నవ్వించడమే కాదు...ఏడిపించడమూ.. తెలిసిన నటుడు !!
- Guest Writer
- 23 minutes ago
- 2 min read

హా(ఆ)ర్ట్(లఘు) ఫిలింస్‌కు చిరునామా ఆయనే!!
ఈ బుల్లోడ్ని అంతా ‘ఎల్.బి శ్రీరాం’ అంటారు. నిజానికి ఈయనకు అమ్మానాన్న పెట్టిన పేరు’’ లంక భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తి ‘‘ తన పేరులోని లంక, భద్రాద్రి, శ్రీరామచంద్రమూర్తిని కుదించి మోడర్న్‌గా ఎల్.బి శ్రీరామ్‌గా మార్చుకొని తెగ ఫోజు కొడతావుంటాడు.
అన్నట్టు... ఈయన పుట్టినూరు తూగోజి అమలాపురం సమీపంలోని ‘నేదునూరు’. సాంప్రదాయక కుటుంబంలో పుట్టారు. తండ్రి వేదపండితులు. రాష్ట్రపతి పురస్కార గ్రహీత కూడాను..అంతే కాదు ఆయన గారి పాండిత్యానికి మెచ్చి ఓమీందారు గారు ఏకంగా ఓ ఇంటినే బహూకరించారు..ప్రస్తుతం వుంటున్న ఇల్లు అదే..అన్నట్టు ఎల్.బి.అన్న గారుకూడా వేదపండితుడే.!
మరి ఇంత సాంప్ర దాయక కుటుంబంలో నుంచి వచ్చి ఏమిటీ ‘వేషాలు’ అనుకుంటున్నారు కదూ.! అక్కడికే వస్తున్నా..! తండ్రీ,అన్న వేదాలను వల్లిస్తుంటే, ఈయనేమో నాటకాలాడ్డం మొదలెట్టాడు. చిన్నోడుకదా ! అని అలా చూసీ చూడకుండా గాలికి వదిలేశారు.
అయితే.., నాటకాలాడ్డమే కాదు. నాలుగుముక్కలు రాయడం కూడా అలవాటు చేసుకున్నాడు. నాటక రచయితగా, నటుడిగా.. మంచిపేరే తెచ్చుకున్నాడు. ఈలోగా ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగంవచ్చింది. బుద్ధిగా సర్కారు ఉద్యోగం చేసుకోవచ్చు కదా! ఊహూ.. తిరిగే కాళ్ళు ఓ చోట ఆగుతాయా? సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇకనేం కాగలకార్యం కళ్ళముందు కనబడిరది.
1990లో అనుకుంటాను ‘‘కోకిల’’ సినిమాకు మాటల రచయితగా పరిచయమయ్యాడు.ఆ తర్వాత ‘కిష్కిందకాండ సినిమాకు కథా రచయిత అయ్యాడు. అదే సినిమాలో ఓ చిన్న వేషం కూడావేశాడు. ఫర్వాలేదు ఎల్‌బి ని ట్రై చెయ్యొచ్చనుకున్నారు సినీ దర్శకులు.. అయితే.. అన్నీ చిన్న చిన్న వేషాలే. గుర్తుపట్టడం కూడా కష్టమైన అనామక వేషాలు. ఈలోగా హలోబ్రదర్ (1994), హిట్లర్(1997) లాంటి సినిమాలకు మాటలు రాసి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు.
ఇవివి సత్యనారాయణకు ఆస్థాన రచయితగానే కాదు..ఆ తర్వాత ఆస్థాన నటుడిగా మారిపోయాడు ‘‘చాలా బాగుంది’’ సినిమాలో కావడితో నీళ్ళుమోసే ‘పిచ్చిసచ్చినోడి’ పాత్రలో జనానికి పిచ్చెక్కించేశాడు. ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాలేదు.400సినిమాలకు పైగా నటించిమెప్పించాడు. హాస్యనటుడిగానే కాదు. ఇవివి ‘‘అమ్మోఒకటో తరగతి ‘‘సినిమాలో ఓమధ్యతరగతి తండ్రిగా కళ్ళ నీళ్ళుపెట్టించాడు.(ఒంటెద్దు బండి అనే ఎల్బీ రాసిన నాటకమేదీనికి మూలం)ఇక తనకు ఎదురే లేదు అనుకున్నాడు. కలాన్నిపక్కన పడేసి,ముఖానికిరంగులేసుకోడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. అడపాదడపా క్యారెక్టర్ యాక్టర్‌గా, తండ్రి పాత్రలు కూడా ట్రై చేశాడు. కొంతకాలానికి కొత్త తరం. వచ్చింది.వేషాలు తగ్గిపోయాయి.!
హార్ట్ ఫిలింస్.?!
తను కలిసి నటించిన కమెడియన్స్ చాలామంది తెలుగుతెరకు దూరమవటంతో సినీమాల్లో ఎల్బీ ప్రభ కూడా తగ్గిపోయింది. సినిమాల్లో తనకు సరైన పాత్రలు రావడం లేదన్న సంగతిని ఆయన తేలిగ్గానే జీర్ణం చేసుకున్నారు.ఇక లాభం లేదను కొని తనే సినీ నిర్మాతగా మారి విశ్వనాథ గారి జీవితం, సాహిత్య ప్రస్థానంపై సినిమాతీశారు. విశ్వనాథ వారి పాత్రలో ఆయనే నటించారు. కానీ విశ్వనాథ వారు బరువు కావడంతో ఈయన పాత్ర తేలిపోయింది. అయినా రేఖామాత్రంగానైనా ఆ మహాకవిని వెండితెరపై ఆవిష్కరించిన ఘనత ఎల్బీదే.!!
నాలుగుసార్లు నంది పురస్కారాలను అందుకున్న ఎల్బీ క్రమంగా యూట్యూబుకు దగ్గరయ్యాడు.’’ఎల్బీ శ్రీరాం హార్ట్ ఫిలింస్’’ పేరుతో పుంఖానుపుంఖంగా లఘు చిత్రాలను నిర్మిస్తుస్తున్నారు..
ఎల్.బి.శ్రీరాం హార్ట్‌ఫిలింస్ పేరుతో లఘుచిత్రాలు కూడా రూపొందిస్తున్నారు. ఇంటిల్లిపాదీ కలిసి చూసే చక్కని చిత్రాలను ఆయన నిర్మిస్తున్నారు.! ఇప్పటికే ఆయన యూట్యూబ్‌లో లక్షలాది వ్యూస్‌ను సొంతంచేసుకున్నారు.. ఒకటా ! రెండా ? వందల సంఖ్యలో లఘుచిత్రాల నిర్మాత,దర్శకుడిగానేగాక, నటుడిగా కూడా తన ప్రతిభను చాటుకుంటున్నారు. త్వరలోనే ఆయన ‘‘గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు’’కెక్కినా ఆశ్చర్యంలేదు.!! దురదృష్టం ఏమంటే ఇంత గొప్పనటుడ్ని మనతెలుగు సినిమా ఇండస్ట్రీ సరిగా వాడుకోవడంలేదు.
- ఎ.రజాహుస్సేన్
Comentarios