సంక్షోభంలో సరుకు రవాణా!
- DV RAMANA

- 2 hours ago
- 2 min read
యుద్ధంతో హర్మూజ్ జలసంధి వద్ద ట్రాఫిక్ జామ్
విశాఖ నుంచి వెళ్లిన కంటైనర్లు పీఛేముడ్
10వేల వరకు వెనక్కి వస్తాయని అంచనా
ఇలా జరగడం పోర్టు చరిత్రలో ఇదే తొలిసారి
సరుకు చెడిపోతుందని ఎగుమతిదారుల ఆందోళన

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధజ్వాలలు ప్రపంచమంతటికీ విస్తరిస్తున్నాయి. దాదాపు అన్ని రంగాలను కమ్మేస్తున్నాయి. విమానయానం, అంతర్జాతీయ వాణిజ్యం, ఇతర అనేక రంగాల ఎగుమతులు, దిగుమతులు దెబ్బతింటూ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల వెన్ను విరుగుతోంది. జలరవాణా కూడా ఈ సంక్షోభం బారిన పడి విలవిల్లాడుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన రకరకాల ఉత్పత్తులు విశాఖ పోర్టు ద్వారా విదేశాలకు రవాణా అవుతుంటాయి. అందుకోసమే విశాఖ నగరంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా కోట్ల రూపాయల విలువైన వస్తూత్పత్తులు భారీ కంటైనర్లు, షిప్పుల ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అలాగే విదేశాల నుంచి ఇక్కడికి దిగుమతి అవుతుంటాయి. అయితే ఇరాన్, అమెరికా`ఇజ్రాయెల్ యుద్ధం విశాఖ కేంద్రంగా జరిగే అంతర్జాతీయ సముద్ర వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బకొడుతోంది. విశాఖ పోర్టు నుంచి నిత్యం వందలాది కంటైనర్లతో పశ్చిమాసియాతో సహా అనేక దేశాలకు జరిగే ఎగుమతులన్నీ పర్షియన్ గల్ఫ్‌లోని హర్మూజ్ జలసంధి మీదుగానే జరుగుతాయి. కంటైనర్ షిప్పులన్ని ఆ జలసంధిని దాటి వెళ్లాల్సిందే. కానీ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధిని ముసివేస్తామని ప్రకటించడంతోపాటు హర్మూజ్‌లో ప్రవేశించిన రెండు మూడు కార్గో రవాణా నౌకలపై దాడులు చేయడంతో ఈ మార్గం దాదాపు మూతపడింది. ప్రపంచ దేశాలకు చెందిన వందలాది నౌకలు ఆ ప్రాంతంలో చిక్కుకున్నాయి. విశాఖ నుంచి వెళ్లిన కంటైనర్లదీ అదే పరిస్థితి. ఇక్కడి నుంచి వివిధ దేశాలకు వెళ్లిన కంటైనర్లు గమ్యస్థానాలకు చేరుకునే పరిస్థితి లేక అక్కడే చిక్కుకున్నాయి. దాడులు భీకరంగా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో హర్మూజ్‌లో ప్రయాణం చేయడం కూడా అత్యంత ప్రమాదకరమని భావించిన అధికారులు ఆ నౌకలన్నింటినీ వెనక్కి రప్పిస్తున్నారు. సరుకులతో వెళ్లిన నౌకలు గమ్యస్థానం చేరకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితులు విశాఖ పోర్టు చరిత్రలో ఇదే మొదటిసారి అని పోర్టు అధికారవర్గాలు పేర్కొన్నాయి.
కార్గోకు కష్టకాలం
