తెలుగు సినీగీత సాహిత్యానికి పెద్ద బాలశిక్ష.
- Guest Writer
- 6 days ago
- 3 min read

మందార ధూళి” అనే మాట ఎంత కొత్తగా ఉంది? ఎప్పుడు విన్నా కొత్తగా ఉంటుంది. 1989లో రాశాడు మహానుభావుడు. శివ సినిమాకు రాసిన ఎన్నియల్లో అనే పాటలో. “అగ్నిపత్రాలు రాసిన గ్రీష్మం” అనే మాట ఇప్పటికీ కొత్తగానే ఉంది.1985 లో వచ్చిన ప్రేమించు పెళ్ళాడు సినిమాలో నిరంతరమూ అనే పాటలో. “నీ ఎడారి నిండా ఉదక మండలాలు.. నీటి ధారధాటే మౌన పంజరాలు”...1988 లో వచ్చిన మరణ మృదంగం సినీ పాటలో ఒకచోట...
తొలకరి మెరుపుల లేఖలతో /నరుడి బ్రతుకు నటన/ ఈశ్వరుడి తలపు ఘటన/ ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన/గీతార్ధ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే/జీవితం.. సప్తసాగర గీతం / వెలుగు నీడల వేదం/సాగనీ పయనం/రాలేటి పూల రాగాలతో/
పూసేటి పూల గంధాలతో......
అయ్యా పెద్దాయన... నిన్ను దాటి ఒక్క అడుగు కూడా తెలుగు సినీ సాహిత్యం ముందుకు పోలేకపోతోంది. అదే మీరు పాతిన ఉక్కు స్తంభం.
మీరు తెలుగు సినీగీత సాహిత్యానికి పెద్ద బాలశిక్ష.
మీకు వేల వేల ప్రణామాలు!
- డాక్టర్ వేంపల్లి గంగాధర్
పట్టుపరిశ్రమకి ఎప్పుడైనా వెళ్ళారా? మేం ఇంటర్లో వుండగా మా బోటనీ సార్ వెంకటేశ్వర్లుగారు తీసుకెళ్ళారు. మొత్తం వివరంగా తెలుసుకున్న తరవాత పట్టుపురుగులు చనిపోవడం తలుచుకుని ఆ పదహారేళ్ళ వయసులో “ఈ ఆడవాళ్ళు పట్టుచీరలు కట్టుకోకపోతేనేం?” అన్నంత కోపమొచ్చేసింది. అయితే ఒక పట్టుపురుగు చేసిన త్యాగం ఎప్పుడు సార్ధకమవుతుంది? “నువు పట్టుచీరకడితే ఓ పుత్తడిబొమ్మా! ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ!” ఎవరలా అన్నది? అందంగా వున్నావనడం వేరు. ఇలా భావామృతాన్ని ఒలకబొయ్యడం ఏ కొద్దిమంది కారణజన్ములకో సాధ్యమవుతుంది. ఆ కలానికి కలకలం సృష్టించడం తెలుసు. మనసు వికలమయ్యే విషాదాన్నీ, మది నిండిపోయే ఆహ్లాదాన్నీ అలవోకగా అందించే అరుదైన కలమది! ఆ రాధచేత ఆరాధనాగీతి పలికించగలిగే సాహిత్యమది. కాళియమర్దనం కథ చిన్నతనాన అమ్మ చెబుతోంటే నోరుతెరుచుకుని విన్నాం. ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూశారని ఈయన చెబుతోంటే అచ్చెరువొందాం! కొంతకాలంపాటు స్తబ్దుగా రాయిలా పడున్న సినీ సాహిత్యం ఈ సుందరరాముడి ‘పద’స్పర్శతో మళ్ళీ అహల్యలా అందంగా ఒళ్ళు విరుచుకుంది. అలతి పదాలతో అలవిమాలిన అందాన్ని అలదడం ఇతగాడికి అమ్మే నేర్పిందో, అమ్మలగన్న అమ్మ దగ్గరే అభ్యసించాడో...! లిపిలేని కంటిభాషను చదవగలిగే నేర్పరితనం ఈయనకి ‘పెన్ను’తో పెట్టిన విద్య! గడపదాటలేక నన్నే గడియవేసుకున్నానని ఆపిల్ల తనకున్న పరిధుల్ని కలబోసుకుంటే.. ఘడియైనా నీవులేక గడపలేక ఉన్నానంటూ ఆపిల్లాడు తన విరహాగ్నిని ఒలకబోశాడు. ఇలారాయాలంటే భావమొకటే చాలదు. ప్రేమికుల మానసిక పరిస్థితులతోబాటు బాధ్యతలు, కట్టుబాట్లు, సమాజ ధోరణి.. ఇవన్నీ కూడా ముందేసుకుని కూర్చునివుండాలి. ఉచ్ఛ్వాసనిశ్వాసాల్ని వాయులీనాలతోను,స్పందించు నవనాడుల్నీ వీణానాదాలుగాను పోల్చడమంటే కవిగారు కాళిదాసు రూపం దాల్చడం కాక మరేమిటి? ఆకలికి మనిషి బానిస. అన్నానికి ఆకలి బానిస. నిర్మాతకి రచయిత బానిస. అందుకే... నాదాత్మకుడిగా మనలోన వెలిగిన ఈ ప్రాణదీపం కాస్తా అ...అంటే అమలాపురమనీ, మేలైన సరుకుంది వేలమాడుకోమనీ, చిల్లరకోసం చిల్లర రాతలూ రాసింది. అయినా అఖండజ్యోతిగానే వెలిగింది.
