top of page

పేరులో ఏముంది.. ప్రగతే పెన్నిధి!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 3 min read

కొత్త విమానాశ్రయం పేరుపై అభ్యంతరాలు

దూరాభారంపైనా ధుమధుమలు

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే నిర్ణయాలు

పెద్ద నగరాల పేర్లే పెట్టడం సాంకేతికంగా సబబు

అభివృద్ధికి కొత్త రెక్కలు తొడిగే అవకాశం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ప్రస్తుతం విశాఖ నగరంలో ఉన్న విమానాశ్రయం స్థానంలో ఆధునిక సౌకర్యాలతో కొత్త విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదన చాలా కాలం క్రితమే తెరపైకి వచ్చింది. అప్పటినుంచీ కొత్త విమానాశ్రయ నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుంది?.. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న చర్చలు, రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీటన్నింటినీ దాటుకుని ఎట్టకేలకు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఉనికిలోకి వచ్చింది. ప్రధాన నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపించుకున్న ఈ విమానాశ్రయంలో ఈ నెల 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దాంతో ఒక చిరకాల డిమాండ్ సాకారం అయ్యిందనుకుని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే కొత్త విమానాశ్రయం పేరు, దాని దూరం వంటి విషయాల్లో మళ్లీ వాదోపవాదాలు, కొత్త డిమాండ్లు, చర్చలు మొదలయ్యాయి. విశాఖపట్నం విమానాశ్రయాన్ని తీసుకెళ్లి సుదూరంగా ఉన్న భోగాపురంలో పెట్టడం వల్ల విమాన ప్రయాణ సమయం కంటే విశాఖ నుంచి విమానాశ్రయానికి వెళ్లడానికే నానాపాట్లు పడాల్సి వస్తుందని విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వంటివారు విమర్శిస్తున్నారు. అందువల్ల కొత్త విమానాశ్రయంతోపాటు ఇప్పటికే నగరంలో ఉన్న పాత విమానాశ్రయం నుంచి పౌరవిమాన సర్వీసు నడపాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొత్త విమానాశ్రయం విజయనగరం జిల్లా పరిధిలో ఏర్పాటైంది. దానికోసం భోగాపురం మండల రైతులు వేలాది ఎకరాల భూములు ఇచ్చారు. కానీ విమనాశ్రయానికి భోగాపురం పేరు పెట్టకుండా వైజాగ్ పేరు పెట్టడం తగదని విజయనగరం జిల్లావాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సత్తా అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ వంటివారు ఇదే అంశంపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాభిప్రాయం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండింటికీ భిన్నంగా ఉత్తరాంధ్ర మÖడు ఉమ్మడి జిల్లాల పేర్లు కలిసివచ్చేలా ఎస్‌వీవీ(శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) ఏఎసఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చాలన్న డిమాండ్లు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండు వాదనలతో ప్రభుత్వవర్గాలతోపాటు విమానయాన రంగంపై అవగాహన ఉన్నవారు విభేదిస్తున్నారు. ఒక విమానాశ్రయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం, దానికి పేరు పెట్టే విషయంలో చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సాంకేతిక సాధ్యాసాధ్యాలు, భవిష్యత్తు అవసరాలు, అంతర్జాతీయ ప్రయాణికులకు రీచఔట్ కావడం వంటివి కీలకపాత్ర వహిస్తుంటాయి.

పేరు వివాదం

భోగాపురంలో ఏర్పాటు చేసిన కొత్త విమానాశ్రయానికి ఆ పేరు కాకుండా వైజాగ్ పేరు పట్టడాన్ని స్థానిక ప్రముఖులు తప్పు పడుతున్నారు. అయితే ఇక్కడ వారు ఒక విషయం గమనించాలి. ప్రస్తుతం విశాఖపట్నంలో నేవీకి చెందిన ఐఎనఎస్ డేగాలో కొనసాగుతున్న విమానాశ్రయాన్ని పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విస్తరించడానికి రక్షణపరమైన ఇబ్బందులు ఉన్నందునే అక్కడి పౌర విమానాశ్రయాన్ని వేరే ప్రాంతానికి మార్చాల్సి అగత్యం ఏర్పడింది. ఆ కారణం వల్లే భోగాపురం ప్రాంతానికి తరలివచ్చింది. అంటే దీన్ని విశాఖ విమానాశ్రయాన్ని రీ లోకేట్ చేయడం గానే భావించాలి తప్ప అదనంగా కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేసినట్లు కాదని విమానయాన శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం, పౌర విమానయాన శాఖలు కూడా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతోనే భోగాపురంలోని ఎయిర్‌పోర్టుకు అన్ని అనుమతులు ఇచ్చాయి.. పాత వాటిని కొనసాగిస్తున్నాయన్న విషయం గమనార్హం. ఇక విమానయానరంగ నిపుణుల వాదనల ప్రకారం చూస్తే ఒక విమానాశ్రయం ఏ పెద్ద నగరానికి అనుసంధానమై ఉంటుందో.. ఏ సమీప నగరం నుంచి అత్యధిక ప్రయాణికుల అవసరాలకు ఉపయోగపడుతుందో దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఆ నగరం పేరునే విమానాశ్రయాలకు పెడుతుంటారు. ఇంకో సాంకేతిక అంశాన్ని కూడా పలువురు ప్రస్తావిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎక్కువగా విదేశీ ప్రయాణికులకు సేవలు అందిస్తుంటాయన్నది తెలిసిందే. విదేశీ ప్రయాణికులు తమ ప్రయాణాలకు సంబంధించి రూట్‌మ్యాప్ ఖరారు చేసుకునేందుకు పెద్ద నగరాల పేరుతో ఉన్న విమానాశ్రయాలనే ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి తమ ప్రయాణాలను ఖరారు చేసుకుంటుంటారు. భోగాపురం లాంటి చిన్న ఊళ్ల పేర్లు అంతర్జాతీయ మ్యాపుల్లో కనిపించవు కనుక సమీపంలోని పెద్ద నగరాల పేర్లనే విమానాశ్రయాలకు పెడుతుంటారు. దీనికి ఉదాహరణ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్‌లో ఉన్నా.. దాన్ని హైదరాబాద్ ఎయిర్‌పోర్టుగానే పరిగణిస్తారు. అలాగే బెంగళూరు విమానాశ్రయం దేవనహళ్లిలో ఉంటుంది. అయినా దాన్ని బెంగళూరు ఎయిర్‌పోర్టుగానే అధికారికంగా వ్యవహరిస్తున్నారు. తమ ప్రాంతంలో విమానాశ్రయం పెట్టినప్పుడు దానికి ఆ ప్రాంతం పేరే పెట్టాలని కోరుకోవడం సమంజసమే.. కానీ దాని విస్తృత ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అదే సమయంలో విశాఖను ఉత్తరాంధ్ర ముఖద్వారమని ఈ ప్రాంతీయులందరూ ఓన్ చేసుకుంటుంటారు. అలాంటి నగరానికి చెందిన విమానాశ్రయం తమ వద్దకు వచ్చి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంచి, ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నప్పుడు పేరు కోసం పట్టుబట్టడం సమంజసం కాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

