నెట్టింట డ్రాగన్ గ్లింప్స్ సెన్సేషన్
- Guest Writer
- 1 day ago
- 2 min read

ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ప్రశాంత్ నీల్ వదిలిన డ్రాగన్ గ్లింప్స్ నెట్టింట ఒక కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మామూలుగా గ్లింప్స్ అంటే ముప్పై సెకన్లు ఉంటుంది. కానీ ఈసారి ఊహించని రేంజ్ లో 4 నిమిషాల 29 సెకన్ల నిడివితో నీల్ ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. టాలీవుడ్ హిస్టరీలోనే ఇంత పెద్ద గ్లింప్స్ రావడం ఇదే తొలిసారి. అసలు తన సినిమాలో ఎలాంటి ప్రపంచం ఉండబోతోందో ప్రేక్షకులకు ముందే పరిచయం చేసి అంచనాలు పెంచేశాడు.
ఈ వీడియో చూస్తే అసలు కథ స్పాన్ ఎంత పెద్దదో క్లియర్‌గా అర్థమవుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వ్యాపారం కోసం వచ్చి 250 ఏళ్లు ఇక్కడే ఉండిపోవడానికి కారణం ఓపియం పాపీ అనే మత్తుపదార్థం అని దర్శకుడు అసలు పాయింట్ చెప్పేశాడు. 1947లో వాళ్ళు వెళ్ళిపోతూ ఆ డ్రగ్ సామ్రాజ్యాన్ని ఇక్కడే వదిలేశారు. ఆ తర్వాత అది ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీగా విడిపోయి ఓపియం వార్స్ మొదలయ్యాయి. ఇదే డ్రాగన్ మెయిన్ ప్లాట్ అని డైరెక్టర్ చెప్పకనే చెప్పాడు.
కథ చెప్పిన తర్వాత ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో ఉన్న విలన్స్‌ను నీల్ తనదైన స్టైల్ లో పరిచయం చేశాడు. దాదా సర్కార్, రష్యన్ డిస్ట్రిబ్యూటర్స్, సోమాలియా లార్డ్ జనరల్ డురాన్ లాంటి క్యారెక్టర్స్ చూస్తుంటే కథ ప్రపంచవ్యాప్తంగా నడుస్తుందని తెలుస్తోంది. అలాగే ట్రైనర్‌తో పాటు 91 డెత్స్ అనే ఒక గ్యాంగ్‌ను చూపించి ఆ డార్క్ మాఫియా సెటప్ ఎంత వయలెంట్‌గా ఉంటుందో ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఈ డార్క్ వరల్డ్‌లో దేవుడు విశ్రమించిన ఏడో రోజున ఒక డెవిల్ పుట్టిందంటూ ఎన్టీఆర్‌ను లుగర్ గా పరిచయం చేసిన తీరు అద్భుతంగా ఉంది. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి అసాస్సిన్ ఇన్ చీఫ్‌గా తారక్ ఎంట్రీ ఇచ్చాడు. శవాల గుట్టల మధ్య హ్యాపీ బర్త్ డే లుగర్ అని రాయడం నీల్ మార్క్ ఎలివేషన్. తారక్ కంప్లీట్‌గా లీన్ లుక్‌లో ఒక కొత్త అవతారంలో కనిపించాడు. ఆ బ్లాక్ వెస్ట్, కళ్ళజోడుతో రగ్గడ్‌గా ఉన్న తారక్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా ఉంది.
ఈ గ్లింప్స్‌లో తారక్ చెప్పిన డైలాగ్స్ క్యారెక్టరైజేషన్‌ని ఇంకో లెవెల్‌కి తీసుకెళ్లాయి. నిద్రపోయినప్పుడు నా కళ్ళలోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగిలున్న శత్రువుల ముఖాలే కనపడతాయి అని లుగర్ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పొరపాటున కూడా నా కళ్ళలోకి రావొద్దు అంటూ తారక్ ఇచ్చిన వార్నింగ్ అతడిలోని కోల్డ్ బ్లడెడ్ యాటిట్యూడ్‌ను చూపిస్తోంది. మాటల్లోనే అంత పవర్ ఉంటే ఇక యాక్షన్ సీన్స్‌లో లుగర్ విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
నీల్ వరల్డ్‌కి రవి బస్రూర్ మరోసారి తన మ్యూజిక్‌తో ప్రాణం పోశాడు. భువన్ గౌడ కెమెరా వర్క్ ఆ పాత కాలాన్ని రియలిస్టిక్‌గా కళ్ళకు కట్టింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2027 జూన్ 11న ఈ మాఫియా కథ థియేటర్లలోకి రాబోతోంది. కేవలం ఒక గ్లింప్స్‌తోనే నీల్ తన కాంపిటీటర్స్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే ప్రమోషనల్ కంటెంట్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
- తుపాకి.కామ్ సౌజన్యంతో..






Comments