ఏదైనా విషయాన్ని పొందుపరిచేముందు అందులో నిజానిజాల్ని బేరీజు వెయ్యడం, నిర్ధారించుకోవడం.. అనే అలవాట్లులేని యువత ఈయన నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. మధురలో కథావస్తువుందంటే మీనాక్షి చరిత్రను, ‘కలకత్తా గురించి పాటండీ!’ అంటే వంగదేశ ఖ్యాతినీ అధ్యయనం చేసి తనదైన శైలిలో మనదైన భాషలో ఆ పదాల్ని ఇరికించి రాయడం, ఆ తరవాత మనందరిచేతా రిఫరెన్సులు చేయించడం ఈయనకి సరదా! వయసెరుగని మనసది! ఆ కలం వృద్ధాప్యమెరుగదు, వ్యాయామమే తప్ప! అంతటి కృషివుందిగనుకనే ఆమనిషి ఋషయ్యాడు! పట్టుదలుందిగనకనే మరోబ్రహ్మలా తన పాటలతో మనకు పునర్జన్మ ప్రసాదించాడు! ఏలుకుంటే పాట...మేలుకుంటే పాట
పాడుకుంటే పాట...మా వేటూరి దేవుడు! ఏపాట నేపాడను?? బ్రతుకే పాటయినవాడు అతగాడు. అతని పాటవిన్న క్షారజలధులు కూడా క్షీరములవుతాయి. గుండియలు అందియలుగా మ్రోగి చిరనర్తనమాడతాయి. వాసిలోనూ, రాశిలోనూ మాసిపోని ముద్రవేసుకున్న వేటూరికి నాదైన నివాళి!
- జగదీశ్ కొచ్చెర్లకోట
ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే...
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే...
ఎత్తగలడా సీత జడను తాళికట్టే వేళలో...
--------------------------
నరుడి బ్రతుకు నటన
ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ
నీకెందుకింత తపన
--------------------------
శంకరా, నాదశరీరా పరా... వేదవిహారా హరా జీవేశ్వరా..ధిక్కరీంద్రజిత హిమగిరీంద్ర సిత కంధరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్ర గానమిది అవధరించరా విని తరించరా.
---------------
హిమమే కురిసే చందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట.
----------------------
సెలవన్నాయి కలలు
సెలయేరైన కనులతో.
---------------------
రాయినై ఉన్నాను...ఈ నాటికీ.
రామ పాదము రాక...ఏ నాటికీ.
------------------------
వేణువై వచ్చాను భువనానికి.
గాలినై పోతాను గగనానికి.
-------------------
ఎదలోని సొదలా, ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా, కలల వరదలా.
--------------------
వయసంతా వసంత గాలి మనసనుకో మమతనుకో.
ఎదురైనది ఎడారి దారి చిగురులతో చిలకలతో.
---------------------------
దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం నేల కూల్చకా తప్పదురా
తప్పదురా... తప్పదురా.
--------------------------
ఆరేసుకోబోయి పారేసుకున్నాను
కోకెత్తుకెళ్లింది కొండ గాలి.
------------------------------
తేనెటీగ లాగ కుట్టి తీపి మంట రేపుతావు
పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు
నేనేనా..నీ రూపేనా.
---------------------
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు.
--------------------------
ఎడబాటనుకో ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే
ఇది నిజమా కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా
‘నీ నమాజుల్లో ఓనమాలు మరిచా”
వేటూరి వారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ??










Comments