‘‘ ఛాంపియన్ ’’ గోల్ పడలేదు
- Guest Writer
- Dec 27, 2025
- 3 min read

‘‘పెళ్లిసందడి’’ తర్వాత ఏకంగా నాలుగేళ్లకి రోషన్ ఈ సినిమాతో ముందుకొచ్చాడు. ‘‘గిర గిర..’’ పాట సూపర్ హిట్ అవడం ఈ చిత్రానికి కలిసొచ్చిన అతి పెద్ద ప్రచారం. ట్రైలర్ చూస్తే పీరియడ్ బ్యాక్ డ్రాప్ అని, తెలంగాణా సాయుధ పోరాటం నాటి కథ అని తెలుస్తూనే ఉంది.
కథలోకి వెళ్లితే భైరాన్ పల్లి అనే ఒక ఊరు నిజాం పాలనను వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఆ ఊరి పెద్ద రాజిరెడ్డి (కళ్యాణ చక్రవర్తి). అయితే ఆ ఊరిని ఎలాగైనా తమ కాళ్లకిందకి తెచ్చుకోవాలని రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ (కెకె మీనన్) పట్టుదలగా ఉంటాడు. ఇదిలా ఉంటే మైకేల్ విలియంస్ (రోషన్) ఒక ఫుట్ బాల్ ఆటగాడు. తన ఆటను మెచ్చి ఒక క్లబ్ అధినేత లండన్ కు వచ్చి తమ టీములో చేరమంటాడు. అది ఎలాగూ మైకేల్ చిరకాల వాంఛ. అయితే అతనికొక అవాంతరం ఎదురవుతుంది. దానిని దాటి లండన్ విమానం ఎక్కడానికి ఒక గన్ డీలర్ తో డీల్ కుదుర్చుకుంటాడు. కొన్ని తుపాకుల్ని పోలీసుల కళ్లుగప్పి ఒక చోటుకి చేర్చడం ఆ డీల్. ఆ క్రమంలో దారి తప్పి భైరాన్ పల్లి చేరతాడు మైకేల్. అక్కడ చంద్రకళ (అనస్వర) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమౌతుంది? రజాకార్ల నుంచి ఆ ఊరు ఏ విధంగా రక్షింపబడుతుంది. మైకేల్ లండన్ వెళ్తాడా? ఈ ప్రశ్నలకి సమాధానం ఈ చిత్రం.
తెలంగాణా సాయుధ పోరాటం మీద ఆ మధ్యన ‘‘రజాకర్’’ పేరుతో ఒక సినిమా వచ్చింది. జనాదరణ లభించలేదు. ఎందుకో గానీ స్వాతంత్య్ర పోరాటాల కథల్ని తెరకెక్కించడంలో మూస పద్ధతి వల్ల ఫెయిల్ అవుతున్నాయని అనిపిస్తుంది.
ఈ చిర విషయానికొస్తే.. ఒక గ్రామం, నిజాం పాలనపై తిరుగుబాటు..ఆ గ్రామంలో కమ్మరి, కుమ్మరి, బ్రాహ్మణ, రెడ్డి%ౌ%ఇలా అందరూ పోరాటయోధులే.. వాళ్ల ఐకమత్యం, అన్యోన్యత చూస్తే వీళ్లంతా పోరాటంలో పోతారని ఈ తరహా సినిమాలు అనేకం చూసేసిన ప్రేక్షకులకి తెలుస్తూనే ఉంటుంది. అందుకే, ప్రెడిక్టెబిలిటీ మూలాన వాళ్లు పోతున్నా ఎటువంటి ఫీలింగూ రాదు. దానికి తోడు సుదీర్ఘమైన పోరాట సన్నివేశాలు. మధ్యలో హీరో హీరోయిన్ల ఎమోషనల్ రొమాన్స్! వెరసి సహనానికి పరీక్ష పెట్టినట్టయ్యింది.
తెలిసిన నటీనటులు చాలామంది ఉండడం వల్ల నిర్మాణ విలువలు తెర మీద కనిపిస్తాయి. మిక్కీ జె మేయెర్ సంగీతం పాటల్ని చక్కగా నిలబెట్టింది. ఇంత స్పష్టంగా సాహిత్యం వింపడి చాలా నాళ్లయ్యింది. హీరోయిన్ అందంగా ఉంది. అయినా ఏం లాభం? కథ, కథాగమనాల్లో కొత్తదనం, ఉత్కంఠ లేకపోవడం వలన తీరం దాటని తుఫానులో ఇరుక్కున్నట్టయ్యింది ప్రేక్షకుల పరిస్థితి. పైగా క్లైమాక్స్ కి వచ్చేసరికి ఎంతో కొంత పోయెటిక్ జస్టిస్ జరగాలి. ప్రతిఘటించిన ఊరి జనం సాధించింది ఏముంది అనే ప్రశ్న సగటు ప్రేక్షకుడికి వస్తుంది. వాళ్ల త్యాగం భారతదేశంలో హైదరాబాద్ విలీనానికి స్ఫూర్తి అయ్యిందని సర్దార్ పటేల్ పాత్రచేత చెప్పించినా, సగటు ప్రేక్షకుడికి మనసు నిండదు.
