తేలని కేసులు.. గాల్లోనే అక్రమాస్తులు!
- DV RAMANA

- 6 hours ago
- 3 min read

ఈమధ్యే తెలంగాణ విద్యుత్ శాఖకు చెందిన ఒక ఏడీఈపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పంజా విసిరింది. ఈ దాడుల ద్వారా ఆయన సామాన్యుడు కాదని.. ఒక భారీ అవినీతి తిమింగలం అని తెలిసి నివ్వెరపోయింది. అయ్యగారి నుంచి స్వాధీనం చేసుకున్న అక్రమాస్తుల విలువ ఏసీబీ లెక్కల ప్రకారమే రూ.100 కోట్లకుపైగా ఉందని అంచనా వేశారు. ఏసీబీ రెండు రకాలుగా దాడులు చేస్తుంది. వాటిలో మొదటిది ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటుండగా ముందుగా అందిన సమాచారం ప్రకారం ప్లాన్ చేసి వల వేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం కాగా రెండోది ఫిర్యాదుల ఆధారంగా ఉద్యోగులు, అధికారులపై నిఘా పెట్టి ఆకస్మికంగా ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసి లెక్కల్లో చూపని ఆస్తులను స్వాధీనం చేసుకోవడం. లంచం కేసులో పట్టుకున్న ఉద్యోగిని ఏసీబీ కోర్టు ద్వారా శిక్షిస్తారు. అక్రమాస్తుల కేసుల్లో మాత్రం శిక్షల ప్రక్రియ కాస్త భిన్నంగా ఉంటుంది. లెక్కల్లో చూపని, పన్ను కట్టకుండా, ఆదాయానికి మించిన ఉన్న ఆస్తులను అక్రమాస్తులుగా పరిగణించి ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగిస్తారు. ఇలా స్వాధీనం చేస్తున్న ఆస్తులను ఏం చేస్తారన్నది సామాన్యులకు తెలియదు. ఏటా పెద్దసంఖ్యలో ఏసీబీ దాడుల్లో ప్రభుత్వ సిబ్బంది పట్టుబడుతున్నా.. వారి నుంచి భారీగా నగదు, బంగారం, స్థిరచరాస్తులను స్వాధీనం చేసుకుంటున్నా.. వాటిని ఏం చేస్తున్నారన్నది మాత్రం వెల్లడి కావడంలేదు. అవినీతి నిరోధక చట్టం-1988 ప్రకారం సోదాల్లో లభించిన లెక్క చూపని, ఆదాయానికి మించిన ఆస్తులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తారు. అనంతరం విచారణ కోసం కేసు ఫైలును ఏసీబీ కోర్టుకు అప్పగిస్తారు. దాంతోపాటే స్వాధీనం చేసుకున్న అక్రమాస్తులను కూడా ఏసీబీ కోర్టు కస్టడీకి అప్పగిస్తారు. విచారణ పూర్తి అయ్యి నిందితుడు దోషి అని తేలిన తర్వాత అతనికి శిక్ష విధించడంతోపాటు అక్రమాస్తులను ప్రభుత్వానికి స్వాధీనం(కాన్పిస్కేట్) చేయాలని కోర్టు ఆదేశిస్తుంది. అప్పుడే అవి ప్రభుత్వ ఆస్తులుగా మారతాయి. తనకు దఖలు పడిన ఆస్తులను ప్రభుత్వం రెవెన్యూ శాఖ ద్వారా వేలం లేదా విక్రయించడమో చేస్తుంది. అలా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు. కేసు విచారణలో ఉండగా అక్రమాస్తులను అమ్మడం, వేలం వేయడం చేయరు. ఎందుకంటే ఒకవేళ కోర్టులో అక్రమాస్తుల కేసు వీగిపోయి నిందితుడు నిర్దోషి అని తేలితే మాత్రం స్వాధీనం చేసుకున్న ఆస్తులను అతనికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ సజావుగా జరుగుతున్నట్లు కనిపించడంలేదు. దోషులుగా తేలిన అవినీతి అధికారులకు జైలు శిక్షలు, జరిమానాలు తప్ప వారి నుంచి స్వాధీనం చేసుకున్న అక్రమాస్తులను వేలం వేసి, సర్కారు ఖజానాకు జమ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దీనికి కారణాలు తరచి చూస్తే.. ప్రభుత్వ విభాగాల్లో ఉండే రెడ్‌టేపిజమే కేసులు ముందుకు సాగకుండా చేస్తున్నదని