top of page

కార్పొరేట్ రుణాల ఎగవేతలోనూ రకాలు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 hours ago
  • 3 min read

ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే దాన్ని తిరిగి చెల్లించడం మన బాధ్యత. మధ్యతరగతి, సామన్య వర్గాల ప్రజలు అవసరార్ధం చేసిన అప్పును తిరిగి చెల్లించేవరకు నిద్ర కూడా పట్టని స్థితిలో ఉంటారు. ప్రైవేట్ అప్పులతోపాటు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల విషయంలోనూ అదే రీతిలో వ్యవహరిస్తుంటారు. అదే సమయంలో బ్యాంకులు కూడా రుణాల వసూలుకు సంబంధించి ఈ వర్గాల విషయంలోనే కఠినంగా వ్యవహరిస్తుంటాయన్న ఆరోపణలు కొత్తవి కావు. ఒకవైపు బడా వ్యాపారవేత్తలు, పారిశ్రామిక యాజమాన్యాలు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు ఎగిరిపోతున్నా చేష్టలుడిగి చోద్యం చూసే బ్యాంకులు సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికో, వాహనం కొనుగోలుకో రుణం తీసుకుని.. ఒకటి రెండు నెలలు అనుకోని అవాంతరాలు ఎదురై రుణ వాయిదాలు చెల్లించకపోతే మీద పడిపోయి నానాయాగీ చేస్తుంటాయి. బ్యాంకుల రికవరీ అధికార బృందాలు రుణగ్రహీతల ఇళ్లకు వెళ్లి వారిని అవమానించే రీతిలో వ్యవహరిస్తుంటారు. అదే బడాబాబుల విషయంలో అయితే రకరకాల పేర్లతో వారు తీసుకున్న భారీ రుణాలను తిరిగి రాని పద్దుల్లో చేర్చేసి చేతులు దులిపేసుకుంటుంటారు. ఏ రాయి అయితేనేం పళ్లూడగొట్టుకోవడానికి.. అన్నట్లు రూపం, పేరు ఏదైతేనేం.. బడా సంస్థలకు ఇస్తున్న రుణాల విషయంలో బ్యాంకులు ఉదారంగానే వ్యవహరిస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి వెల్లడించిన కొన్ని వివరాలు మొండి బకాయిలను కూడా రెండు రకాలుగా ట్రీట్ చేస్తారని తెలియజెప్పాయి. మంత్రిగారు చెప్పిన వివరాల ప్రకారం గత 12 ఏళ్లలో అంటే దేశంలో నరేంద్ర మోదీ జమానా ప్రారంభమైన నాటి నుంచి 2025 చివరి వరకు దేశంలోని బడా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాల్లో ఏకంగా రూ.9.95 లక్షల కోట్లను బ్యాంకులు రైటాఫ్ చేసేశాయట! మంత్రి పేర్కొన్న మాటల్లో రైటాఫ్ అన్న పదానికి అర్థం మొండి బకాయిలు లేదా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌పీఏ) అని అర్థమని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. మొండి బకాయిలు అంటే అర్థం ఎంతకూ వసూలు కానివేనని కదా! కానీ ఆర్థికశాఖ పరిభాషలో వాటిని సాంకేతికంగా రద్దు చేసిన రుణాలుగా వర్గీకరించి రికార్డుల నుంచి తీసి పక్కన పెట్టేస్తారు. దాంతో బ్యాంకుల ఆర్థిక లావాదేవీలు సక్రమంగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. వాస్తవానికి భారీగా పేరుకుపోయిన మొండి బకాయిల వాస్తవ పరిస్థితి ఏమిటో ఇక బయట ప్రపంచానికి తెలియదు. కానీ రైటాఫ్ చేసిన ఈ తరహా మొండి బకాయిల వసూలుకు చట్టపరంగా తగిన ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయని, అందువల్ల వీటిని రుణమాఫీ చేసినట్లుగా భావించరాదన్నది ఆర్థిక శాఖ, బ్యాంకింగ్ వర్గాల వాదన. దీన్నిబట్టి వసూలు కాని రుణాలను బ్యాంకులు రెండు రకాలుగా వర్గీకరించినా.. వాటి వల్ల ఒనగూడే ఫలితంగా మాత్రం దాదాపు ఒకటేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైటాఫ్ చేసి రికార్డుల నుంచి తొలగించిన మొండి బకాయిల వసూలుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇటువంటి