పొందూరు ఖాదీ.. సంప్రదాయ ఖైదీ
- NVS PRASAD

- Feb 11
- 3 min read
క్లస్టర్ ఏర్పాటుకు కుదరని నిబంధనలు
జీఐ ట్యాగ్ ఉన్నా మార్కెట్ లేదు
డిమాండ్ ఉన్నా మారని పద్ధతులు
అధిక ధరలూ అడ్డంకే
వంద కోట్లతో కొత్త క్లస్టర్ ఏర్పాటుపై క్లారిటీ అవసరం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)“కడుపు నిండా ఇంత కూడు పెట్టని ఆ సనాతన సంగీతం మీద, ఆ శంకరాభరణం రాగం మీద ఎందుకురా నీకంత మమకారం” అంటాడు అల్లు రామలింగయ్య శంకరాభరణం సినిమా హీరో సోమయాజులుతో. ఒకప్ప్పుడు గుర్రపుబగ్గీలు, గండపెండేరాలు, సన్మానాలు చేయించిపెట్టిన ఆ సంగీతాన్ని వదలలేక పాశ్చాత్య పెనుతుపానుకు రెపరెపలాడుతున్న సంప్రదాయ సంగీతాన్ని కాపాడలేక, కొత్తబాట పట్టలేక చివరకు సంగీత సాధనలోనే ప్రాణాలర్పించిన సీన్ ఇప్ప్పుడు సరిగ్గా మన పొందూరు ఖాదీకి సరిపోతుంది. పొందూరు ఖాదీ అంటే ఒక బ్రాండ్. కానీ ఆ బ్రాండ్‌కు మార్కెట్ లేక ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల్లో ఈ ఖాదీ నిబంధన ఇమడక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. మాది శ్రీకాకుళం అని ఎక్కడైనా చెప్ప్పుకుంటే పొందూరు ఖాదీ కూడా మీదే కదా అని మనల్ని ఇట్టే గుర్తుపడతారు. కానీ ఆ ఖాదీకి ఇప్ప్పుడు మార్కెట్ లేకపోవడంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేసింది. వాస్తవానికి పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ వచ్చిందని ఆమధ్య మనమంతా ఊదరగొట్టేశాం. దీనివల్ల పొందూరు ఖాదీకి ఏమైనా ప్రయోజనం కలిగిందా? అని ఆలోచిస్తే.. ఒక్క రూపాయి కూడా అదనంగా మార్కెట్ జరగలేదని తేలింది. వివరాల్లోకి వెళితే..
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఉప్పాడ చేనేతను కేంద్ర ప్రభుత్వం క్లస్టర్‌గా గుర్తించింది. ఉప్పాడ చీరలు ప్రసిద్ధేనని అందరికీ తెలుసు. అందుకే అక్కడొక క్లస్టర్‌ను తెచ్చుకున్నారు. ఇందుకోసం కేరళ ప్రభుత్వం రూ.40 కోట్లు కేటాయిస్తుంది. ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేసుకొని ఎక్కువ ఉత్పత్తి సాధించి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా డిజైన్లు రూపకల్పనకు ఈ క్లస్టర్ ఉపయోగపడుతుంది. అదే విధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా మంగళగిరికి మరో క్లస్టర్ తెచ్చుకున్నారు. మంగళగిరి చీరలు కూడా ఫ్యామస్. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనంతపురం జిల్లా ధర్మవరానికి మరో చేనేత క్లస్టర్‌ను తెప్పించుకున్నారు. వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తుంది. కానీ వీటన్నింటికంటే ప్రాచీనమైనది 1900 కంటే ముందు నుంచి మనుగడలో ఉన్న పొందూరు ఖాదీని మాత్రం ప్రభుత్వం క్లస్టర్‌గా గుర్తించలేదు. దీనివల్ల పత్తి నుంచి దారం తీయడం దగ్గర్నుంచి దానికి రంగులద్దడం, అక్కడి నుంచి వచ్చిన దారంతో మగ్గం మీద నేయడం వంటివి దూరాభారం ఖర్చులతో కూడుకున్న పనిగా మారిపోయింది. మరి పొందూరు ఖాదీని ఎందుకు క్లస్టర్‌గా గుర్తించలేదంటే.. శంకరాభరణంలో చెప్ప్పుకున్నట్టే పొందూరు ఖాదీ అనగానే పూర్తిగా చేతితో వడికి, మగ్గంతో నేసి, ఏమాత్రం యాంత్రీకరణ లేకుండా తయారుచేసే బట్ట అని అప్పట్లోనే దీనికో నిర్వచనాన్ని ఇచ్చేశారు. పోచంపల్లి, కంచి, ధర్మవరం, ఉప్పాడ వంటివి కూడా గతంలో చేతితో తయారుచేసిన వస్త్రాýనే అందించేవి. కానీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వీటిని ఉత్పత్తి చేయలేకపోతున్నామని వీరంతా యంత్రాలబాట పట్టారు. ఎక్కడైతే యంత్రాలు వాడుతారో అక్కడ మాత్రమే ఎంఎసఎంఈ ద్వారా క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.

