నేనిన్నాళ్లు చేసింది ఆరాధన.. నేనీనాడు తెలిపింది నా వేదన !
- Guest Writer
- Jun 5
- 2 min read

ఈపాటికి నోరారా ‘కేలడీ కన్మణి పాడగన్ సంగదీ’ అంటూ ఆ నల్లబంగారం స్వరపరచిన పాటొకటి హృద్యంగా పాడుకుంటూ ఉండాల్సినవాడివి. ఇన్నేళ్లనించీ వింటున్నా సరే మాకే నరనరం ఉప్పొంగుతోంటే ఆ అందాల వరసల్ని నదిపాయల్లా మలుపులు తిప్పుతూ మీరిద్దరూ ఎంత ఆనందాన్ని అనుభవించి ఉంటారో కదా?
కాలమెరుగని హిమవత్పర్వత సానువుల్లో పుట్టిన ఒకానొక జీవనది స్వేచ్ఛగా పరవళ్లు తొక్కుతూ ఏ ఆనకట్టల్నీ ఎదుర్కోవలసిన అవసరం లేకుండా తనకుతానుగా ప్రకృతిలో పార్శ్వంగా కలిసిపోతుంది. నీ పాట విన్న ప్రతిసారీ అదే భావన!
అక్షరాలన్నీ పెట్టిపుట్టాయి నీ గొంతులో తానమాడేందుకు... పదాలన్నీ తేనెలో మునకలేసి పెదాలను దాటి బయటపడేందుకు.. భాష మొత్తం దాసోహమంటూ నీ మాటల్లో ఒదిగిపోయేటందుకు... ‘అడుగుల్ల సవ్వళ్లు కావమ్మా అవి ఎడదల్ల సందళ్లు లేవమ్మా!’ అంటూ సుతిమెత్తగా నువు పాడుతుంటే అలికిడన్నదే తెలియనివ్వని సున్నితంపు పాదాల చిన్నదొకతి నట్టింట్లో తిరుగుతున్నట్లే అనిపిస్తుంది. అటువంటి పాటకు అంత మార్దవమూ అవసరమన్న ఆలోచన మామ మహదేవన్‌దా, ఆ కళాతపస్విదా లేక పాటే ప్రాణమనుకునే నీదా? ఏదైతేనేం, మాకు మాత్రం పరవశాల పందేరం.
‘ఒరిగింది చంద్రవంకా వయ్యారి తారవంకా’ అంటూ మాస్టారి ముందు వినయంగా ఒదిగి మరీ ఆయనతో కలిసి నువు పాడిన ఆపాట వింటే మాకు ప్రతిరాత్రీ వసంతరాత్రే! వయసునలా వాకిట్లోనే నిలబెట్టేసిన నీకు పాట మీదకు వార్ధక్యమెలా వస్తుంది? ఇక ఎప్పటికీ ఇలాగే పాడుకుంటూ ఉంటావని, కృష్ణ తరవాత మహేష్‌బాబు, అక్కినేని నుంచి అఖిల్ వరకూ అందరికీ యవ్వనాన్ని గొంతులోనే పలికిస్తావనీ అనేసుకున్నాం. తెలుగునేలపై ఎన్నో కలాలు అనంతమైన భావామృతాలను ఒలికించాయి.
‘పాలకు దాకగా..మధువుకు పాత్రగా.. రూపం ఏదైనా మన్నొకటేరా..’ అనే వేదాంతం.. ‘పెరుగుతుంది వయసనీ అనుకుంటాము.. కాని తరుగుతోంది ఆయువనీ తెలుసుకోము’.. అంటూ నిజజీవితసత్యాల్ని..
‘ధరతక్కువ బంగారానికి ధాటిఎక్కువ.. నడమంత్రపు అధికారానికి గోతులెక్కువ’ అని హెచ్చరించే ప్రబోధాత్మక గీతాలనీ ప్రేమాస్పదమైన పలకరింపులనీ, ప్రణయరాగ వాహినులనీ కూడా తమ జ్ఞానాన్ననుసరించి ఒలికించారు.