ఒకప్పటి ‘‘లగాన్’’ శైలి కొంత కనిపిస్తుంది. ‘‘ఛావా’’లో హీరోకి తనకి తాను చిన్నపిల్లవాడిగా కనిపిస్తున్న కల, అందులో తండ్రి వాయిస్ వినిపించడం అనె ట్రాక్ ఉంది.. దానిని కూడా ఇందులో వాడారనిపిస్తుంది. ఇతర చిత్రాల నుంచి స్ఫూర్తి పొందడంలో తప్పు లేదు. అయితే ఓవరాల్ గా ఎమోషన్ అందాలి.
ఇందులో పెద్ద లోపమేమిటంటే, ఏ ఎపిసోడ్ ఎంత సేపు చెప్పాలో తూకం మిస్సవడం. ఆ తర్వాత హీరో, హీరోయిన్ మధ్యన మనసుకి హత్తుకునేంత ప్రేమకథలేకపోవడం. ఈ రెండూ కుదిరి ఉంటే సినిమా నిడివి తగ్గి స్క్రీన్ ప్లే పాకన పడి ఉండేది, చక్కని ఎమోషనల్ ఫీల్ కూడా వర్కౌట్ అయ్యి ఉండేది. రోషన్ పాత్రకి పర్ఫెక్ట్ గా సరిపోయాడు. పనితనం కూడా బాగానే చూపించాడు. అనస్వర రాజన్ చూడడానికి బాగుంది. నటనాప్రతిభ కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అయితే ఆమె నుంచి అరెస్టింగ్ పర్ఫార్మెన్స్ చూడడానికి దర్సకుడు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. వెన్నెల కిషోర్, కోవై సరళ ప్రధార్ధంలో కాసేపు వచ్చే పాత్రలు. రచ్చ రవి, మురళిధర్ గౌడ్ తదితరులు తమ ఉనికి చాటుకునేంత పాత్రల్ని పోషించారు. చాలాకాలం తర్వాత కనిపించిన కళ్యాణ చక్రవర్తికి ఈ పాత్ర నప్పినా, యాస తేడా కొట్టింది. దుల్కర్ సల్మాన్ ది సింగిల్ సీన్ కేమియో! బాలనటిగా పేరు తెచ్చుకున్న ఇండో-అమెరికన్ నటి అవంతిక ఒక స్పెషల్ సాంగులో కనపడిరది. సర్దార్ పటేల్ గా ప్రకాష్ రాజ్, ఖాసిం రజ్వీ గా కెకె మీనన్, సుందరయ్యగా మురళిశర్మ, షోయబుల్లా ఖాన్ గా రవీంద్ర విజయ్.. ఇలా చారిత్రాత్మకమైన పాత్రల్ని కథలోకి కలిపడం బాగానే ఉంది. కానీ మొత్తం ప్రెడిక్టెబుల్ గా ప్రధాన కథ నడవడం వల్ల, మరీ ముఖ్యంగా ద్వితీయార్ధంలో ఎడతెగని డ్రామా వల్ల అనుభూతి కలగదు.
చివరగా చెప్పాలంటే, ఒక ఫుట్ బాల్ ఆటగాడు దారి తప్పి ఒక గ్రామానికి చేరడం వల్ల, అతని జీవితం ఏ దారి తీసుకుందనే ఈ చిత్రకథ. దేశభక్తి, త్యాగం, ఐకమత్యం లాంటి గుణాలన్నీ ఫోర్స్డ్ గా చెప్పిన కథనం. ప్రధాన కథలో రొమాంటిక్ ట్రాక్, హీరోయిన్ డ్రామా ఎపిసోడ్ వినోదం కోసం బలవంతంగా పెట్టినట్టు అనిపిస్తుంది తప్ప ఆర్గానిక్ గా మిక్స్ అవ్వదు. కనుక ‘‘గిర గిర..’’ పాట చూసి ఇందులో కావాల్సినంత వినోదం, లవ్ స్టోరీ ఉందనుకుంటే పొరపాటే. ఇది ప్రెడిక్టెబుల్ కథనంతో సాగే ఒక సుదీర్ఘ సాయుధపోరాట గాధ. ఫుట్ బాల్ ‘‘ఛాంపియన్’’ గా తెర మీద హీరో గోల్ కొట్టాడు కానీ, ఈ చిత్రం మాత్రం ప్రేక్షకుల మనసు అనే గోల్ ని కొట్టలేకపోయింది.
- గ్రేటాంధ్ర సౌజన్యంతో...










Comments