరో బెర్త్ ఖాయమని.. అది తామే కావచ్చని తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎవరికివారు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. కొత్త కార్యవర్గంలో ఆయాచితంగా లబ్ధిపొంది, హ్యాపీగా ఉన్న నేత విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కరే. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నా ఏ పదవీ దక్కని ఆయనకు ఏకంగా జాతీయ పదవి వరించింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page