‘రోస్టర్ ’ మాయాజాలంపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్
- Prasad Satyam
- 5 hours ago
- 2 min read
ఎస్టీ కోటా పోస్టును దక్కించుకున్న ఎస్టీయేతర అభ్యర్థి
15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని అల్టిమేటం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ పరిధిలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దక్కాల్సిన ప్రమోషన్లను కాలరాస్తూ, రోస్టర్ రిజిస్టర్లను తారుమారు చేసిన వ్యవహారంపై ఢిల్లీలోని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఎనఎం గ్రేడ్-3 నుంచి ఎంపీహెచఏ`ఎఫ్‌గా ప్రమోషన్లు కల్పించే ప్రక్రియలో పెద్ద ఎత్తున లంచాల వసూళ్లు, రికార్డుల ట్యాంపరింగ్ జరిగాయన్న ఆరోపణల నేపధ్యంలో అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
రూ. 30 లక్షల లంచాల భాగోతం
ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాu యోగి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఆర్.బాబూరావు, ఆఫీస్ సూపరింటెండెంట్ కె.శివకుమార్ అభ్యర్థుల నుంచి దాదాపు రూ.30 లక్షలు లంచాలు వసూలు చేశారని కమిషన్‌కు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీనియారిటీ జాబితాలో పేరు చేర్చడానికి ఒక్కో అభ్యర్థి నుంచి సొమ్ములు వసూలు చేసి, అర్హులైన ఎస్సీ, ఎస్టీ ఏఎన్ ఎంలకు తీవ్ర అన్యాయం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బదిలీలు, ఇతర సర్వీసు విషయాల్లోనూ ఇక్కడ భారీగా సొమ్ములు చేతులు మారాయని, దీనివల్ల పొరుగు జిల్లాలతో పోలిస్తే శ్రీకాకుళం జిల్లా ఏఎన్ ఎంలు సీనియారిటీ పరంగా తీవ్రంగా నష్టపోతున్నారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
రోస్టర్ బుక్‌లో డబుల్ ఎంట్రీలు..
ఈ కేసుపై ఢిల్లీలోని లోక్ నాయక్ భవన్‌లో కమిషన్ సభ్యులు జాతోతు హుస్సేన్ అధ్యక్షతన గురువారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. 2019 ఏఎనఎం పోస్టుల భర్తీకి సంబంధించిన రోస్టర్ రిజిస్టర్ (ఆర్‌వోఆర్)లో ఒకే ఎస్టీ అభ్యర్థి పేరు రెండుసార్లు నమోదు కాగా, మరో ముగ్గురి పేర్లు డబుల్ ఎంట్రీ అయ్యాయి. అంతేకాకుండా 605 మందితో కూడిన సీనియారిటీ జాబితాలో అసలు 24 మంది ఏఎనఎంల పేర్లను రోస్టర్ బుక్‌లోనే నమోదు చేయకపోవడం గమనార్హం. అన్నింటికంటే దారుణంగా పులి గరికమ్మ (ర్యాంక్ నెం. 338) అనే ఎస్టీయేతర అభ్యర్థికి ఎస్టీ కోటా కింద అక్రమంగా ప్రమోషన్ కల్పించినట్లు కమిషన్ విచారణలో తేలింది.
ప్రభుత్వ వివరణ:
ఈ సమావేశానికి హాజరైన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరణ ఇస్తూ.. రోస్టర్ రిజిస్టర్‌లో జరిగిన తప్పులు పొరపాటున దొర్లినవేనని, ప్రస్తుతం వాటిని సరిచేశామని తెలిపారు. ఎస్టీ కోటా కింద తప్పుగా లబ్ధి పొందిన అభ్యర్థిపై ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసి, క్రమశిక్షణా చర్యలు ప్రారంభించామని చెప్పారు. లంచాల ఆరోపణలు కేవలం ప్రైవేటు లావాదేవీలే తప్ప, అధికారిక విధులతో వీటికి సంబంధం లేదని చెప్ప్పుకొచ్చారు.
కమిషన్ సీరియస్
ఇరుపక్షాల వాదనలు విన్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ఉల్లంఘనకు తావులేకుండా సీనియారిటీ జాబితాను పారదర్శకంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
రికార్డుల అప్పగింత:
శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు భర్తీ చేసిన ఏఎనఎం ప్రమోషన్ల రోస్టర్ రిజిస్టర్ అటెస్టెడ్ కాపీలను తదుపరి విచారణ నిమిత్తం కమిషన్‌కు సమర్పించాలి.
డాక్యుమెంట్ల పంపిణీ:
2019 రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మెరిట్ లిస్టులు, సెలెక్షన్ లిస్టులు, అప్పటి జిల్లా కలెక్టర్ సంతకం చేసిన పత్రాలను ఫిర్యాదుదారునికి అందించాలి.
పునఃసమీక్ష:
నిబంధనల ప్రకారం సీనియారిటీ జాబితాలోని 154 పోస్టులలో 6% చొప్పున 9 మంది అర్హులైన ఎస్టీ అభ్యర్థులకు ప్రమోషన్లు కల్పించాలనే వాదనపై పునఃసమీక్ష జరపాలి.
కఠిన చర్యలు:
జిల్లాలో ప్రమోషన్ల ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ, గందరగోళానికి కారణమైన బాధ్యులైన అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి.
ఈ ఆదేశాలపై తీసుకున్న చర్యల నివేదికను రాబోయే 15 రోజుల్లోగా కమిషన్‌కు సమర్పించాలని, తదుపరి విచారణకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ స్వయంగా హాజరుకావాలని కమిషన్ అల్టిమేటం జారీ చేసింది. ఈ పరిణామంతో శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.






Comments