పొందూరులో మాత్రం మన పోస్టల్ స్టాంప్ మీద ఉన్న నూలు వడికే రాట్నం ఇప్పటికీ కనిపిస్తుంది. ఇందులో దూదిని ఏకడానికి తూర్పుగోదావరి ప్రాంతం గోదావరి మీద ఉన్న ధవళేశ్వరం డ్యామ్ వద్ద దొరికే వాలుగు చేప దవడలో ఉన్న ముల్లును వాడుతున్నారు. చివరకు ధవళేశ్వరంలో వాలుగులు బతకడం మానేసి పులసలు వలసొచ్చిన తర్వాత కూడా ఈ వాలుగు ముల్లు కోసం మన నేతకార్మికులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్ప్పుడు కంచి పట్టు కూడా చేతితో మగ్గం మీద నేసిందే. ఎప్ప్పుడైతే దానికి మార్కెట్ పెరిగిందో.. ఇప్ప్పుడు మిషినరీ వచ్చేసింది. చేతితో నేసిన పట్టుచీర కావాలంటే రూ.25వేలు, మిషిన్ మీద తయారైనదైతే రూ.5వేలకు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఆ బాటలోనే ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి ప్రాంతాల్లో నేతన్నలు మగ్గాలను వదిలి యంత్రాలను వాడుతున్నారు. ఎప్ప్పుడైతే వీటిని క్లస్టర్లుగా గుర్తించారో పత్తి దగ్గర్నుంచి, రంగులద్దడం మొదలుకొని బట్ట తయారయ్యే వరకు ఒకేచోట జరుగుతుంది. కానీ పొందూరులో అలా కాదు. మిషిన్ మీద దారం తీసినా, నేసినా క్వాలిటీ పోతుందని మనోళ్లు నమ్ముతారు. కొనుగోలుదారులు కూడా పొందూరు ఖాదీకి అందుకే అంత ప్రాధాన్యత ఇస్తారు. కానీ మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా పొందూరు నుంచి ఖాదీ బట్ట సరఫరా కావడంలేదు. దీంతో పొందూరు ఖాదీ పేరుతో మార్కెట్‌లోకి అనేక రకాల కౌంట్‌తో బట్టలు వచ్చేస్తున్నాయి. వాస్తవానికి పొందూరు ఖాదీ పద్ధతిలో ఒక పంచె కొనాలంటే రూ.15వేలు పడుతుంది. మార్కెట్‌లో పొందూరు పేరుతో దొరికే పంచె ఎంతకమ్ముతున్నారో మనకు తెలుసు. పొందూరుకు ఇంత బ్రాండ్ ఉండి కూడా మార్కెట్ చేసుకోలేకపోవడం వల్ల జిఐ ట్యాగ్ లాంటివి వచ్చినా పొందూరు ఖాదీ కాకుండా ఎటువంటి హ్యాండ్లూమ్‌కు అయినా ప్రభుత్వం క్లస్టర్ ఏర్పాటుకు అవకాశం ఇస్తుంది. కానీ పొందూరు ఖాదీకి ఒక నిర్దేశిత తయారీ విధానం ఉండటం వల్ల కేవీఐసీ (ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్) ఒప్ప్పుకోదు. సాధారణంగా వస్త్రం మూడు రకాలు. మిల్లు క్లాత్, హ్యాండ్లూమ్ క్లాత్, ఖాదీ క్లాత్. ఇందులో మిల్లు క్లాత్ కోసం చెప్పక్కర్లేదు. హ్యాండ్లూమ్ అంటే.. నూలు వరకు యంత్రంతో తయారై చేతితో నేసే పద్ధతి. ఖాదీ అంటే.. చేతితో