అర్థమవుతుంది. ఇలాంటి కేసుల్లో పట్టుబడుతున్న ఆస్తుల్లో చాలా వరకు నిందితుల పేరుమీద కాకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేర్ల మీద ఉంటున్నాయి. దాంతో వాటిని నిందితుడికి చెందిన అక్రమాస్తులుగా ఏసీబీ రుజువు చేయలేకపోతోంది. ఏసీబీ కేసుల విచారణ ఏళ్ల తరబడి సాగుతుండటం మరో కారణంగా భావిస్తున్నారు. లంచం కేసుల సంగతెలా ఉన్నా.. ఏసీబీ నమోదు చేస్తున్న అధిక శాతం అక్రమాస్తుల కేసులు అంతూపొంతూ లేకుండా పరిష్కారానికి నోచుకోని పరిస్థితి ఉంది. సోదాలు జరిపి నిందితులను పట్టుకోవడం, అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని మొదట ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. అనంతరం విచారణ జరిపి శిక్షలు విధించడానికి కేసును కోర్టుకు అప్పగిస్తారు. అక్కడ ట్రయల్స్ పూర్తి అయ్యి శిక్షలు పడేసరికి ఏళ్లు గడిచిపోతున్నాయి. దాంతో చాలా కేసులు పరిష్కారానికి నోచుకోక పది పదిహేనేళ్లపాటు పెండింగులో ఉండిపోతున్నాయి. ఫలితంగా ఈ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులు అటు ప్రభుత్వానికి ఇటు నిందితులకు చేరకుండా కోర్టుల స్వాధీనంలోనే ఉండిపోతున్నాయి. ఏసీబీ కోర్టులోనే కేసుల విచారణకు పదేళ్లకుపైగా పడుతుండగా.. ఆ కోర్టు ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టు, సుప్రీంకోర్టుల వరకు అప్పీలుకు వెళ్తుంటారు. అవి పరిష్కారం కావడానికి మరికొన్నేళ్లు పడుతుంది. అప్పటివరకు జప్తు చేసిన ఆస్తులను లిక్విడేట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ కేసు పరిష్కారమై వేలం లేదా విక్రయానికి కోర్టులు అనుమతించినా ఆస్తులు నిందితుల పేర్లతో ఉండకపోవడం మరో అడ్డంకిగా మారుతుంది. నిందితుల బినామీలు, కుటుంబ సభ్యులు తమ పేరిట ఉన్న ఆస్తుల కోసం మళ్లీ కోర్టులను ఆశ్రయిస్తుంటారు. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. ఈ కారణాల వల్లే కేసులు పరిష్కారమై ఆస్తులు వేలం వేస్తున్న సందర్భాలు చాలా అరుదుగానే ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో ఇటువంటి ఉదంతాలు రెండే రెండు ఉన్నాయి. 2010లో విజయవాడకు చెందిన రోడ్లు భవనాల శాఖ ఇంజినీరు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణýతో ఏసీబీ ఆయన నివాసాల్లో సోదాలు చేసి పలు ఆస్తులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసింది. ఈ కేసు 14 ఏళ్లపాటు కొనసాగి 2024లో పూర్తి అయ్యింది. నిందితుడిని దోషిగా తేల్చి అతనికి చెందిన మÖడు ఫ్లాట్లు, రెండు స్థలాలను కోర్టు ప్రభుత్వానికి దఖలుపర్చింది. 2024 చివరిలో రెవెన్యూ శాఖ వాటిని వేలం వేసింది. 2012లో వైజాగ్‌లో సబ్ రిజిస్ట్రార్‌పై కేసు నమోదు చేసి బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. 2023లో ఆ కేసు పరిష్కారం కావడంతో ఎస్బీఐ ద్వారా వాటిని వేలం వేసి రూ.1.20 కోట్లు ప్రభుత్వానికి జమ చేశారు. 2026 జనవరి నాటికి దర్యాప్తు దశలో 1847, కోర్టు విచారణ దశలో 3216 కేసులు ఉన్నట్లు అంచనా.ఏళ్ల తరబడి కేసులు మగ్గిపోతుండటం వల్ల స్వాధీనం చేసుకున్న ఆస్తులు ఎవరికీ చెందకుండా గాల్లోనే ఉండిపోతున్నాయి.






Comments