పడిపడి లేచి ఉవ్వెత్తున ఎగసిన కెరటం..
- Guest Writer
- Jul 1
- 4 min read
డీజే టిల్లు యువదర్శకుడు విమల్ కృష్ణ సక్సెస్ స్టోరీ !

సినిమాల్లో నటించినా.. కథలు రాసినా.. దర్శకత్వం చేసినా తన రంగంలో విజయ బావుటా ఎగరేసిన ప్రతి మనిషి సక్సెస్ వెనుక కూడా ఓ స్టోరీ ఉంటుంది. మొదటి సినిమా డీజే టిల్లు తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఇంజనీరింగ్ చదివిన ఓ యువకుడి సక్సెస్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం!
డీజే టిల్లు సూపర్ హిట్ అవడానికి కూడా ఓ కారణం ఉంది. డీజే టిల్లు సినిమా రాత్రికి రాత్రి తీసిన సినిమా కాదు. ఈ సినిమా కోసం దర్శకుడు విమల్ కృష్ణ నిద్రాహారాలు మాని తపస్సులా పనిచేసాడు. కోవిడ్ టైం లో అయితే ఏకంగా తన మకాంను హీరో సిద్దు జొన్నలగడ్డ ఇంటికి మార్చి స్క్రిప్ట్ వర్క్ చేసాడు. ఈ విజయం వెనుక పదేళ్ళపాటు ఆ కుర్రాడు పడిన కస్టాలు.. కఠోర శ్రమ ఉంది. ఏ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా వైజాగ్ బీచ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే ఓ కుర్రాడు పదేళ్లలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకి దర్శకుడు అయి వేదికల మీద అవార్డులు తీసుకోవడం వెనుక అతడి కష్టం ఉంది
ఈ ప్రయాణంలో ఎన్నో నిరసనలు.. హేళనలు.. అవమానాలు ఎదుర్కున్నాడు. అయినా అతడు నిరాశపడి తన లక్ష్యాన్ని వదులుకోలేదు. గోడకు కొట్టిన బంతిలా తిరిగి పరుగులు పెట్టాడు. విమల్ కృష్ణ సక్సెస్‌స్టోరీ చెప్పుకునేముందు కొంత ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ కూడా చెప్పుకోవాలి
విమల్ కృష్ణ ది వైజాగ్. సినిమాలంటే ప్రాణం. ఎప్పటికైనా సినిమాల్లో పెద్ద హీరో అయిపోవాలని కలలు కనేవాడు. ఇక్కడ విమల్ కృష్ణ తండ్రిది కూడా చిన్న ఫ్లాష్‌బ్యాక్ చెప్పుకోవాలి. విమల్ కృష్ణ తండ్రి శ్రావణ్‌కుమార్‌కు కూడా సినిమాలంటే ప్యాషన్. ఆ మోజుతోనే చిన్నప్పుడు ఏడవ తరగతి చదువుతున్న రోజుల్లోనే తెలంగాణాలోని మానుకోట ఇంటినుంచి పారిపోయి మద్రాసు రైలెక్కి సూపర్‌స్టార్ కృష్ణ ఇంటికి చేరుకొని మూడునెలల పాటు కృష్ణ, విజయ నిర్మల దంపతుల దగ్గర పెరిగాడు. తర్వాత అతని తల్లితండ్రులు కొడుకును వెతుక్కుంటూ తెలిసినవారి ద్వారా మద్రాస్ వెళ్లి కృష్ణ గారి ఇంటినుంచి తమ అబ్బాయిని వెనక్కి తెచ్చుకున్నారు.
ఇప్పుడు రీలు మళ్ళీ విమల్ కృష్ణ దగ్గరికి తీసుకొస్తే.. వైజాగ్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో విమల్‌కృష్ణ సాయంత్రం వేళ మిత్రబృందంతో రామకృష్ణా బీచ్‌కు వెళ్లి షార్ట్‌ఫిలిమ్స్ చేసేవాడు. వీళ్ళ దగ్గర పెద్ద పరికరాలు కూడా ఏమీ లేవు. చేతిలో ఉన్న మొబైల్ తోనే షూట్ చేసుకునేవారు.
వీళ్ళలో విమల్‌కృష్ణ మొబైల్ కెమెరా ముందు హీరో వేషాలు కడితే ఒక ఫ్రెండు డైలాగులు రాసేవాడు. ఇంకోడు డైరెక్షన్ చేసేవాడు. అవన్నీ ఫోనులో ప్రివ్యూ చూసుకుని మురిసిపోయేవారు. అందరి లక్ష్యం ఒకటే సినిమాల్లో సెలెబ్రిటీ అవ్వాలి.