వడికి, చేతితోనే నేసే పద్ధతి. ఖాదీలోనే మళ్లీ మూడు రకాలు. అందులో ఎనఎంసీ ఖాదీ, మస్లిన్ ఖాదీ, ప్రాంతీయ ఖాదీ. ఇందులో మొదటి రెండు దేశంలో అనేక ప్రాంతాల్లో తయారవుతాయి. ప్రాంతీయ ఖాదీ మాత్రం కేవలం పొందూరులోనే తయారవుతుంది. అటువంటప్ప్పుడు ఈ వస్త్రానికి ఎంత డిమాండ్ ఉండాలి? కానీ మనకు అది కనిపించడంలేదు. ఇంకా మాన్యువల్‌గానే పనులన్నీ జరుగుతుండటం వల్ల డిజైన్లు లేక, రంగులు సరిపడక వెనుకబడిపోయింది. ఇక్కడి నుంచి వెళ్లినవారే చిత్రక పేరుతో డిజైన్ ఖాదీ వస్త్రాలను అందిస్తూ పెద్ద ఇండస్ట్రీగా రూపాంతరం చెందారు. పక్కనే ఉన్న అలికాంలో కూడా పద్ధతి మార్చడం ద్వారా మార్కెట్‌ను పెంచుకున్నారు. పొందూరులో మాత్రం ఓ వంద కుటుంబాలు ఇప్పటికీ ఆ పాత పద్ధతిలోనే వస్త్రాలు తయారు చేస్తున్నారు. సాధారణంగా మూడు రకాల పత్తి దీనికి అవసరం. ఇందులో ఎరుపు పత్తి గొల్లప్రోలులోను, కొండ పత్తి సాలూరు, సోపేరు, నిమ్మలవలసలో దొరుకుతాయి. ఇక తెలుపు రకం ఎక్కడైనా ఉంటుంది. వీటిని వాలుగు చేప దవడతో ఏకి, పత్తి నాణ్యతను వేరు చేస్తారు. ఇది కూడా పర్యావరణ హితమైనదే. ప్రపంచంలో ఎక్కడైనా నూలు వడికే పురి కుడివైపు ఉంటుంది. పొందూరులో మాత్రం ఎడమవైపు ఉంటుంది. ఎందుకంటే ఇది పూర్తిగా చేతితో వడకబడుతుంది కాబట్టి. ఒకవైపు వాలుగు చేప దవడ దొరక్కపోవడం, దాని స్థానంలో కత్రిమ పరికరాన్ని తెస్తే అది ఖదీదుతో పాటు ఎక్కువ మన్నిక రాకపోవడం వంటి కారణాలతో పొందూరు ఖాదీకి ధర పెరుగుతోంది. అలాగని మార్కెట్ ఉందా.. అంటే అదీ లేదు. బ్రాండ్ ఉండి కూడా సొమ్ములు చేసుకోలేకపోవడాన్ని గుర్తించయినా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక ప్రత్యేక క్లస్టర్‌గా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల ఆమదాలవలస ఎమ్మెల్యే పొందూరు ఖద్దరుకు రూ.100 కోట్ల వ్యయంతో క్లస్టర్ యూనిట్ ఏర్పాటు చేస్తామని స్థల పరిశీలన కోసం వెళ్లారు. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చిపడింది. ఖాదీకా, ఖద్దరుకా? ఈ క్లస్టర్ అనేది తేలాలి. ఎందుకంటే పొందూరు ఖాదీ వేరు, ఖద్దరు వేరు. పొందూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే సెమీ మిషినరీతో వస్త్రాలు నేస్తున్నారు. ఈ క్లస్టర్ వారికోసమా? లేదూ అంటే సంప్రదాయ పద్ధతిలో పని చేస్తున్న నేతన్నలకా అనేది తేలాల్సి ఉంది.






Comments