top of page

తప్పించుకునే ఎత్తుగడ.. ఈఎన్‌సీ చెయ్యి‘కట్టు’ కథ!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Aug 9
  • 3 min read
  • కలకలం రేపిన ఏసీబీ ట్రాప్‌ ఉదంతంలో ట్విస్ట్‌

  • యాసిడ్‌ టెస్ట్‌ కోసం తన చెయ్యి విరిచేశారని శ్రీనివాస్‌ ఆరోపణ

  • ట్రాప్‌ తర్వాత ఆయన నిక్షేపంగా ఉన్నట్లు తేల్చిన వీడియోలు

  • కానీ కోర్టు ముందు కొత్త ఆరోపణలు చేసిన నిందితుడు

ree
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్‌సీ సబ్బవరపు శ్రీనివాస్‌ కేసు కోర్టుకెళ్లే దారిలో మరో మలుపు తిరిగింది. తాను లంచం తీసుకోలేదని.. ఏసీబీ అధికారులే రూ.25 లక్షలు తన ముందు పెట్టి యాసిడ్‌ టెస్ట్‌ కోసం తన చెయ్యి విరిచేసి బలవంతంగా నోట్లపై పెట్టించారని పేర్కొనడంతో ఈ కథలో ట్విస్ట్‌ చోటచేసుకుంది. సబ్బవరపు శ్రీనివాస్‌ ఇటువంటి వ్యవహారాల్లో మహా ముదురని ఏసీబీ అధికారులకు తెలిసినా, తగు జాగ్రత్తలు తీసుకోపోవడమే ఆయన ఎమోషనల్‌ ‘కట్టు’కథ అల్లేందుకు ఉపయోగపడిరది. చేతికి సిమెంట్‌ కట్టుతో కనిపిస్తున్న శ్రీనివాస్‌ అవినీతి సొమ్ము ద్వారా పదోన్నతులు పొందడంతోపాటు పరపతి, ఆస్తులు పెంచుకున్న మాట వాస్తవమే కానీ.. ఈ ట్రాప్‌ మాత్రం ప్రీప్లాన్డ్‌గా ఆయన శత్రువులు, ఏసీబీ అధికారులు కుమ్మక్కై చేశారన్న వాదన తాజాగా తెరపైకి వచ్చింది. గురువారం శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు ట్రాప్‌ చేసిన ఉదంతాన్ని ఎలక్ట్రానిక్‌ మీడియా పెద్ద ఎత్తున కవర్‌ చేసింది. ఆ సందర్భంలో టీవీ ఛానళ్లు ప్రసారం చేసిన ఏ వీడియోలోనూ చెయ్యి విరిగిపోయి ఆయన ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కనిపించలేదు. కానీ శుక్రవారం సాయంత్రం ఏసీబీ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చినప్పుడు మాత్రం తాను లంచం తీసుకోలేదని.. ఏసీబీ అధికారులే తన చెయ్యి విరగ్గొట్టి మరీ నోట్ల మీద యాసిడ్‌ టెస్ట్‌ కోసం చేతులు పెట్టించారని ఆరోపించడంతో శనివారం ఆయన్ను వైద్యపరీక్షలకు పంపారు. ఆ పరీక్షల్లో చెయ్యి విరిగినట్లు తేలడంతో ఆయనకు కట్టు వేశారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం అదే. శ్రీనివాస్‌ స్టేట్‌మెంట్‌ మేరకు రిమాండ్‌ రిపోర్టు తీసుకురమ్మని ఏసీబీ అధికారులకు మెజిస్ట్రేట్‌ ఆదేశించారు.