కేసులను బ్యాంకులు డెబ్బ్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్‌టీ) లేదా కోర్టులకు అప్పగించి న్యాయపరంగా ఇరుపక్షాలకు న్యాయసమ్మతమైన సెటిల్‌మెంట్లు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దేశంలో ఇంతవరకు రైటాఫ్ చేసిన రుణాల గణాంకాలను పరిశీలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. గత పదేళ్లలోనే అంటే 2014-15 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు దేశంలోని బ్యాంకులు రూ.16.35 లక్షల రుణాలను రైటాఫ్ చేశాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. కానీ ఆర్థిక శాఖ సహాయమంత్రి చెప్పిన లెక్క మాత్రం రూ.9.95 లక్షల కోట్లే. ఇందులో ఏది నిజమన్నది ప్రభుత్వమే చెప్పాలి. కాగా ఈ కాలంలో కేవలం ప్రభుత్వరంగ బ్యాంకులు రైటాఫ్ చేసిన రుణాలే రూ.12.08 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. బ్యాంకుల వారీగా చూస్తే దేశంలో అతిపెద్దదైన స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఈ బ్యాంకు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.1.14 లక్షల కోట్ల రుణాలను, ఒక్క 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.20,309 కోట్ల రుణాలను రైటాఫ్ చేసింది. UNION బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.85,540 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.81,243 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.70,061 కోట్లు రైటాఫ్ చేసేశాయి. వీటిలో 80 శాతం వరకు అంటే సుమారు రూ.9.26 లక్షల కోట్లు పెద్ద పరిశ్రమలు, సర్వీస్ రంగానికి చెందిన సంస్థలు తీసుకున్న రుణాలే కావడం గమనార్హం. రైటాఫ్ చేసిన రుణాల సంగతి అలా ఉంటే.. రుణ ఎగవేతదారుల వ్యవహారం, వారి పట్ల బ్యాంకుల వైఖరి మరోలా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం చెల్లించే స్తోమత ఉన్నా కూడా చెల్లించకుండా ఎగవేతకు పాల్పడే వ్యక్తులు, సంస్థలను ఉద్దేశపూర్వక ఎగవేతదారులు అంటే విల్‌ఫుల్ డిఫాల్టర్స్‌గా బ్యాంకులు పరిగణిస్తాయి. వీరి విషయంలో రికవరీ ప్రయత్నాలు న్యాయపరంగానే సాగుతుంటాయి. అంటే ట్రిబ్యునళ్లు, కోర్టుల్లో కేసులు బ్యాంకులకు అనుకూలంగా నిర్ణయాలు వస్తే తప్ప ఆ రుణాలు రికవరీ కావడం అసాధ్యం. అయితే రుణగ్రహీతల్లో చాలామంది దేశం విడిచి పారిపోయి, విదేశాల్లో ఆశ్రయం పొందుతుండటం వల్ల ఈ తరహా కేసుల విచారణలో తీవ్ర జాప్యం అనివార్యమవుతున్నది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 2025 మార్చి 31 నాటికి దేశంలో మొత్తం 1629 సంస్థలు లేదా వ్యక్తులను విల్‌ఫుల్ డిఫాల్టర్ల జాబితాలో చేర్చారు. వీరంతా కలిసి ప్రభుత్వరంగ బ్యాంకులకే రూ.1.62 లక్షల కోట్ల రుణాలు ఎగ్గొట్టారు. రంగాలవారీగా చూస్తే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌పీఏ) టాప్ 100 జాబితాలో 34 ఎనర్జీ సంస్థలు, తయారీరంగం నుంచి 32, నిర్మాణ లేదా రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన 20 సంస్థలు ఉన్నాయి. మొత్తానికి పేరు ఏదైనా రైటాఫ్ చేయడం, డిఫాల్టర్‌గా నిర్ణయించడం రెండూ దాదాపు ఒకటేనన్న భావన అధికశాతం మందిలో ఉంది. ఈ రెండు కేటగిరీల్లో రుణాల రికవరీ అన్నది దాదాపు బ్యాంకుల చేతుల్లో లేనట్లే!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page