డ్రగ్స్ డెన్‌ను కూల్చిన.. ఆపరేషన్ ‘కూలీ’!
- DV RAMANA

- Sep 9, 2025
- 2 min read

మహిళ ఇచ్చిన సమాచారంతో కదిలిన డొంక
హైదరాబాద్‌లో మూలాలు కనుగొన్న మహారాష్ట్ర పోలీసులు
కెమికల్స్ ముసుగులో మాదకద్రవ్యాల తయారీ
నెలరోజులకుపైగా డ్రగ్స్ డెన్‌లోనే రహస్యంగా పాగా
గుట్టుమట్లన్నీ తెలుసుకున్నాక మెరుపు దాడి
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ఓ మహిళ ఇచ్చిన చిన్న క్లూ.. ఆపై ఓ సాధారణ అధికారి చాలా రిస్క్ తీసుకుని కూలీగా వెళ్లి చేసిన అండర్ కవర్ ఆపరేషన్ ఏకంగా ఓ డ్రగ్స్ (మాదకద్రవ్యాలు) తయారీ సామ్రాజాన్ని కుప్పకూల్చాయి. ఏకంగా రూ.12 వేల కోట్లకుపైగా విలువైన మత్తుపదార్థాలు, వాటి తయారీ సామగ్రి స్వాధీనానికి దారితీశాయి. హైదరాబాద్ నగరంలోనే అత్యంత పకడ్బందీగా సాగుతున్న మత్తు దందా గుట్టును రట్టు చేశాయి. ఆ నగర పరిధిలోని చర్లపల్లిలో వాగ్దేవి ల్యాబ్ పేరుతో ఔషధ తయారీ యూనిట్ ముసుగులో ఈ అతిపెద్ద డ్రగ్స్ డెన్ గుట్టును ఇన్నాళ్లూ తెలంగాణ పోలీసులకు చిక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. డ్రగ్స్‌తో పట్టుబడిన ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో మహారాష్ట్రలో తీగలాగితే ఇక్కడ హైదరాబాద్‌లో డ్రగ్స్ డొంకంతా కదిలడం విశేషం. ఇన్నాళ్లూ మాదకద్రవ్యాల గురించి మాట్లాడితే గోదా బీచ్‌లు, ఫాంహౌస్ పార్టీలు, పబ్‌లే ప్రస్తావనకు వచ్చేవి. అయితే అవన్నీ కేవలం ఎక్కడి నుంచో సరఫరా అయ్యే మత్తు పదార్థాలను సేవించేవారి అడ్డాలు మాత్రమే. ఆయా ప్రాంతాల్లో ఎన్ని దాడులు చేసినా కొద్దిమొత్తాలోనే డ్రగ్స్ దొరుకుతున్నాయి తప్ప.. అసలు సూత్రధారులు, వాటి తయారీదారులు ఒకటీ అరా కేసుల్లో తప్ప దొరకడం లేదు. కానీ హైదరాబాద్ నడిబొడ్డును ఫార్మా కంపెనీ ముసుగులో మత్తుమందులను భారీస్థాయిలో తయారు చేస్తుండటం, ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్లు ఒక్క చిన్న క్లూతో మహారాష్ట్ర పోలీసులు దాన్ని ఛేదించడం పెద్ద విజయమే.
డ్రగ్స్ అంటే ఎక్కడో విదేశాల నుంచి దొంగచాటుకు మన దేశంలోకి రవాణా చేసి ఇక్కడ రహస్యంగా వాటిని అమ్ముతుంటారని ఇన్నాళ్లూ భావిస్తున్నాం. పోలీసులు కూడా అదే చెబుతూ వస్తున్నారు. అందులో వాస్తవం లేకపోలేదు. కానీ దానికి మించి మన ముంగిటే.. మన హైదరాబాద్‌లోనే నిషేధిత మత్తుమందులు తయారవుతుండటం సంచలనం రేపుతోంది. హైదరాబాద్‌లోని చర్లపల్లి ప్రాంతంలో ఉన్న వాగ్దేవి ల్యాబ్‌పై మహారాష్ట్ర పోలీసులు దాడి చేయడంతో దాని గుట్టు రట్టయ్యింది. కెమికల్ ఫ్యాక్టరీ ముసుగు డ్రగ్స్ తయారీకి పాల్పడుతున్నట్లు తేలింది. ఈ దాడుల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.12వేల కోట్లు విలువ చేసే 32వేల లీటర్ల రా మెటీరియల్‌తో సహా అమ్మకానికి సిద్ధంగా ఉన్న 5.79 కిలోల మెఫిడ్రిన్(ఎండీ) అనే మాదకద్రవ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వాగ్దేవి ల్యాబ్స్ డైరెక్టర్ శ్రీనివాస్‌తోపాటు 13 మందిని అరెస్టు చేశారు. వారిలో ఓ కెమికల్స్ నిపుణుడు కూడా ఉండటం విశేషం.