విశాఖ పోర్టు నుంచి నిత్యం 80 నుంచి 90 కంటైనర్లు సరుకులతో విదేశాలకు వెళ్తుంటాయి. రొయ్యలు, చేపలు వంటి సీఫుడ్స్, ఫార్మా ఉత్పత్తులు, జీడిపప్పు వంటి విలువైన సరుకులు ఎగుమతి అవుతుంటాయి. ఎక్కువ రోజులు బయట నిల్వ ఉంచితే ఇవి పాడైపోతాయి. రవాణాలో ఉన్నప్పుడు అవి చెడిపోకుండా రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లను వినియోగిస్తుంటారు. వీటిని యార్డులో ఉంచడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఒక్కో కంటైనర్ రోజువారీ నిర్వహణకు రూ. ఐదువేల విద్యుత్ ఖర్చు భరించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు యుద్ధం ముగిసి, హర్మూజ్ జలసంధిని నౌకల రవాణాకు అనుమతించే వరకు అక్కడే వాటిని ఉంచితే రవాణా వల్ల వచ్చే ఆదాయం కంటే నిర్వహణ ఖర్చులే తడిసిమోపెడవుతాయి. మరోవైపు ఎక్కువ రోజులు సముద్రంలోనే ఉంటే సీఫుడ్స్ వంటి ఉత్పత్తులు పాడైపోయి భారీ నష్టం వాటిల్లుతుంది. వీటన్నింటినీ పరిశీలించిన అధికారులు, కార్గో నిర్వాహక సంస్థలు హర్మూజ్ నుంచే కార్గో నౌకలను వెనక్కి తీసుకొస్తున్నారు. ఆ విధంగా సుమారు పదివేల కంటైనర్లు విశాఖకు తిరిగి రానున్నాయని అంచనా వేస్తున్నారు.
నిల్వ సౌకర్యాలు తక్కువే
కార్గో నౌకలు తిరిగి రావడం కూడా మరో సంక్షోభానికి దారి తీయనుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ఒకేసారి వేలసంఖ్యలో కంటైనర్లు తిరిగి వస్తుండటంతో వాటిని ఉంచడానికి పోర్టు యార్డుల్లో 16వేల చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించాలని కంటైనర్ టెర్మినల్ అధికారులు పోర్టు అథారిటీకి ఇప్పటికే లేఖ రాశారు. కాగా అనుకోని రీతిలో ఎదురైన ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కస్టమ్స్ విభాగం చీఫ్ కమిషనర్ ఎగుమతిదారులు, టెర్మినల్ నిర్వాహకులతో అత్యవసర సమావేశం నిర్వహించి చర్చించారు. సాధారణంగా ఎగుమతి అయ్యే సరుకులకు వర్తించే మార్గదర్శకాలు తిరిగి వచ్చే సరుకులకు వర్తించవు. దీన్ని దష్టిలో పెట్టుకుని గల్ఫ్ నుంచి తిరిగి వస్తున్న సరుకులకు కొత్త గైడ్‌లైన్స్ రూపొందించే పనిలో కస్టమ్స్ అధికారులు నిమగ్నమయ్యారు. కాగా ఎగుమతిదారులను మరో విషయం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. ఆక్వా తదితర సముద్ర ఉత్పత్తులతో పాటు మరికొన్ని సరుకులు మూడు నుంచి ఐదు రోజులకు మించి నిల్వ ఉంచడానికి లేదు. అలా ఉంచితే పాడైపోతాయి. కార్గో నౌకలు ప్రయాణంలో ఉన్నప్పుడు వాటిలో ఉండే హై క్వాలిటీ నిల్వ సౌకర్యాలు, శీతలీకరణ ఏర్పాట్లు కొన్ని రోజులు ఆలస్యమైనా సరుకు చెడిపోకుండా కాపాడతాయి. కానీ ఇప్పుడు పోర్టుకు తిరిగివస్తున్న నౌకల్లోని సరుకులను యార్డుల్లో నిల్వ చేసినా తగినంత శీతలీకరణ సౌకర్యాలు అందుబాటులో ఉండని పరిస్థితి. ఈ కారణంగా వేల కోట్ల విలువైన ఉత్పత్తులు చెడిపోయే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క విశాఖ నుంచి కాకుండా మనదేశంలో ఆరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర తీరాల్లోని పోర్టుల నుంచి పశ్చిమాసియా దేశాలకు వెళ్లే సరుకుల విషయంలో యుద్ధం కొనసాగినంతకాలం ఈ అనిశ్చితి, ఆందోళనకర పరిస్థితులు తప్పవు.






Comments