తెరపైకి గుమ్మడి నర్సయ్య బయోపిక్
- Guest Writer
- Oct 23, 2025
- 2 min read

తెలుగు తెరపై బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. క్రీడాకారులు, నటులు, రాజకీయ నాయకులు.. ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత కథలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ ట్రాక్ లో ఇప్పుడు మరో ఆసక్తికరమైన బయోపిక్ చేరబోతోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, ఆస్తులు కూడబెట్టుకోకుండా, నిరాడంబరంగా సైకిల్‌పైనే అసెంబ్లీకి వెళ్లి, పేదల గొంతుకగా నిలిచిన గొప్ప రాజకీయ నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవితం ఆధారంగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఈ బయోపిక్‌లో టైటిల్ రోల్‌ను ఎవరు పోషిస్తారనేది అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. అయితే, ఆ పాత్ర కోసం మేకర్స్ ఏకంగా కన్నడ కరుణాడ చక్రవర్తి, హ్యాట్రిక్ హీరో శివ రాజ్‌కుమార్‌ను ఎంపిక చేయడం విశేషం. ఈ లెక్కతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను అమాంతం పెంచేసింది. ఒక తెలుగు రాజకీయ నాయకుడి పాత్రలో కన్నడ సూపర్ స్టార్ నటించనుండటం విశేషం. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని రెట్టింపు చేశాయి. గుమ్మడి నర్సయ్య ఆహార్యాన్ని శివ రాజ్‌కుమార్ అచ్చు గుద్దినట్లు దించేశారు. తెల్లని దుస్తులు, భుజంపై ఎర్ర కండువా, చేతిలో పాత సైకిల్‌తో అసెంబ్లీ ముందు నిలబడిన ఆయన లుక్ ఎంతో సహజంగా, ఆకట్టుకునేలా ఉంది. ఆ నిరాడంబరత, ఆ నిజాయితీ ఆయన కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మోషన్ పోస్టర్ అయితే సినిమా థీమ్‌ను మరింత బలంగా ఎలివేట్ చేసింది. మిగతా ఎమ్మెల్యేలంతా కార్లలో అసెంబ్లీకి వస్తుంటే, గుమ్మడి నర్సయ్య మాత్రం తన సైకిల్‌పై నిదానంగా రావడం, నేపథ్య సంగీతం, విజువల్స్ అన్నీ కలిసి ఒక గూస్‌బంప్స్ మూమెంట్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిన్న గ్లింప్స్‌తోనే దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే ఒక పవర్‌ఫుల్ బయోపిక్‌ను అందించబోతున్నాడనే నమ్మకం కలుగుతోంది.
నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా, భారీ స్థాయిలో నిర్మించడానికి సిద్ధమయ్యారు. గుమ్మడి నర్సయ్య లాంటి గొప్ప వ్యక్తి కథను తెరకెక్కిస్తున్నప్పుడు, నిర్మాణ విలువలు కూడా అంతే గొప్పగా ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ, సురేష్ బొబ్బిలి సంగీతం, సత్య గిడుటూరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మొత్తం మీద, ‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. శివ రాజ్‌కుమార్ లాంటి స్టార్ యాక్టర్ ఈ పాత్రకు ప్రాణం పోయనుండటంతో, ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా, ఇతర భాషల్లోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
‘ఫౌజీ’.. ఇదే ఫిక్స్!

ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రభాస్ సినిమాకు ‘ఫౌజీ’ అనే పేరు పెట్టబోతున్నారని ముందే తెలుసు. ఆ తరవాతే.. ఈ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు చిత్రబృందం కూడా ఈ టైటిలే ఫిక్స్ చేసింది. ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు..ఈ సందర్భంగా ఫౌజీ టైటిల్ ని అఫీషియల్ గా ప్రకటించేశారు.
స్వాతంత్య్ర ఉద్యమం నాటి కథ ఇది. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌కీ, ఈ కథకూ సంబంధం ఉంది. అందుకే ఫౌజీ..అనే టైటిల్ పెట్టారు. పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు, పాండవుల పక్షాన కర్ణుడు, పుట్టుకతోనే ఒక యోధుడు, గురువు లేని ఏకలవ్యుడు, మన చరిత్రలోని దాగున్న అత్యంత ధైర్యవంతుడైన సైనికుడి కథ.. అంటూ ఫౌజీని పరిచయం చేశారు. దీన్ని బట్టి ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందో ఓ అంచనాకు రావొచ్చు.
యుద్ధ సన్నివేశాలకు చాలా ప్రాధాన్యం ఉన్న కథ ఇది. ఆయా యాక్షన్ ఘట్టాలు అభిమానుల్ని అలరించేలా తీర్చిదిద్దారు. నిజానికి ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఓ గ్లింప్స్ రిలీజ్ చేయాలని అనుకొన్నారు. దానికి సంబంధించిన కొంత మేర వర్క్ కూడా జరిగింది. కానీ చివరికి పోస్టర్‌తో సరిపెట్టారు. ఈ రోజు ‘రాజాసాబ్’ నుంచి కూడా ఓ కొత్త పోస్టర్ రాబోతోంది.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...










Comments