వీళ్ళలో వీళ్ళే ఒకళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు.. మరొకడు రైటర్ గానూ.. విమల్ కృష్ణ హీరోగానూ సెటిల్ అయిపోవాలని 2012లో పెట్టేబేడా సర్దుకుని వైజాగ్ నుంచి హైద్రాబాదుకు బయలుదేరారు. విమల్ కృష్ణ తన లక్ష్యాన్ని ముందుగా తల్లితండ్రులకు చెప్తూ ‘నా అదృష్టాన్ని సినిమాల్లో పరీక్షించుకునేందుకు ఒక పదేళ్లు టైం పెట్టుకుంటున్నా.. ఒకవేళ నేను అక్కడ సక్సెస్ కాకపొతే బుద్దిగా ఉద్యోగం చేసుకుంటూ సెటిల్ అయిపోతా..’ అన్నాడు. తల్లితండ్రులు అతడ్ని దీవించి పంపారు. కానీ ఇరుగుపొరుగు నుంచి ఊహించని హేళనలు మొదలయ్యాయి. ‘ఇంజనీరింగ్ చదువుకుని సుబ్బరంగా ఏ ఉద్యోగమో చేసుకోకుండా సినిమాలంటూ ఎగేసుకుని బయలుదేరటం అవసరమా? పైగా ఏ సినిమా బ్యాక్‌గ్రౌండ్ కూడా లేదు.. మహామహా నటుల వారసులే సినిమాల్లో నిలదొక్కుకోలేక వ్యాపారాలు చేసుకుంటున్నారు’ అని కాకుల్లా పొడిచారు. ఒక్కడు కూడా అతడి ప్రయత్నాన్ని మనఃస్ఫూర్తిగా అభినందించకపోగా వెటకారాలు చేసారు. కానీ ఈ సూటిపోటి మాటలేవీ ఆ కుర్రాడి లక్ష్యాన్ని ఆపలేకపోయాయి.
అందుకు ఓ కారణం ఉంది. ఒకసారి ఏదో క్రికెట్ టోర్నమెంట్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం కపిల్ దేవ్ వైజాగ్ వచ్చాడు. పిల్లలందరూ కపిల్ దేవ్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారుకానీ విమల్‌కృష్ణ మాత్రం ఆ క్యూలో దూరకుండా చూస్తూ నిలబడ్డాడు. అప్పుడు కపిల్ దేవ్ ఆ కుర్రాడి దగ్గరకు వచ్చి నవ్వుతూ భుజం మీద చెయ్యేసి ‘అందరూ ఆటోగ్రాఫులు పెట్టించుకోవాలని ఎగబడ్డారు.. కానీ మనం కూడా అలా ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థాయికి ఎదగాలని అనుకోరు.. కొంతమంది మాత్రమే అనుకుంటారు .. ప్రయత్నించు .. ఆల్ ది బెస్ట్ ‘ అని చెప్పి వెళ్లిపోయారట. ఆ మాటల ప్రభావం విమల్ కృష్ణలో బలంగా నాటుకు పోయింది. అంతే ఎవరి హేళనలు పట్టించుకోకుండా హైదరాబాద్ వచ్చేసాడు. సినిమాల్లో హీరో అవ్వాలి సరే ఎవర్ని అప్రోచ్ అవ్వాలి ?అసలు ప్రొసీజర్ ఏంటి ? ఏమీ తెలీదు.
సరిగ్గా అప్పుడే ఎవరో క్రౌడ్ ఫండిరగ్ ద్వారా సినిమా తీస్తున్నాం అని ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ చూసి ఆడిషన్స్‌కు వెళ్ళాడు. విమల్ కృష్ణ పెర్ఫార్మన్స్ చూసి బాగా చేసావ్.. మేము కాల్ చేసినప్పుడు రమ్మని చెప్పి పంపేశారు. కానీ వాళ్ళ దగ్గరినుంచి కాల్ రాలేదు. వాళ్ళే కాదు సుమారు ముప్పై నలభై ఆడిషన్స్‌కు వెళ్లినా అందరూ బాగా చేసావ్.. మళ్ళీ కాల్ చేస్తాం.. అని పంపేశారు. కానీ ఒక్కడు కూడా కాల్ చేయలేదు. దాంతో మొదటిసారిగా విమల్‌కృష్ణలో నిరాశ వచ్చింది. సినిమాల్లో తనకు అవకాశాలు రావడం కష్టం అయిపోతుందని గ్రహించాడు. అయినా సరే ఒక్క చాన్సు అంటూ స్టూడియోల చుట్టూ తిరిగాడు. ఆఖరికి స్నేహితుల ద్వారా జెస్సీ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దాంతో పాటు ఇంకో రెండు సినిమాల్లో అవకాశం వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మళ్ళీ విమల్‌కృష్ణ అంతర్మథనంలో పడ్డాడు. తాను టార్గెట్ పెట్టుకున్న పదేళ్లలో ఐదేళ్లు గడిచిపోయాయి. ఇంకా ఐదేళ్లు ఉంది.. ఇక సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేయడం ఆపేసి ఇంటికెళ్ళిపోయి బుద్దిగా ఉద్యోగం చేసుకుందామా? అనుకున్నాడు. ఇదే విషయం క్షణం సినిమాకు దర్శకత్వం వహించిన తన స్నేహితుడికి చెప్తే ‘ విమల్ సినిమా అనేది నీ లక్ష్యం.. ఒక క్రాఫ్ట్‌లో అవకాశాలు రానంతమాత్రాన నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళిపోతావా ? సినిమాల మీద నీకున్న ప్యాషన్ ఏదో ఒకరోజు నిన్ను గొప్పవాడిని చేస్తాయి.. దర్శకుడిగా నువ్వెందుకు ప్రయత్నం చేయకూడదు ? అని ధైర్యం చెప్పి సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు, రానాల దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేసాడు. సురేష్‌బాబుతో పరిచయం విమల్‌కృష్ణ జీవితాన్ని మలుపు తిప్పింది.