నెలరోజులకుపైగా నిఘా
కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రలోని మిరీ`భయందర్ పోలీసులు రెగ్యులర్ విధుల్లో భాగంగా సోదాలు నిర్వహిస్తుండగా ఓ బంగ్లాదేశీ మహిళ అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ఆమెను సోదా చేయగా నిషేధిత ఎండీ డ్రగ్ లభించింది. దాంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో తీగ కదిలింది. హైదరాబాద్‌లోని వాగ్దేవి ల్యాబ్ గురించి ఉప్పందింది. ఆమె ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు కేసును నార్కోటిక్స్ బ్యూరోకు బదిలీ చేశారు. కేసును టేకప్ చేసిన నార్కోటిక్స్ అధికారులు తొందరపడకుండా పూర్తి వివరాలు సేకరించడానికి నడుం కట్టారు. బంగ్లాదేశీ మహిళ ఇచ్చిన సమాచారం వాస్తవమా కాదా అనేది ముందు నిర్థారించుకున్నారు. అది కరెక్టేనని డ్రగ్స్ ముఠా మూలాలు హైదరాబాద్‌లోని వాగ్దేవి ల్యాబ్‌లో ఉన్నాయని తేలడంతో విస్మయానికి గురయ్యారు. ల్యాబ్ గుట్టును బయటకు లాగేందుకు రహస్య ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా తమ విభాగానికే చెందిన ఓ అధికారిని రంగంలోకి దించారు. ఆ మేరకు హైదరాబాద్ చేరుకున్న ఆ అధికారి కూలీ అవతరామెత్తి వాగ్దేవి ల్యాబ్‌లో కొందరిని మేనేజ్ చేసి పని సంపాదించడం ద్వారా అందులో పాగా వేశారు. ఆ విధంగా నెలరోజులకుపైగా కూలీగా ఉంటూ ఆ ఫ్యాక్టరీలో జరుగుతున్న డ్రగ్స్ తయారీ దందా వివరాలను పూర్తిగా సేకరించారు. ఆయన సంపాదించిన ఆధారాలు, సమాచారం ఆధారంగా మహారాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో అధికారుల బృందం హైదరాబాద్ చేరుకుని వాగ్దేవి ల్యాబ్‌పై ఆకస్మిక దాడి చేసి మొత్తం బండారం బయటపెట్టింది. ఫ్యాక్టరీలో నిషేధిత డ్రగ్స్ తయారు చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఈ దాడిలో గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైన మోలీ, ఎక్స్‌టీసీ అనే డ్రగ్స్ ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నట్లు పోలీసులు తేల్చారు. మిథైలెనెడియాక్సీ మెథాంఫెటమైన్ ముడి పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీకి ఆధునిక యంత్రాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ ముఠా పెద్ద నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లు తెలిసింది.
గతంలోనూ ఈ సంస్థపై కేసు
డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న ఆరోపణలపై వాగ్దేవి ల్యాబ్ డైరెక్టర్ శ్రీనివాస్‌ను ముంబై యాంటీ నార్కోటిక్ టీమ్ కస్టడీలోకి తీసుకుంది. ఫ్యాక్టరీని సీజ్ చేశారు. శ్రీనివాస్‌తో పాటు తానాజీ పండరినాథ్ అనే వ్యక్తి సహా మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ గతంలో కూడా డ్రగ్స్ కేసులో దొరికపోయారు. అయితే పలుకుబడితో అరెస్టు కాకుండా తప్పించుకున్నారు. ఈసారి ఏకంగా మహారాష్ట్ర నార్కోటిక్ విభాగం అధికారులే అరెస్టు చేయడంతో తప్పించుకునే పప్పులేవీ ఉడక్కపోవచ్చు.










Comments