బాగోలేదని చెప్పలేం.. అద్భుతం అనలేం!
- NVS PRASAD

- Jun 21, 2025
- 3 min read
కుబేర సినిమా రివ్యూ..
ధనవంతుల అత్యాశకు, పేదవాళ్ల ఆకలికి మధ్య జరిగే సంఘర్షణకు దృశ్య రూపమే ఈ చిత్రం. భిన్న ధ్రువాలైన ఈ ఇద్దరి వ్యక్తుల జీవితాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడ్డాయి? వాళ్ల మధ్య సంఘర్షణ ఎందుకు తలెత్తిందనేది ఆసక్తికరం.

కథ
గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ సీఈవో నీరజ్ మిత్ర (జిమ్ సర్బ్) ప్రపంచ ధనవంతుడిగా నిలవాలనేది జీవితాశయం. తన గ్లోబల్ అజెండాతో, కేంద్ర ప్రభుత్వ ