top of page

ప్రత్యక్ష ఎన్నికల వెనుక వ్యూహం అదేనా?!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 7 hours ago
  • 3 min read

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు జోరందుకున్నాయి. అక్టోబర్‌లోగా ఈ ఎన్నికలు నిర్వహించకపోతే స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికల నిర్వహణకు నడుం కట్టింది. అక్టోబర్‌లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని కూడా ఇదే అంశంపై హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానానికి హామీ ఇచ్చారు. అదే సమయంలో తొలిదశగా ఎటువంటి వివాదాలు లేని వంద మున్సిపాలిటీల్లో ఎన్నికల ఏర్పాట్లు మొదలుపెట్టమని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. కోర్టు కేసులు, వివాదాలు ఉన్న 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విషయంలో సత్వరమే తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నది. రెండు రోజుల క్రితం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికల అంశంపై చర్చించారు. పురపాలక ఎన్నికలతో మొదలుపెట్టి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లాపరిషత్.. చివరిగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని స్థూలంగా నిర్ణయించారు. అయితే కేబినెట్ భేటీలో తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్, ఎంపీపీ అధ్యక్ష పదవులకు ఇంతవరకు ఉన్న పరోక్ష పద్ధతి కాకుండా ప్రత్యక్ష ఎన్నిక జరపాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రత్యక్ష పద్ధతి వల్ల ప్రయోజనాలు ఏమిటి? పరోక్ష పద్ధతి ఎందుకు వద్దనుకున్నారు? మధ్యలో కొంతకాలం మినహా కొన్ని దశాబ్దాలపాటు అమల్లో ఉన్న పరోక్ష ఎన్నిక విధానంలో ఉన్న నష్టాలేమిటి? అన్న ప్రశ్నలు.. వాటిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పరోక్ష ఎన్నిక విధానమే రాష్ట్రంలో ఎక్కువకాలం కొనసాగింది. అయితే తెలుగుదేశం పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత ఎన్టీరామారావు స్థానిక సంస్థల్లో సంస్కరణలు చేపట్టారు. సమితులు, తాలూకా వ్యవస్థలను రద్దు చేసి మాండలిక వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. ఆ క్రమంలోనే లోకల్ బాడీస్ అధ్యక్షులను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా మార్పులు చేశారు. 1986లో దేశంలోనే తొలిసారి పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవస్థల్లో ఈ మార్పులను అమలు చేశారు. ఆ మేరకు 1987లో జరిగిన స్థానిక ఎన్నికల్లో మున్సిపాలిటీలు, జిల్లాపరిషత్ అధ్యక్షులను నేరుగా ప్రజల ఓటు ద్వారానే ఎన్నుకున్నారు. అంటే ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఒక ఓట్లు, ఎంపీకి ఒక ఓటు వేసినట్లే.. స్థానిక ఎన్నికల్లోనూ అధ్యక్షుడికి ఒక ఓటు.. అలాగే వార్డు సభ్యుడు లేదా స్థానిక ప్రతినిధికి ఒక్కో ఓటు చొప్పున వేయాల్సి ఉంటుంది. అలా స్థానిక సంస్థల సభ్యుల మెజారిటీతో సంబంధం లేకుండా ప్రజలు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే వారే అధ్యకా పగ్గాలు చేపట్టేదే ప్రత్యక్ష ఎన్నిక విధానం. ప్రత్యక్ష ఎన్నిక విధానంలో స్థానిక సంస్థలను ఆయా సంస్థల సభ్యులతో ప్రమేయం లేకుండా ప్రజలే నేరుగా ఎన్నికవ్వడం వల్ల అధ్యక్షులను