అంతటి సంపదనూ అపాత్రదానం చెయ్యలేక ఆ పాత్రలన్నిటికీ సమన్యాయమొనరింపగల ఏకైక గాత్రసౌందర్యం నీదని నీచేతే పాడిరచారు. ఆ కారణంగానే అవన్నీ ఈనాటికీ మా ఇళ్లలో సుప్రభాతాల్లా వినబడుతున్నాయి. మావీధి మొదట్లో గుబురైన కొమ్మల్లోంచి ప్రతి ఉదయం కోయిలొకటి కమ్మగా పాడుతూ ఉంటుంది. అది ఒకటే కోయిలో, రోజుకొకటో గుర్తుపట్టలేం.
చుట్టూ ఎన్ని కోయిలలున్నా మధ్యలో నిలబడి సుస్పష్టమైన గాత్రంతో వైవిధ్యానికి ప్రతీకలా వినబడే నిన్ను మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తాం. అంతవరకూ చెవులను తాకుతున్న పాట అకస్మాత్తుగా మనసుని పలకరిస్తుంది. ‘ఈ లైన్లన్నీ బాలు పాడిన’వంటూ అండర్‌లైన్ చేసేట్టుగా మార్చేస్తావు పాటని. పుట్టినవానికి మరణము తప్పదంటూ వ్యాసభగవానుడు గీతలో చెప్పినా నీ గీతానికి మాత్రం మరణమనేదే ఉండబోదనే అత్యాశతో బ్రతికాం. వార్ధక్యంలో కూడా భౌతిక మరణం బాధిస్తుందని నీవల్లే తెలిసింది. నీ పాట ఆగడంతో మాకు ఊపిరాడనట్టయింది. నీ ఊపిరాగిన మరుక్షణం పాటకు ప్రాణం పోయింది. జయంతి నివాళులు బాలూ!
జగదీశ్ కొచ్చెర్లకోట
ఆ రెండిటి మీద శ్రీలీల ఆశలు..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ఇలా వచ్చి అలా తన యాక్టింగ్ డ్యాన్స్ లతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ధమాకా హిట్ తో టాప్ లీగ్ లోకి వెళ్లిన శ్రీలీల ఆ వరుసలోనే స్టార్ అవకాశాలు తెచ్చుకుంది. చేసిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అవ్వడం వల్ల అమ్మడికి షాక్ తగిలినట్టు అయ్యింది. ఒకటి రెండు ఛాన్స్ లు చేతిదాకా వచ్చి చేజారాయి. ఐతే ఇక అమ్మడి పని అయిపోయిందా అనుకునే సరికి మళ్లీ పుంజుకుంటుంది. శ్రీలీల తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి మాస్ జాతర కాగా మరొకటి లెనిన్. ఈ రెండు సినిమాలు కూడా మంచి అంచనాలతో వస్తున్నాయి.
అఖిల్ సరసన మొదటిసారి జత కడుతున్న శ్రీలీల లెనిన్ అంటూ రాబోతుంది. సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా సంథింగ్ స్పెషల్ గా ప్రాజెక్ట్ ఉండేలా ఉంది. మరోపక్క మాస్ జాతర సినిమా కూడా రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. ఈ రెండు సినిమాల మీదే శ్రీలీల తన ఆశలన్నీ పెట్టుకుంది. తెలుగులో మళ్లీ వరుస అవకాశాలు రావాలంటే మాత్రం ఇవి హిట్టు పడాల్సిందే.
టాలీవుడ్ లో కాకుండా శ్రీలీల కోలీవుడ్ లో పరాశక్తి సినిమా చేస్తుంది. శివ కార్తికేయన్ హీరోగా సుధ కొంగర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆ మూవీపై కూడా ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తుంది. వీటితో పాటు బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల ఆషికి 3 సినిమా చేస్తుంది. ఆషికి 2 ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఆషికి 3 వస్తుంది. ఆ సినిమాలో శ్రీలీల ఛాన్స్ అందుకోవడం గొప్ప విషయం. ఈ సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం శ్రీలీల బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది.
ఇవే కాకుండా మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఐతే అక్కడ ఇక్కడ ఏమో కానీ శ్రీలీల మాత్రం తెలుగులో తన సత్తా చాటాలని చూస్తుంది. ఎందుకంటే తెలుగులో చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఛాన్స్ అందుకుంటే నేషనల్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకునే అవకాశం ఉందని అలా సెట్ చేస్తుంది అమ్మడు. మరి అమ్మడి ప్రయత్నాలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.
తుపాకి.కామ్ సౌజన్యంతో..
Komentar