సినిమాల గురించి సురేష్‌బాబు చెప్తూ, ‘నువ్వు సినిమాకి కథ రాసినా, దర్శకత్వం చేసినా విమల్‌కృష్ణ కనిపించకూడదు.. నీలో థియేటర్లో ప్రేక్షకుడి స్థానం కన్పించాలి.. అప్పుడే ఏ సినిమాకైనా, నిర్మాతకైనా న్యాయం జరుగుతుంది’ అన్నారు. ఆ మాటలు విమల్ కృష్ణకు అద్భుతమైన టానిక్‌లా పనిచేసాయి. అంతే క్షణం ఆలస్యం చేయకుండా ఇంటికెళ్లి డీజీ టిల్లు స్టోరీ రాయడం మొదలుపెట్టాడు. కథ అవుట్‌లైన్స్‌ని హీరో సిద్దు జొన్నలగడ్డకు వినిపించాడు. కథ నచ్చటంతో సిద్దు కూడా వెంటనే ఓకే చేప్పేసాడు.
ఈలోగా 2018లో కోవిడ్ రూపంలో ఇంకో అవాంతరం వచ్చింది. లాక్‌డౌన్‌లు నడుస్తున్నాయి. దాంతో విమల్ కృష్ణ తన మకాం సిద్దు ఇంటికి మార్చాడు. అక్కడే పగలూ రాత్రి స్టోరీ డిస్కషన్స్ జరిగి డీజే టిల్లు రూపుదిద్దుకున్నాడు. సరే సినిమాకు కథ రెడీ అయ్యింది.. హీరో దొరికాడు.. కానీ ప్రొడ్యూసర్ ఏడీ ?
సరిగ్గా ఇదే సమయంలో సితార ఎంటర్టైన్మెంట్ నుంచి పిలుపు వచ్చింది.. కథను ప్రొడ్యూసర్ నాగవంశీకి చెప్పడం ఆయన ఓకే చేయడం చకచకా జరిగిపోయాయి.
అదే సమయంలో వేరే కథా చర్చల్లో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ డీజే టిల్లు కథ విని అవసరమైన కొన్ని మార్పులూ చేర్పులూ సూచించడంతో ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయి శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని 2022లో డీజే టిల్లు వెండితెర మీదకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. సరిగ్గా పదేళ్లలో అనుకున్న గోల్ కొట్టాడు విమల్ కృష్ణ. డీజే టిల్లు సక్సెస్‌తో గతంలో హేళన చేసినవారే విమల్ కృష్ణను వెతుక్కుంటూ వచ్చి మరీ అభినందనలు తెలిపారు.
అయినా విమల్‌కృష్ణ ఒకటే చెప్తాడు.. ‘నేను సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు హేళన చేసినవారి మాటలను పట్టించుకోను.. కానీ కష్టకాలంలో నాకు అండగా నిలిచిన వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను.. నా ఈ విజయం వెనుక అలా భుజం తట్టి ప్రోత్సహించిన వారి ప్రేమ ఉంది.. డీజే టిల్లు విజయాన్ని మనసుకు మాత్రమే తీసుకున్నా.. ఆ విజయంతో వచ్చే గర్వాన్ని మాత్రం నా ఛాయలకు కూడా రానివ్వలేదు.. రానివ్వను కూడా’ అన్నాడు.
కొసమెరుపు: డీజే టిల్లు సినిమా చూడటానికి దర్శకుడు విమల్ కృష్ణ థియేటర్‌కు వెళ్ళినప్పుడు ఓ కుర్రాడు పరిగెట్టుకుంటూ వచ్చి ‘అంకుల్ ఆటోగ్రాఫ్ ప్లీజ్’ అని అడిగాడుఅప్పుడు విమల్ కృష్ణకు కపిల్ దేవ్ మాటలు గుర్తుకొచ్చాయి .. విజయదరహాసంతో ఆటోగ్రాఫ్ ఇచ్చాడు !
పరేష్ తుర్లపాటి
Comentários