ఎన్నుకునేందుకు అవసరమైన సభ్యుల మెజారిటీని కూడగట్టుకునేందుకు హార్స్ ట్రేడింగ్ లేదా కొనగోళ్లు, ఇతర ప్రలోభాలకు అవకాశం ఉండదు. ఇప్పుడున్న విధానంలో అత్తెసరు మెజారిటీ ఉన్న సందర్భాల్లో జెడ్పీటీసీలను ప్రలోభపెట్టి ఛైర్మన్లను, కౌన్సిలర్లను కొనుగోలు చేసి మున్సిపల్ ఛైర్మన్లు తమవారిని ఎన్నుకునేలా పార్టీలు మంత్రాంగం నెరుపుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఈ విషయంలో ముందుంటున్నాయన్ని ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యక్ష ఎన్నిక ద్వారా అధ్యక్షులను ప్రజలే ఎన్నుకుంటూ ఈ అనైతిక, అప్రజాస్వామిక చర్యలకు ఆస్కారం ఉండదు. ప్రజల నుంచే నేరుగా ఎన్నికయ్యే అధ్యక్షులు పాలనలో సభ్యుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పరోక్ష ఎన్నిక విధానంలో పదవీ కాలంలో ఉన్నన్నాళ్లూ సభ్యుల దయాదాక్షిణ్యాల కోసం పాకులాడాల్సి వస్తుంది. లేకపోతే అవిశ్వాస తీర్మానాల గండాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గత ఐదేళ్ల కాలంలో 40 మున్సిపాలిటీలు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కోవడం ఈ పరిస్థితికి నిదర్శనం. దీనివల్ల పరిపాలన సజావుగా సాగే అవకాశం ఉండదు. ప్రత్యక్ష ఎన్నిక విధానం వీటిని పరిహరిస్తుంది. 1990`92 మధ్య అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల అధ్యక్ష పదవులకు ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని రద్దు చేసింది. 1994లో 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో ఐదంచెల వ్యవస్థగా మారినా జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల అధ్యక్షులకు పరోక్ష ఎన్నిక విధానమే కొనసాగింది. ఈ విధానానికి అనుకూలంగానూ ఆనాటి ప్రభుత్వాలు కొన్ని వాదనలు వినిపించాయి. ప్రత్యక్ష ఎన్నిక విధానం వల్ల ఒక పార్టీ అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నికై, ఆ సంస్థలో సదరు పార్టీ సభ్యులు తక్కువగా ఉంటే పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతాయన్నది పరోక్ష విధానాన్ని సమర్థిస్తువారి వాదన. ఉదాహరణకు ఒక జిల్లాపరిషత్ లేదా మున్సిపాలిటీలో మెజారిటీ సభ్యులు ఒక పార్టీ నుంచి, అధ్యక్షుడు మరో పార్టీ నుంచి ఎన్నికైతే ఆ సంస్థలో పరిపాలన స్తంభించిపోతుంది. పరిపాలన, అభివృద్ధిపరమైన అంశాలకు ఆమోదం పొందలేక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉన్నందున ఎన్నికల ఖర్చు భారమవుతుంది. అక్రమాలు కూడా పెరుగుతాయి. అధ్యక్షుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించే అవకాశం పరోక్ష విధానంలో లభిస్తుంది. కానీ ప్రజల నుంచి ఎన్నికైన అధ్యక్షులను ఎన్నికల్లో ఓడించడం తప్ప పదవీకాలం మధ్యలో అవిశ్వాస తీర్మానం ద్వారా తప్పించే అవకాశం ఉండదు. ఇది అంతిమంగా నియంతృత్వానికి దారి తీసే ప్రమాదముందని ప్రత్యక్ష విధానాన్ని వ్యతిరేకించేవారు వాదిస్తున్నారు. వీటన్నింటికంటే మిత్రపక్షాలతో సీట్ షేరింగులో ఎక్కువ కోటా దక్కించుకోవడమే ప్రత్యక్ష ఎన్నికల వెనుక చంద్రబాబు అసలు వ్యూహమని అంటున్నారు. మున్సిపల్, జిల్లాస్థాయిలో నేరుగా గెలిచే సత్తా లేని మిత్రపక్షాలు ఎక్కువ సీట్ల కోసం పట్టుబట్టవన్నది ఆయన అంచనాగా కనిపిస్తున్నది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page