పీహెచ్‌సీ సేవలు ఒకపూటతో సరి..!
- Prasad Satyam
- Nov 12
- 1 min read
రెండో పూట జబ్బు చేస్తే పెద్దాసుపత్రికి రావాల్సిందే
తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తున్న వైద్యాధికారులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24 గంటలపాటూ వైద్యసేవలు అందించాలని ఆదేశాలున్నా, మధ్యాహ్నం లంచ్ తర్వాత కొన్ని, 4 గంటలకు మరికొన్ని మూతపడుతున్నాయి. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి తెలుసు. కానీ ఎప్పుడూ తనిఖీ చేసిన సందర్భం గాని, ఆరా తీసిన విషయం గాని మనకు తెలియదు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో బస్ సౌకర్యం లేదనో, ఆటోలు తిరగవనో, గ్రామంలో తక్కువ జనాభా ఉన్నారనో రెండో పూట పీహెచ్‌సీ పని చేయలేదంటే కొద్దిగా అర్థం చేసుకోవచ్చు. జాతీయ రహదారికి ఆనుకొని శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న పీహెచ్‌సీలు కూడా రెండోపూట తెరవకపోవడం శోచనీయం. ఈ ఫొటోలో కనిపిస్తున్నది సాక్షాత్తు శ్రీకాకుళం ఎమ్మెల్యే సొంత మండలం, సొంత పంచాయతీ సింగుపురం పీహెచ్‌సీ. జాతీయ రహదారికి దగ్గరలోనే ఉంది. కానీ రాత్రిపూట ఇలా తాళాలు వేస్తూ సోమవారం ఫొటోకు దొరికింది. ఎమ్మెల్యే నిత్యం సింగుపురం పంచాయతీ కిష్టప్పేటలో తన సొంతింటికి వెళ్లి వస్తుంటారు. ఎప్పుడైనా ఆయన ఆకస్మికంగా తనిఖీకి వస్తారన్న భయం కూడా ఇక్కడి సిబ్బందికి లేకపోవడం విడ్డూరం. 24 గంటలూ సేవలు అందించాలని పీహెచ్‌సీల్లో వైద్యసిబ్బందిని ప్రభుత్వం విరివిగా పెంచింది. సింగుపురం పీహెచ్‌సీనే ఉదాహరణగా తీసుకుంటే.. ఇక్కడ ముగ్గురు వైద్యాధికారులను మూడు షిప్ట్‌లలో పని చేయడానికి నియమించింది. అలాగే ముగ్గురు స్టాఫ్ నర్స్‌లు, ఇద్దరు అటెండర్లు ఉన్నారు. ఎమర్జెన్సీ మేరకు డాక్టర్‌కు ఫోన్ చేస్తే రావాల్సి ఉంటుంది. డాక్టర్‌కు ఫోన్ చేయాలంటే కనీసం స్టాఫ్‌నర్స్ ఉండాలి. వీరు లేరు సరికదా.. తాళాలు వేసి అందరూ వెళ్లిపోవడం కొసమెరుపు. ఇది ఒక్క సింగుపురం పంచాయతీలోనే జరుగుతున్న తంతు కాదు. జిల్లాలో అన్ని పీహెచ్‌సీల పరిస్థితీ ఇలాగే ఉంది.










Comments