top of page

కమాండర్ మొండితనమే ముంచేసింది!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Mar 10
  • 2 min read
  • శ్రీలంక తీరంలో ఇరాన్ నౌక మునక వెనుక రహస్యం

  • అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేయడంతోనే విషాదం

  • ఈ విషయంలో కమాండర్, నావికుల మధ్య విభేదాలు

  • నాయకుడిని కాదని నౌక నుంచి తప్పించుకున్న 32 మంధి

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

తనతో అణు ఒప్పందానికి రాలేదన్న కక్షతో అమెరికా ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధం ప్రకటించి ఎనిమిది రోజులుగా విధ్వంసం సష్తిస్తోంది. సమీప కాలంలో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడంలేదు. అమెరికా`ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా వందలాది పట్టణాలు నాశనమవుతున్నాయి. ఇప్పటికే సుమారు రెండువేలమంది హతమయ్యారని అంచనా. ఒక పాఠశాలపై కూడా సంయుక్త దళాలు మిసైళ్ల వర్షం కురిపించి 165 మంది విద్యార్థుల మరణానికి కారణం కావడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అలాగే యుద్ధక్షేత్రానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న.. అది కూడా అంతర్జాతీయ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వస్తున్న ఇరానియన్ యుద్ధనౌకను కూడా అమెరికా తన సబ్‌మెరైన్‌తో దాడి చేసి ముంచేయడం ద్వారా వందకుపైగా ప్రాణాలను బలిగొనడం కూడా అంతర్జాతీయంగా విమర్శల పాలైంది. అయితే ఈ దారుణ ఘటన వెనుక అసలు వాస్తవాలు ఆలస్యంగా బయటకొచ్చాయి. ఇందులో అమెరికా కోపాగ్ని లేదా తప్పు కంటే ఇరాన్ యుద్దనౌక కమాండర్ నిర్లక్ష్యమే ఎక్కువగా ఉందని, ఆయన మొండితనమే యుద్ధనౌకను ముంచేసిందని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. యుద్ధనౌకలో ఉన్న సైనికులు ఈ దాడికి ముందు ఇరాన్‌లోని తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌లో చెప్పిన మాటలతో అసలు విషయం బయటపడింది. ఈ సైనికుల సమాచారంతోపాటు, ఈ ఘటనకు సంబంధించి అమెరికా విడుదల చేసిన వీడియో ప్రకారం.. ఆనాడు ఏం జరిగిందంటే..

పని చేయని హెచ్చరికలు

గత నెలలో విశాఖ నగరంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫఆర్), మిలన్`2026 కార్యక్రమాలు జరిగాయి. ప్రపంచంలోని 71 దేశాల నౌకాదళ సిబ్బంది, యుద్ధనౌకలు వీటిలో పాల్గొన్నాయి. అదేవిధంగా ఇరాన్‌కు చెందిన యుద్ధనౌక ఐఆరఐఎస్ డెనా కూడా విశాఖ విన్యాసాల్లో పాల్గొని స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. అది శ్రీలంక ప్రాంతంలో అంతర్జాతీయ, శ్రీలంక ప్రాదేశిక జలాల మధ్య ఉండగానే యుద్ధం మొదలైంది. ఎక్కడికక్కడ ఇరాన్ యుద్ధనౌకలను అమెరికన్ సబ్‌మెరైన్లు, వార్‌షిప్‌లు వెంటాడి దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో హిందూ మహాసముద్రంలోని డిగోడార్షియాలో ఉన్న అమెరికా నేవి స్థావరానికి చెందిన యూఎసఎస్ షార్లెట్ అనే సబ్‌మెరైన్ ఇరాన్ యుద్ధనౌకను గమనించి వెంటాడింది. నౌకను ధ్వంసం చేస్తామని, అందువల్ల దాన్ని విడిచిపెట్టి ప్రాణాలు రక్షించుకోవాలని ఇరాన్ నౌకలోని సిబ్బందికి అమెరికన్ సబ్‌మెరైన్ అధికారులు చాలాసేపు హెచ్చరికలు జారీ చేశారు. కానీ నౌక కమాండర్ తప్పించుకునేందుకు తన సిబ్బందికి అనుమతి ఇవ్వలేదు. ఎన్నిసార్లు హెచ్చరికలు వినిపించినా పట్టించుకోకుండా మొండి పట్టుదలతో అలాగే ఉండిపోయారు. కమాండర్ వైఖరితో నౌకలోని చాలామంది సిబ్బంది విభేదించడంతో వారంతా రెండువర్గాలుగా విడిపోయి వాగ్వాదాలకు పాల్పడ్డారు. దాంతో పలువురు నావికులు కమాండర్‌ను ధిక్కరించి సముద్రంలోకి దూకేసి లైఫ్‌బోట్ల సాయంతో యుద్ధనౌకకు దూరంగా వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. వారే ప్రాణాలతో బయటపడిన 32 మంది సైనికులని అంటున్నారు.

కమాండర్‌తో వాగ్వాదం

కాగా తమ హెచ్చరికలను బేఖాతరు చేసిన ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ మార్క్ శ్రేణికి చెందిన 48 టార్పెడోలను ప్రయోగించింది. ఇరాన్ నౌక ముందుభాగాన్ని ఒక టార్పెడ్ తగిలి ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. మరికొన్ని టార్పెడోలు నౌకను పూర్తిగా జలసమాధి చేశాయి. ఆ సమయంలో ఇరాన్ నౌకలో 180 మంది సిబ్బంది ఉండగా 87 మంది మరణించినట్లు ధ్రువీకరించారు. 32 మంది ముందే ప్రాణాలతో నౌక నుంచి తప్పించుకోగా మిగిలిన 61 మంది ఆచూకీ ఇంతవరకు లభించలేదు. బహుశా వారు కూడా నౌకతోపాటే జలసమాధి అయ్యుండవచ్చు. ఈ ఘోరకత్యమంతా అమెరికాదేనని ప్రపంచమంతా భావించింది. అమెరికా హెచ్చరికలను కమాండర్ ఖాతరు చేయకుండా మొండికేయడం, అతనితో కొందరు సైనికలు వాదులాటకు దిగిన విషయాలను దాడికి కొన్ని నిమిషాల ముందు ఒకరిద్దరు తమ కుటుంబ సభ్యులకు ఫోనులో వివరించినట్లు అంతర్జాతీయ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దాంతోపాటు శ్రీలంక జలాల్లో ఇరాన్ నౌకపై దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను అమెరికా రక్షణ శాఖ విడుదల చేయడంతో అసలు విషయం లోకానికి తెలిసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page