top of page

అయ్యో.. సూర్యకాంతినే అడ్డుకుంటున్నారు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jan 28
  • 3 min read
  • కాలుష్య ప్రభావంతో భూమికి చేరని సూర్యకిరణాలు

  • సగటున 13.1 గంటలు తగ్గుతున్నట్లు అంచనా

  • ఉత్తర భారతంలో అత్యధికం.. ఈశాన్యంలో తక్కువ

  • పంటలు, తాగునీటికి చేటు.. పెరగనున్న రోగాల కాటు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని అడ్డుకోలేం’ అనేది నానుడి. సత్యాన్ని దాచలేమని, అత్యల్ప శక్తితో అమేయ శక్తిని ఎదుర్కోలేమని దీని అర్థం. కానీ నేడు మానవుడు అదే దుస్సాహసానికి పాల్పడుతున్నాడు. నేరుగా సూర్యుడిని కాకపోయినా.. ఆ ప్రత్యక్ష దైవం లోకానికి ప్రసరింపజేస్తున్న వెలుగును అంటే సూర్యకాంతిని తన అనుచిత చర్యలతో అడ్డుకుంటున్నాడు. తద్వారా ప్రకతికి, మానవాళితో సహా సకల జీవరాశికి తీవ్ర నష్టం కలగజేస్తున్నాడు. అదేంటి.. సూర్యకాంతిని అడ్డుకోవడమేమిటి.. నమ్మశక్యంగా లేదు.. అని అనకండి.. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న పరిణామాలను అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు నిర్థారించిన కఠిన వాస్తవం ఇది. ఏటేటా సూర్యకాంతి తగ్గిపోతున్నదని ఇటీవల వెలువడిన అధ్యయన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనర్థం.. సూర్యుడు వెలుగు కోల్పోతున్నాడని కాదు.. ఆయన ఎప్పటిలాగే క్రమం తగ్గకుండా, వాడి తగ్గకుండా వెలుగులు ప్రసరిస్తున్నాడు. కాకపోతే మానవ తప్పిదాలు ఆ వెలుగు భూమికి చేరకుండా అడ్డుపడుతున్నాయి. దీన్నే సైన్స్ పరిభాషలో సోలార్ డిమ్మింగ్ అంటున్నారు. ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉందన్నది పక్కన పెడితే.. మన భారతదేశంలో సూర్యకాంతి తగ్గుదల ఒకింత ఆందోళనకరంగానే ఉంది.

వాతావరణ ప్రతికూలత

సాధారణంగా సూర్యుడు ప్రతిరోజూ ఉదయం నుంచీ సాయంత్రం వరకు వెలుగులు ప్రసాదిస్తూనే ఉంటాడు. అయితే వేసవి కాలంలో ఆ వెలుగుల తీక్షణత అధికంగా ఉండి చుర్రుమనిపిస్తూ, చెమటలు పట్టిస్తుంది. వర్షాకాలంలో అయితే వర్షాలు పడినప్పుడు, ఆకాశం మేఘావతమైనప్పుడు కనిపించని సూర్యుడు.. అవి లేని మిగతా రోజుల్లో మాత్రం యథాతథంగా తన కాంతిని లోకానికి అందిస్తూనే ఉంటాడు. ఇక శీతాకాలంలో సూర్యకాంతి నిరంతరం అందినా శీతగాలుల ప్రభావంతో దాని తీక్షణత తక్కువగా ఉంటుంది. ఇవన్నీ ప్రకతి సహజమైన పరిణామాలు. కానీ ఇటీవలి కాలంలో ఎండల పరిస్థితిని పరిశీలిస్తే.. ఈ రుతుక్రమం గతి తప్పుతున్నట్లు అర్థమవుతుంది. వర్షాకాలంలో మాత్రమే కురవాల్సిన వర్షాలు తనకు ముందు వేసవిలోనూ, తర్వాత వచ్చే శీతాకాలంలోనూ అకాలంగా కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాల వల్ల మేఘాలు కమ్మి సూర్యకాంతిని అడ్డుకుంటున్నాయి. అలాగే శీతాకాలంలో పొగమంచు, మేఘాలు కమ్ముకుని ఉదయం పది గంటల వరకు సూర్యుడు కనిపించని సందర్భాలను మనం తరచూ గమనిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ సూర్యకాంతి ప్రసరణపై ప్రభావం చూపుతున్నాయి. వీటికితోడు ఇప్పుడు సరికొత్త అడ్డంకులు సూర్యకాంతి భూమిని చేరకుండా అడ్డుకుంటున్నాయని అధ్యయనాల ద్వారా వెల్లడవుతోంది.