దూరం భారం కాబోదు

రెండో ప్రధాన వివాదం విశాఖ నుంచి కొత్త విమానాశ్రయానికి వెళ్లడం దూరాభారం అన్న విమర్శలు. ఇందులో కూడా వాస్తవం ఉంది. అయితే భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రాబోయే కొన్ని తరాల అవసరాలకు సరిపోయేలా వేలాది ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణం జరిగింది. భవిష్యత్తు మరింత విస్తరణకు కూడా ఇక్కడ భూమి అందుబాటులో ఉంటుంది. అదే విశాఖ నగరంలో ఇప్పుడున్న చోట లేదా మరో ప్రాంతంలో విస్తరణకు అవకాశాలు అసలు లేవు. పైగా ప్రస్తుత విమానాశ్రయం రక్షణరంగ పరిధిలోనే భారత నేవీకి చెందినది. రక్షణరంగం అంటేనే ఇతరులకు ప్రవేశం లేని నిషేధిత విభాగం. అలాంటిచోట ఇంకా పౌర విమానాశ్రయం కొనసాగించాలని కోరడం కూడా క్షేమదాయకం కాదు. మొదట్లో దూరం.. భారం.. కాస్త ఇబ్బంది పెట్టినా రాను రాను రవాణా సౌకర్యాలు పెరుగుతాయి. ఇప్పటికే విశాఖ నగరం నుంచి భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవడానికి తొమ్మిది కారిడార్లు అందుబాటులోకి వచ్చాయి. నేరుగా బస్సు సౌకర్యం కూడా కల్పించారు. ఇంకో విషయం ఏమిటంటే.. దేశంతోపాటు ప్రపంచంలోని ఏ విమానాశ్రయం కూడా ప్రధాన నగరాల్లో లేవు.

  • ఇండియన్ సిలికాన్ వ్యాలీగా, టెక్ హబ్‌గా పేరొందిన బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ నగర పరిధిలో లేదు. అక్కడికి సుమారు 40 కి.మీ. దూరంలో ఉన్న దేవనహళ్లి అనే గ్రామ సమాపంలో ఉంది. బెంగళూరు నుంచి అక్కడికి చేరుకోవాలంటే కనీసం గంటన్నర సమయం పడుతుంది. ఇక రద్దీ సమయాల్లో అయితే మరింత ఎక్కువ సమయమే తీసుకుంటుంది.

  • అంతెందుకు మన తెలుగు నగరమైన హైదరాబాద్ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ నగరంలోని కీలక ప్రాంతాలైన బంజారాహిల్స్, అబిడ్స్ నుంచి సుమారు 35 కి.మీ. ప్రయాణ దూరంలో ఉంది. నగరం నుంచి ఆ విమానాశ్రయానికి వెళ్లాలంటూ గంటన్నరపైనే పడుతుంది.

  • ఢిల్లీకి అనుబంధంగా నోయిడా వద్ద కొత్తగా నిర్మించిన జెవర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఢిల్లీ నగరానికి 60 నుంచి 70 కి.మీ. దూరంలో ఉంది. ఢిల్లీలోని కీలక ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లాంటే కనీసం రెండు గంటల పడుతుంది.

  • ముంబై ఎయిర్‌పోర్టు నగరం మధ్యలో ఉన్నప్పటికీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకోవడానికి గంటకుపైగానే పడుతుంది. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు నవీముంబైలో కొత్త విమానాశ్రయం నిర్మిస్తున్నారు. ఇది కూడా ముంబై నుంచి సుమారు రెండు గంటల ప్రయాణ దూరంలోనే ఉంది. ఇక కొచ్చి, గోవా మోపా ఎయిర్‌పోర్టులు కూడా ఆయా నగరాలకు దూరంగానే ఉన్నాయి.

  • గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను సమీప నగరాల విస్తరణను దృష్టిలో ఉంచుకునే దూరంగా కడుతున్నారు. ఒకవేళ నగరంలోనే ఉంటే రద్దీ పెరిగి విమానాల రాకపోకలకు, రన్‌వేల విస్తరణకు జాగా దొరకదు. ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతాయి. పైగా ఇప్పుడు భోగాపురంలో ఏర్పాటు చేయడం వల్ల విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాల అభివృద్ధికి దోహదపడి అన్నీ కలిసిపోయే అవకాశం ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page