top of page

పాన్‌ ఇండియా.. కళ్లు తెరవాల్సింది ఎవరు?

  • Guest Writer
  • Oct 8, 2025
  • 2 min read

ఏది పాన్‌ ఇండియా సినిమా? ఇదో చిక్కు ప్రశ్న ఈమధ్య..! అన్ని భాషల్లో సమానంగా హిట్టయి వసూళ్లు సాధించడమా..? పలు భాషల తారల్ని నింపి ప్రేక్షకుల మీదకు వదలడమా..? ఇదొక గంధర్వ ప్రశ్న! ఏదో ఓ భాషలో తీయడం, నాలుగైదు భాషల్లో డబ్‌ చేయడం, ఒకేసారి రిలీజ్‌ చేయడం.. స్థూలంగా ఇదీ పాన్‌ ఇండియా సినిమా గ్రామర్‌ ప్రస్తుతం.. ఇది ఓ మార్కెటింగ్‌ తంతు.. బాహుబలితో రాజమౌళి చేసిన ప్రయోగం. అంతకుముందు ఉంటే ఉండవచ్చుగాక.. కానీ బాహుబలితోనే మార్కెటింగ్‌కు భాషల హద్దులు చెరిపేసింది రాజమౌళే!!అఫ్‌కోర్స్‌, ఏవో ఆర్థిక అక్రమాల కోసం విదేశాల్లోనూ, ఆయా భాషల్లో రిలీజ్‌ చేసి, డబ్బు వైట్‌ చేసుకునే వికట యత్నాలు, ఇండియన్‌ ఐటీ, రెవిన్యూ శాఖల్ని వెక్కిరించడం మరో ఎత్తు..దాన్నలా పక్కన పెడితే..

ఉదాహరణకు మంచు విష్ణు తీసిన కన్నప్ప తీసుకుందాం.. అన్ని భాషాల నుంచి ప్రముఖ స్టార్స్‌ను తీసుకున్నాడు. ఆ పిచ్చి కథలో అందరినీ ఎలాగోలా ఇరికించాడు. కేవలం పాన్‌ ఇండియా ముద్ర కోసం, మార్కెటింగ్‌ కోసం.. చివరకు డబ్బు కోసం హీరోయిన్‌ను కురచ దుస్తులతో ఎక్స్‌పోజ్‌ చేయించడం దాకా.. ఏమైందీ..? చివరకు బయ్యర్ల నెత్తిన ఎర్ర తువ్వాళ..! దాదాపు అన్ని పాన్‌ ఇండియా ముద్ర సినిమాలూ అంతే.. వేర్వేరు భాషల తారల్ని పెట్టడమే పాన్‌ ఇండియా టెక్నిక్‌ అనుకుంటున్నారు.., అడ్డంగా మునిగినా ఇది సరైన తోవ కాదు అని ఇంకా ఇండస్ట్రీకి తెలివి రాలేదు.

కాంతార చాప్టర్‌ వన్‌ తీసుకుందాం.. నేను సినిమా గురించి నాణ్యత జోలికి పోవడం లేదు ఇక్కడ..మొత్తం కన్నడ తారలే.. మనకు చాలామంది తెలియదు. కాంతార ఒరిజినల్‌లో ఉన్న సప్తమి గౌడ గానీ, మానసి సుధీర్‌ గానీ లేరు ఈ ప్రిక్వెల్‌లో..కాకపోతే సేమ్‌ కన్నడ పిల్ల.. రుక్మిణి వసంత్‌ను తీసుకున్నాడు రిషబ్‌ శెట్టి.. జస్ట్‌, ఒక్క మలయాళీ జయరాం మినహా అందరూ కన్నడ లోకల్‌ స్టార్సే.. ఐతేనేం బంపర్‌ హిట్‌ మళ్లీ.. మన తెలుగు దర్శకుల్లో ఎంతమందికి ఉన్నాయి ఈ గట్స్‌..? సిగ్గుపడండి.. తెల్లతోలు హీరోయిన్లు, నార్త్‌ అమ్మాయిలు.. నటన శూన్యం, ఆరబోత మినహా.. మార్కెటింగ్‌ టాక్టిక్స్‌ కోసం వేరే భాషల ప్రధాన తారల్ని తీసుకొచ్చి ఇరికించి, ఒరిజినాలిటీని పూర్తిగా నాశనం చేసుకోవడం..!

సరే, కమర్షియల్‌ కోణంలోకి వద్దాం..కన్నప్ప కేస్టింగ్‌ ఉదాహరణ తరువాత ఇది మరో కోణంలో ఓ తాజా ఉదాహరణ. పవన్‌ కల్యాణ్‌ ఓజీకి మస్తు హైప్‌.,. కానీ ఏమైంది..? తెలుగులో తప్ప ఇంకెక్కడా ఆడలేదు. ఫ్యాన్స్‌ సినిమాను హిట్‌ చేయలేరు. బయ్యర్లు చాలా నష్టాలపాలు కాబోతున్నారు.

కానీ కాంతారా తాజా వసూళ్లు చూద్దాం.. ఓజీ 11 రోజుల్లో 283 గ్రాస్‌ వసూళ్లు కాగా.. కేవలం తన కన్నడ తారాగణంతోనే నిర్మించిన రిషబ్‌శెట్టి కాంతార చాప్టర్‌ వన్‌ సినిమాకు మూడే రోజుల్లో 308 కోట్ల వసూళ్లు రాబట్టాడు. అది స్క్రిప్ట్‌, ఇమేజీ బిల్డప్పుల చెత్తా ధోరణి ఎలివేషన్లకు మించిన అపూర్వ ప్రయోగాలు, నిబద్ధత..

ఓజీ తెలుగు తప్ప వేరే భాషల్లో సూపర్‌ ఫ్లాప్‌.. అంతెందుకు మిరాయ్‌ కూడా నాలుగు రోజులు దుమ్మురేపి చల్లబడిపోయింది. హిందీలో కూడా.. తేజ సజ్జ ఆనలేదు ఆ పాత్రకు.. కాంతారా చాప్టర్‌ వన్‌ వసూళ్ల వివరాలు ఇవీ..

కన్నడంలో 63 కోట్లు, తెలుగులో 47 కోట్లు, హిందీ 74 కోట్లు, తమిళం 22 కోట్లు, చివరకు మలయాళంలో కూడా 18 కోట్లు.. ఇది కదా పాన్‌ ఇండియా మూవీ అంటే! ఎవడో హిందీ స్టార్‌ను తీసుకొచ్చి, కోట్లకుకోట్లు తగలేసి, ఆ భారం కూడా జనం మీద రుద్దే చెత్తా నిర్మాతలు తెలుసుకోవల్సిన సత్యం ఇది.. చివరకు డబ్బింగ్‌ సినిమాలకూ టికెట్‌ రేట్ల పెంపు వరం ఇచ్చే ప్రభుత్వాలకు తిరస్కార పూర్వక నమోనమః!!.

- ముచ్చట సౌజన్యంతో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page