ఏసీబీ ట్రాప్‌ ఆయన బాధితుల ప్లానే

రూ.రెండు వేల నోట్లు రద్దయిన తర్వాత ఒకసారి, ఇటీవల ఆర్‌బీఐ నిబంధనల మేరకు మరోసారి రూ.3 లక్షలకు మించి క్యాష్‌ ట్రాన్జక్షన్‌ (నగదు లావాదేవీలు) జరపకూడదని రిజర్వ్‌ బ్యాంకు ఆదేశించింది. కానీ తాజా ఏసీబీ ట్రాప్‌లో రూ.25 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారన్న దానికి ఫిర్యాదుదారుడు రుజువులు చూపించాల్సి ఉంటుంది. తనతో పని చేసిన ఇంజినీరింగ్‌ అధికారులను శ్రీనివాస్‌ వేధించడంతో వారంతా విసిగిపోయి శ్రీనివాస్‌ తెర వెనుక పార్టనర్‌గా ఉన్న సంస్థ ద్వారా ఆయన్ను ట్రాప్‌ చేయించినట్లు తెలుస్తోంది. ఏడు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణానికి తాను అజ్ఞాత పార్టనర్‌గా ఉన్న సత్యసాయి కన్‌స్ట్రక్షన్స్‌కు శ్రీనివాస్‌ రూ.5 కోట్లు ఇచ్చారన్న ప్రచారం ఉంది. అలాగే వీటి ఎస్టిమేషన్లు కూడా పెంచి లబ్ధి చేకూర్చాలని శ్రీనివాస్‌ చూశారట. వాటి ఫైనల్‌ బిల్లు రూ.35.5 కోట్లు చెల్లించేటప్పుడు తన అసలు రూ.5 కోట్లు, ఎస్టిమేట్లు పెంచడం ద్వారా, కాంట్రాక్ట్‌ చేయడం ద్వారా వచ్చిన లాభంతో కలిపి మరో రూ.3 కోట్లు, రొటీన్‌గా ఈఎన్‌సీకి ఇవ్వాల్సిన లంచంతో కలిపి పెద్ద మొత్తం డిమాండ్‌ చేయడంతో సత్యసాయి కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత చెరుకూరి కృష్ణంరాజు ఏసీబీని ఆశ్రయించారనేది అధికారుల కథనం. కానీ సబ్బవరపు శ్రీనివాస్‌ ఏఈగా ఉన్నప్పుడు ఏఈలుగానో, డీఈగా పదోన్నతి వచ్చిన తర్వాత డీఈ హోదాలోనూ పలు స్థాయిల్లో ఆయనతో పాటు పని చేసిన అనేకమందిని ఈఎన్‌సీగా పదోన్నతి పొందిన తర్వాత వేధించడం మొదలుపెట్టారట. తమతో పాటు డీఈగానో, ఈఈగానో ఉండాల్సిన శ్రీనివాస్‌ ఏకంగా ఈఎన్‌సీ అయిపోవడం వీరందరికీ ఒకరకంగా అవమానం. మరోవైపు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత శ్రీనివాస్‌ తనతో పాటు ఈ స్థానానికి పోటీ పడతారని భావించే ఇంజినీరింగ్‌ అధికారులను వేధించడం మొదలుపెట్టారు. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈఎన్‌సీ పోస్టుకు పలువురు తీవ్రంగా పోటీ పడ్డారు. ఏసీబీ కేసు ఉన్నప్పటికీ ఏం మాయ చేశారో తెలియదు గానీ.. ఇన్‌ఛార్జి ఈఎన్‌సీగా శ్రీనివాస్‌ కుర్చీ దక్కించుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీన్ని గట్టిచేసుకోవడంతో పాటు రెగ్యులర్‌ ఈఎన్‌సీ పోస్టు తెచ్చుకున్నారు.

ree
నీవు నేర్పిన విద్యే..

ఈమధ్య కాలంలోనే తనతో పాటు పనిచేసిన ఈఈ జామి శాంతేశ్వరరావు, మరో ఈఈ తూతిక మోహనరావు, డీఈ సింహాచలం, ఈఈ డీవీఆర్‌ఎం రాజు, మరో ఈఈ కేవీఎస్‌ఎన్‌ కుమార్‌లతో పాటు చాలామందికి రివర్షన్‌ ఇవ్వడం లేదా శాఖాపరంగా వేధించడం వంటి చర్యలు ఈఎన్‌సీ శ్రీనివాస్‌ పాల్పడ్డారని చెబుతున్నారు. ఇందులో 2020 ఫిబ్రవరిలో తూతిక మోహనరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కేసు నమోదు చేసింది. అదే ఏడాది నవంబరులో కేవీఎస్‌ఎన్‌ కుమార్‌ మీద కూడా ఇటువంటి కేసే నమోదైంది. ఈ రెండిరటి వెనుక శ్రీనివాస్‌ ఉన్నారనేది డిపార్ట్‌మెంట్‌లో టాక్‌. వీరెవరూ తన పోస్టుకు పోటీ రాకుండా చేయడానికి ఏసీబీ అస్త్రాన్ని శ్రీనివాసే ప్రయోగించారని చెప్పుకునేవారు. ఇప్పుడు అదే ఏసీబీ అస్త్రాన్ని వాడుకొని వీరితో పాటు మరికొందరు శ్రీనివాస్‌ను ఆయన భాగస్వామ్య సంస్థ సత్యసాయి కన్‌స్ట్రక్షన్‌ ద్వారానే ఏసీబీ ట్రాప్‌ చేయించినట్లు తెలిసింది. శ్రీనివాస్‌పై కూడా ఏసీబీ గతంలో అసెట్స్‌(ఆదాయానికి మించిన ఆస్తులు) కేసు పెట్టడం.. అది ఇంతవరకు తేలకపోవడంతో ఏ స్థాయిలో ఎలా మేనేజ్‌ చేయాలో ఆయనకు తెలిసిపోయింది. నెలాఖరుకు రిటైర్‌ కావాల్సిన తాను బెయిల్‌ లేకుండా జైలులో ఉండటం కంటే ఏదో ఒకటి చేసి బయటపడాలన్న యోచనతోనే శ్రీనివాస్‌ చెయ్యి విరగ్గొట్టుకొని ఉంటారని కొందరు భావిస్తున్నారు. ఏసీబీ ట్రాప్‌ నిజమా? కల్పితమా? అన్నది పక్కనపెడితే శ్రీనివాస్‌ మాత్రం అవినీతిపరుడని ఆ శాఖలో ఎవర్ని అడిగినా చెబుతారు. కిందిస్థాయిలో ఏఈ, డీఈ, ఈఈలు కూడా తమకు వచ్చిన వాటాలు నేరుగా తనకే ఇవ్వాలని ఈఎన్‌సీ కోరిన సందర్భాలు.. కాదంటే వేధించిన ఘటనలు కోకొల్లలని చెప్పుకొంటున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page