top of page

జటాధర దడా దడ.. ఇంకో పార్ట్‌ కూడా ఉంది !

  • Guest Writer
  • Nov 8, 2025
  • 2 min read

ఇప్పటికీ అక్కడక్కడా ఫలానా గ్రామంలో లంకె బిందెల కోసం క్షుద్ర పూజలు.. ఫలానా గ్రామంలో లంకె బిందెల కోసం పొలంలో మట్టిని తవ్విన గుర్తు తెలియని వ్యక్తులు.. లంకె బిందెల కోసం బలి ఇచ్చిన తాంత్రికులు అంటూ పేపర్లలో రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. పూర్వం శత్రు రాజుల నుంచి కాపాడుకోవడానికి రాజులూ, బందిపోటు దొంగల నుంచి కాపాడుకోవడానికి ధనవంతులూ ఇంట్లో ఉన్న మణులు, మాణిక్యాలను, బంగారాన్ని లంకె బిందెల్లో దాచి భూముల్లో పాతి పెట్టి దాచుకునేవారు. అప్పట్లో ఇప్పట్లా బ్యాంకు లాకర్లవీ లేవు కదా.. అంచేత ఆ ఏర్పాట్లు అన్నమాట. యెంత భూముల్లో పాతిపెట్టినా దోచుకునేవాడికి తవ్వడం ఓ లెక్కా ?అంచేత ఎంచక్కా తవ్వి లంకె బిందెలను పట్టుకుపోయేవాళ్లు. బంగారాన్ని లాకర్లో అయితే పెట్టాం కానీ దానికి తాళం వేయడం మర్చిపోయాం అని గ్రహించారు పిచ్చి మారాజులు. అప్పుడు వేశారు బంధనాలు.. లంకె బిందెలను భూముల్లో పాతి నాగ బంధనం , పిశాచ బంధనం వంటి రకరకాల బంధనాలు రకరకాల బంధనాలు వేసేవారు. ఇప్పుడు ఒకవేళ బందిపోట్లు లంకె బిందెల కోసం భూములు తవ్వితే ఈ బంధనాలు వల్ల అక్కడికక్కడే టపా కట్టేవారని ఓ కథ ఉండేది.. ఆగండాగండి.. జటాధరా మూవీ రివ్యూ అని చెప్పి చరిత్ర రాస్తున్నా అనుకుంటున్నారా ?క్లుప్తంగా జటధరా మూవీ స్టోరీ ఇదే.. ఆ లంకె బిందెల వార్తల పేపర్‌ కటింగులను తీసుకుని స్టోరీ అల్లేసుకుని సుధీర్‌ బాబుతో మూవీ తీసేశారన్న మాట.


సరే , ఇప్పుడు ఈ జటధరా స్టోరీ ఏంటో కూడా చూద్దాం.. ఈ మూవీలో శివ (సుధీర్‌బాబు) దయ్యాలను నమ్మడు.. (అలాంటి వాడికే కదా దయ్యాలు కనిపించేది). ప్రత్యేకంగా దయ్యాలు ఎక్కడున్నాయా అని అతడు రీసెర్చ్‌ చేస్తూ ఉంటాడు. ఓ రోజు రుద్రారం అనే గ్రామంలో ఇతడి స్నేహితుడు అనుమానాస్పదంగా మరణించడంతో విషయమేంటో కనుక్కుందామని ఆ గ్రామానికి బయలుదేరతాడు. ఈ విషయం అతడి తల్లితండ్రులకు (రాజీవ్‌ కనకాల, రaాన్సీ ) తెలిసి శివని ఎట్టి పరిస్థితుల్లో రుద్రారం గ్రామం వెళ్లవద్దని చెప్తూ ఓ ఫ్లాష్‌ బ్యాక్‌ చెప్తారు. అయినా శివ రుద్రారం వెళ్తాడు. ఇంతకీ శివ తల్లితండ్రులు చెప్పిన ఫ్లాష్‌ బ్యాక్‌ ఏంటి ? రుద్రారం గ్రామానికి శివకు ఉన్న కనెక్షన్స్‌ ఏంటి ?రుద్రారం గ్రామంలో పాడుబడ్డ ఇంటిలో ధన పిశాచం ఉండటం వెనుక అసలు కధేంటి అనే విషయాలు మూవీలో తెలుస్తాయి.

