పేకాట.. పంచాయితీ.. హత్య
- BAGADI NARAYANARAO

- 4 hours ago
- 2 min read
సిక్కోలువాసుల దోపిడీ కేసులో రౌడీషీటర్ కొడుకు హతం
పోలీసుల అదుపులో అలమండ శిబిరం నిర్వాహకులు
జూదం పేరు చెబితే వణికిపోతున్న జిల్లా జూదరులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఒడిశాలోని అలమండలో పేకాటకు వెళ్లి నిలువుదోపిడీకి గురైన జిల్లావాసుల కథలో ఇప్ప్పుడు కొత్తగా కోణం కూడా చేరింది. పేకాడటానికి వెళ్లినవారిని తుపాకితో బెదిరించి నగదు, బంగారం ఎత్తుకుపోయిన ముఠాతో పంచాయితీ నిర్వహించిన తర్వాత ఈ తుపాకీ గ్యాంగ్‌కు లీడర్‌గా ఉన్న శివ తనయుడ్ని హత్య చేశారు. అయితే ఎవరు చేశారు? ఎందుకు చేశారనేది ఒడిశా పోలీసుల విచారణలో తేలాల్సివుంది.
శ్రీకాకుళం నగరానికి 120 కిలోమీటర్లు, పార్వతీపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఒడిశా భూభాగం అలమండ మామిడితోటలో పేకాట శిబిరంపై రాయఘడకు చెందిన రౌడీషీటర్లు ఎనిమిది మంది మÖడు తుపాకులు, రెండు వేటకొడవళ్లు పట్టుకొని దోపిడీకి పాల్పడ్డారు. పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నవారు రాయఘడలోనే మరో రౌడీగ్యాంగ్‌ను ఆశ్రయించి తమ కస్టమర్ల వద్ద దోచుకున్న బంగారం, నగదు ఇప్పించాలని కోరారు. ఈమేరకు రెండు ముఠాల మధ్య ఒప్పందం జరిగింది. శ్రీకాకుళం పేకాటరాయుళ్ల నుంచి దోచుకున్న బంగారం గొలుసు, ఉంగరాలు ఇచ్చేయడానికి తుపాకీ ముఠా లీడర్ శివ ఒప్ప్పుకున్నాడు. అయితే నగదు ఇవ్వమని తేల్చేశారట. ఈ గొడవలో శివ కుమారుడు చనిపోయాడని చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
అలమండ పేకాట శిబిరంపై నక్సల్స్ పేరుతో శుక్రవారం సాయంత్రం రాయఘడకు చెందిన శివ రౌడీగ్యాంగ్ తుపాకులతో దాడి చేసింది. పేకాట శిబిరం నిర్వాహకులు, ఆడటానికి వచ్చినవారిని చితక్కొట్టి తుపాకులు గురిపెట్టి నగదు, బంగారం దోచుకెళ్లారు. దీనికి ప్రధాన సూత్రధారి రౌడీషీటర్ రాయఘడకు చెందిన శివ అలియాస్ రాయఘడ శివ. ఇప్ప్పుడు ఈ సెటిల్మెంట్‌లో ఆయన కుమారుడ్నే ప్రత్యర్ధులు అంతమొందించినట్టు విశ్వసనీయ సమాచారం. బంగారం గొలుసు, ఉంగరాన్ని నిర్వాహకులు తీసుకున్న తర్వాత ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగినట్టు తెలిసింది. ఈ వివాదంలో రౌడీషీటర్ శివ కుమారుడు హత్యకు గురైనట్టు తెలిసింది. దీంతో నిర్వాహకులు, శిబిరానికి వెలుతున్న జూదరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
రాయఘడ శివపై ఒడిశాలో కనిపిస్తే కాల్చివేత ఆర్డర్ గతంలోనే ఉందని స్థానికులు చెబుతున్నారు. పేకాట శిబిరం వద్దకు శివ గ్యాంగ్ ఒడిశా రిజిస్ట్రేషన్ కలిగిన 7363 డిజైర్ కారుపై వచ్చి దోపిడికి పాల్పడినట్టు తెలిసింది. పార్వతీపురానికి చెందిన పవన్‌కుమార్‌కు ఒడిశాలో అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధం ఉన్న బంధువు ఒకరు ఉండటంతో ఈ శిబిరాన్ని లక్ష్మీపురం పోలీస్ సŸర్కిల్ పరిధిలో అధికారులకు నెలవారీ మామÖళ్లు ఇచ్చి నిర్వహిస్తున్నారని భోగట్టా. కారులో వచ్చిన శివ గ్యాంగ్ పేకాట శిబిరం నిర్వాహకుడు పవన్‌కు కణతపై తుపాకీ పెట్టి తాము నక్సలైట్లమని, కదిలేతే కాల్చేస్తామని బెదిరించడంతో ముందుగా రూ.50వేలను రౌడీషీటర్ శివకు పవన్ ఇచ్చినట్టు తెలిసింది. సరిపోదని చెప్పడంతో మరో రూ.50 వేలు ఇచ్చారు. సంతృప్తి చెందని శివగ్యాంగ్ పేకాట శిబిరంలో ఉన్న జూదర్ల మెడలో, చేతికి ఉన్న బంగారు అభరణాలను, జేబుల్లో ఉన్న నగదును ఇవ్వాలని హెచ్చరించారు. దీనికి వారు అంగీకరించకపోవడంతో శివ గ్యాంగ్ విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆక్కడ నుంచి సమీపంలోని కొండపైకి పేకాటరాయుళ్లు పరుగులు పెట్టారని, శివ గ్యాంగ్ దాడిలో శ్రీకాకుళం నగరానికి చెందిన కారు డ్రైవర్ నాని తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది.
జూదర్ల నుంచి శివ గ్యాంగ్ దోచుకెళ్లిన నగదు, బంగారు అభరణాలు విలువ రూ.2.50 లక్షలు మాత్రమేనని బాధితులు చెబుతున్నారు. దోపిడీపై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం లేకపోవడంతో శివగ్యాంగ్ వచ్చిన కారు నెంబర్‌ను పేకాట నిర్వాహకులు రాయఘడలోని మరో గ్యాంగ్‌కు చేరవేసి దాడికి పాల్పడిన వారి వివరాలను తెలుసుకున్నారని సమాచారం. ఈ వ్యవహారంపై ఒడిశాలోని రాయఘడలో శిబిరం నిర్వాహకులు శివతో పాటు మరో రౌడీగ్యాంగ్‌తో కలిసి పంచాయితీ పెట్టి అభరణాలను శివ గ్యాంగ్ నుంచి వెîనక్కి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైందో తెలియదు గాని శివ కొడుకును మర్డర్ చేశారని తెలుస్తుంది. ఇప్ప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు. శ్రీకాకుళం సరిహద్దుకు కూతవేటు దూరంలో ఒడిశా భూభాగంలో పేకాట శిబిరాలను నిర్వహిస్తున్న వారందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. అలమండ శిబిరాన్ని నిర్వహిస్తున్న వారిని రాయఘడ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు శిబిరాన్ని నిర్వహిస్తుంటారు. ఈ శిబిరానికి శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి రెండు కార్లు బయలుదేరి వెళుతున్నాయి. వీరితో పాటు రాజాం, విజయనగరం నుంచి కొందరు వెళుతుంటారని తెలిసింది. గత కొన్ని రోజులుగా ఒడిశాలో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలు మÖతపడడంతో అలమండకు జూదరులు రూట్ మార్చారు.






Comments