నేటి శ్రీకాకుళం.. ఒకనాడు సికకోలి గడ!
- DV RAMANA
- Aug 14
- 2 min read
సీకౌలమ్ కోట అనే పేరు కూడా ఉండేదట
335 ఏళ్లనాటి శిలాశాసనం ద్వారా వెల్లడి
నగరంలోని ఉమాలక్ష్యేశ్వరస్వామి ఆలయంలో దాని గుర్తింపు
ఆ తర్వాతే చిక్కాకోల్ అనే పేరు వచ్చిందని నిర్ధారణ
జిల్లా వజ్రోత్సవాల వేళ కొత్త విశేషం
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

నాటి కళింగాంధ్రలో.. నేటి ఉత్తరాంధ్రలో ముఖ్యమైన ప్రాంతం శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం నగరం పేరుతోనే ఈ జిల్లా ఏర్పాటైంది. అయితే శ్రీకాకుళం అనే పేరు ఎలా వచ్చిందన్నదానిపై ఇప్పటివరకు ఒక కథ ప్రచారంలో ఉంది. గోల్కొండ నవాబుల పాలనలో ఉన్నప్పుడు ఏడురోడ్ల జంక్షన్ సమీపంలోని నాగావళి తీరంలో వ్యాపారుల నుంచి కప్పం వసూలు చేసేవారు. కప్పం కట్టడానికి వ్యాపారులు తమ చిక్కాలను తెరిచి డబ్బులు చెల్లించేవారు. ఆ చిక్కాలను తెరవమని చెప్పడానికి ముస్లిం సైనికులు చిక్కాకోల్ అనేవారు. అలా కాలక్రమంలో ఈ ప్రాంతానికి చిక్కాకోల్‌గా, ఆ తర్వాత చిక్కోలుగా.. సిక్కోలుగా.. శ్రీకాకుళంగా మారిందంటారు. కానీ శ్రీకాకుళానికి మరో ప్రాచీన నామం ఉన్న విషయం తాజాగా వెల్లడైంది. గోల్కొండ నవాబుల పాలనకు చాలా కాలం ముందునుంచి శ్రీకాకుళానికి సికకోలి గడ లేదా సీకౌలమ్ కోట అనే పేర్లు ఉండేవని ప్రముఖ శాసన శాస్త్రవేత్త (శిలాశాసనాల అధ్యయన నిపుణుడు లేదా ఎపిగ్రాఫిస్ట్) పర్లాకిమిడికి చెందిన బిష్ణుమోహన్ అధికారి ఇటీవల గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా 75 ఏళ్ల ఉత్సవాలు జరుపుకొంటున్న తరుణంలో జిల్లా కేంద్రానికి సంబంధించి కొత్త అంశాలు వెలుగులోకి రావడం ముదావహం.
ఎక్కడ బయటపడిరదంటే?
ఇంతకాలం మనముందునే ఉన్న ఈ చారిత్రక ఆధారాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. నగరంలోని ఒక ఆలయంలోనే శ్రీకాకుళం పురాతన నామానికి తెలియజెప్పే శాసనం లభించడం విశేషం. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాచీన ఆలయాలు, చారిత్రక కట్టడాల్లో లభించిన 200కుపైగా రాతి, చెక్క, లోహ శాసనాలను అధ్యయనం చేసి చరిత్రకు సంబంధించి అనేక కొత్త విషయాలను ప్రపంచానికి తెలియజేసిన అనుభవజ్ఞుడు బిష్ణుమోహన్. కొద్దిరోజుల క్రితం శ్రీకాకుళం గుజరాతీపేటలో ఉన్న ఉమా లక్ష్యేశ్వరస్వామి ఆలయాన్ని బిష్ణుమోహన్ సందర్శించారు. ఆ సందర్భంగా ఆలయంలోని గర్భగుడి ముందున్న రాతి స్తంభంపై నిక్షిప్తమై ఉన్న ఒక శిలా శాసనం అతని దృష్టిని ఆకర్షించింది. దగ్గరికి వెళ్లి చూడగా ఒడియా భాషలో 65 ఫంక్తులతో ఏదో సమాచారం కనిపించింది. ఒడియా తెలిసిన బిష్ణుమోహన్ దాన్ని చదివి ఆశ్చర్యపోయారు. శ్రీకాకుళం పూర్వనామం సికకోలి గడ లేదా సీ కౌలమ్ కోటగా పేర్కొన్నట్లు గుర్తించారు. ఈ శాసనం క్రీ.