సినిమా ఎలా ఉంది ?

ముందే చెప్పినట్టు పేపర్‌ కటింగులు చూసి కథ రాసుకున్నట్టు ఉంది. ఈ దయ్యాలు , పిశాచాలు ప్రధాన పాత్రల్లో గతంలో కూడా చాలా సినిమాలు వచ్చాయి. థియేటర్లో ఏసీ ఫుల్లుగా వేస్తె ప్రేక్షకులు ఎలాగూ గజగజా వణుకుతారు. ఏసీ వేయకపోయినా ప్రేక్షకుడు గజగజా వణికితేనే హర్రర్‌ మూవీకి గిట్టుబాటు.. ఆ గిట్టుబాటు ఇందులో లేదు. పిశాచాన్ని పిశాచంలానే చూపించి ప్రేక్షకులను భయపెట్టాలి. అంతే కానీ పిశాచం పేరు ముందు ధన ఉందికదా అని లలితా జ్యువెలర్స్‌ బంగారం మొత్తాన్ని ఒంటి మీద దిగేసుకొని ధన పిశాచం వచ్చింది భయపడండి అంటే భయపడకపోగా ఆడ ప్రేక్షకులు ఆ బంగారం డిజైన్ల గురించి ముచ్చటించుకునే ప్రమాదం ఉంది. అంచేత దయ్యాల మీద సినిమాలు తీసేవాళ్ళు పాత విఠలాచార్య సినిమాలు చూడాలని మనవి.

ఇంకోటేంటంటే మనం దయ్యాలు, పిశాచాలు, లంకె బిందెలు అంటూ భయంకరమైన భయపెట్టే ఇతివృత్తాలను తీసుకున్నప్పుడు ప్రేమలు, దోమలు చూపెడితే ప్రేక్షకులకు పంటి కింది రాయిలా కటక్కున మండుద్ది. ఈ మూవీలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు హైదరాబాద్‌ గల్లీల్లో ఉండే ఎత్తైన స్పీడ్‌ బ్రేకర్ల మాదిరి అడ్డొస్తూ ఉంటాయి. ఈ స్పీడ్‌ బ్రేకర్ల వల్ల ఫాస్ట్‌గా వెళ్తుంది అనుకున్న బండికి సడెన్‌ బ్రేకులు పడుతూ ఉంటాయి.

ఎవరెలా చేసారు ?

శివ పాత్ర పోషించిన హీరో సుధీర్‌ బాబు సిన్సియర్‌గా కష్టపడ్డాడు. నటన పరంగా అతడ్ని తప్పు పట్టడానికి ఏమీ లేదు.. లోపమల్లా దర్శకత్వంలోనే సుధీర్‌కి జోడీగా నటించిన దివ్య కోస్లా నటన పర్లేదు నెగిటివ్‌ షేడ్‌ లో శిల్ప శిరోడ్కర్‌ నటన కూడా పర్లేదు. ధన పిశాచిగా చేసిన సోనాక్షి సిన్హా భయపెట్టలేకపోగా రకరకాల డిజైన్ల బంగారు ఆభరణాలు వేసి ప్రేక్షకులను మురిపించింది. ఇలాంటి సినిమాలకు గ్రాఫిక్స్‌, బీజీఎమ్‌ ప్రాణం పోస్తాయి. ఈ సినిమాలో అవి మిస్‌ అయ్యాయి. ఓవరాల్‌గా కథని సరైన విధంగా వెండి తెర మీద ప్రెజెంట్‌ చేయలేకపోయిన దర్శక వైఫల్యం జటధరా.. అన్నట్టు ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు.. బహుశా సరైన కో`ఆర్డినేషన్‌ లేకపోవడం కూడా కారణం అయ్యుండొచ్చు. ఇంకో అన్నట్టు ఈ జటాధర దడా దడ రెండో పార్ట్‌ కూడా ఉన్నదట !


- పరేష్‌ తుర్లపాటి

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page