కాలుష్య మేఘాలు

ఎల్‌నినో, లానినో వంటి పరిణామాల వల్ల అతివష్టి, అనావష్టి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు. దీనికి కారణం కర్బన ఉద్గారాలు పెరగడమే. వీటి వల్లే ఇప్పుడు సూర్యకాంతి తగ్గుదల అనే ముప్పు కూడా వాటిల్లుతోంది. విపరీతంగా పెరుగుతున్న వాయు కాలుష్యం, పెట్రో ఉత్పత్తుల వినియోగం, వాహనాల రణగొణ ధ్వనులు, బయోమాస్ వ్యర్థాలను తగులబెట్టడం వల్ల ఉత్పన్నమయ్యే పొగ, పారిశ్రామిక వ్యర్థాల నుంచి చిన్న చిన్న ధూళి రేణువులు రేగి ఆకాశాన్ని కమ్మేసి ధూళి మేఘాలుగా విస్తరిస్తున్నాయి. ఇవన్నీ భూమిపైకి రావాల్సిన సూర్యరశ్మిని తరచూ అడ్డుకుంటున్నాయి. ఈ కారణాల వల్లే నగరాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో సూర్యరశ్మి తగ్గుదల ఎక్కువగా కనిపిస్తోంది. గత మూడు దశాబ్దాల అధ్యయనాల ప్రకారం చూస్తే.. వీటి వల్ల మనదేశం ఏటా సగటున 13.10 గంటల సూర్యకాంతి కోల్పోతున్నది. అయితే ఇది దేశమంతటా ఒకేలా లేదు. ఉత్తర భారతంలో ఈ సమస్య అధికంగా ఉంటే ఈశాన్య భారతంలో అతి తక్కువగా ఉంది. ఉత్తర భారత మైదాన ప్రాంతాల్లో సగటున 13.1 గంటల సూర్యకాంతి తగ్గుతుంటే హిమాలయ మైదాన ప్రాంతాల్లో సగటున 9.5 గంటల సూర్యకాంతిని ప్రజలు నష్టపోతున్నారు. ఆ తర్వాత పశ్చిమ భారతదేశంలో సగటున 8.6 గంటల తగ్గుదల కనిపిస్తోంది. దక్కన్ పీఠభూమిలో అంటే దక్షిణ భారతంలో సగటున మూడు గంటలు, అతి తిక్కువగా ఈశాన్య భారతంలో 1.5 గంటలు చొప్పున సూర్యకాంతి తగ్గుతూ వస్తోంది.

ఏమిటి నష్టం?

మామూలుగా ఎండ తీక్షణత తక్కువగా ఉంటే ఆహా.. వాతావరణం చల్లగా, హాయిగా, ఆహ్లదంగా ఉందని ఆనందిస్తాం.. ఆస్వాదిస్తాం. కానీ దానివల్ల మనకు తెలియని నష్టం వాటిల్లుతోంది. సకల జీవరాశి మనుగడకు, వాతావరణ సమతుల్యతకు సూర్యకాంతి అత్యవసరం. సూర్యరశ్మి తగిన మోతాదులో లభిస్తేనే చెట్లు ఫలపుష్పాలను సమద్ధిగా తయారు చేసి అందించగలుగుతాయి. పంట ఉత్పత్తులు సక్రమంగా, పూర్తిస్థాయిలో సమకూరుతాయి. వాతావరణంలో ఎండ వేడిమి తగ్గిపోతే వర్యావరణానికే కాకుండా పంటలకు, మనుషులు, పశుపక్ష్యాదుల్లో చీడపీడలు, వ్యాధులు పెరిగి సర్వం అనారోగ్యం పాలవుతుంది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎండ వేడిమి లేకపోతే మంచు కరగదు. తత్ఫలితంగా హిమాలయాల్లో పుట్టిన నదులకు నీరు అందదు. ఆ నదులపై ఆధారపడిన నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని లక్షలాది ప్రజలు దాహార్తితో అల్లాడిపోతారు. సాగునీరందక పంట ఉత్పత్తులు గణనీయంగా పడిపోయి ఆహార సంక్షోభం తలెత్తుతుంది. పునరుత్పాదక విద్యుత్, హరిత ఇంధనాల తయారీ కష్టతరమవుతుంది. ఇటీవలి కాలంలో సోలార్ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగాన్ని ప్రభుత్వాలు అమితంగా ప్రోత్సహిస్తున్నాయి. వాటికి ఆధారం సూర్యకాంతే. అది తగ్గిపోతే సోలార్ ఎనర్జీ ఉత్పత్తి పడిపోయి, లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పరికరాలు వథాగా ఉండిపోతాయి. ఆక్వా కల్చర్‌కు కూడా సూర్యకాంతి ఎంతో అవసరం. ఈ సమస్యను అధిమించాలంటే వాయు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి. క్లీన్, హరిత ఎనర్జీ ఎక్కువగా ఉత్పత్తి చేయాలి. వాహన కాలుష్యంపై దష్టి సారించాలి. లేనిపక్షంలో రానున్న కాలంలో సూర్యకాంతి మరింతగా తగ్గిపోయి మానవాళి మనుగడను ప్రమాదంలో పడేస్తుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page