శ. 1690 ఏప్రిల్‌లో అంటే 335 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినట్లు అందులో ఉంది. అయితే ఆ పేరు ఎలా వచ్చిందని గానీ.. దానికి అర్థం గానీ.. ఆ శాసనంలో ప్రస్తావించలేదు. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో 20కిపైగా శాసనాలను అధ్యయనం చేసిన బిష్ణుమోహన్.. శ్రీకాకుళం పేరుకు సంబంధించి లభించిన తొలి స్పష్టమైన ఆధారం, శిలా శాసనం ఇదేనని పేర్కొన్నారు. శాసనాన్ని చదవడం, ఎస్టాంపేజ్ (నకలు ప్రతులు) తయారు చేసే ప్రక్రియలో బిష్ణుతో పాటు అరవింద్ సింగ్, జగ్గు బాయ్, చక్రవర్తిరావు పాల్గొన్నారు. వారి ద్వారా శిలా శాసనం గురించి తెలుసుకున్న ఆలయ అర్చకులు ఆశ్చర్యానందాలు వ్యక్తం చేశారు. శాసనం ఇక్కడే ఉన్నా.. ఇంతకాలం తాము గుర్తించలేకపోయామని వ్యాఖ్యానించారు.
కళింగాంధ్ర వారసత్వం

మూడు శతాబ్దాల క్రితం శ్రీకాకుళం జిల్లాకే చెందిన ఒక కీలక పరిణామాన్ని కూడా ఇదే శాసనంలో ప్రస్తావించారు. మహారాజా ప్రతాప బిశ్వంభర దేవ (సూర్యవంశీ శంకర వంశం, నందాపురం) చికాకోలును పాలిస్తున్న ముస్లిం పాలకులను ఓడిరచి వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం నందిగాం, బొంతలకోడూరు, నరసన్నపేట.. మూడు గ్రామాల ఆదాయాన్ని ఉమా లక్ష్యేశ్వరస్వామి ఆలయానికి కేటాయించడంతోపాటు బంగారం, ఆవులు కూడా విరాళంగా ఇచ్చారు. ఈ ఆదాయంతో ఆలయ నిర్వహణ, పూజాదికాలు నిర్వహించాలని.. ఆర్చకులకు జీవితాంతం హక్కు కల్పించారు. శాసనంలోని తొలి 20 ఫంక్తులు మాత్రమే ఇటీవల ప్రచురించిన ‘రెలిక్స్ ఆఫ్ కళింగ’ పుస్తకంలో బిష్ణు సహకారంతో రచయిత దీపక్‌కుమార్‌నాయక్ పొందుపరిచారు. ఆ తర్వాత ఎస్టాంపేజ్ చేసి మొత్తం 65 ఫంక్తులను చదివడం గలగడం ద్వారా శ్రీకాకుళాన్ని గొప్ప కలింగ వారసత్వంతో అనుసంధానిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇదే విషయాన్ని బిష్ణుమోహన్ ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌కు వివరించారు. ఈ కృషిని ప్రశంసించిన ఎమ్మెల్యే భవిష్యత్తులో ఇటువంటి పరిశోధనలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ శిలా శాసనంపై పూర్తిస్థాయిలో పరిశోధించి మరిన్ని వివరాలు అందిస్తానని బిష్ణుమోహన్ చెప్పారు. ఈ శాసనాల అధ్యయన కార్యక్రమంలో ఇన్‌ఫ్లూయెన్సర్, సిక్కోలు సోషల్ మీడియా సెక్రటరీ, శీకాకుళం వెదర్ మ్యాన్ రాజా అరవింద్‌సింగ్, జగ్గుభాయ్ కూడా పాల్గొన్నారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆవిష్కరణ ఉత్తరాంధ్ర చరిత్రను పునర్నిర్వచించే అవకాశం ఉంది.
Commentaires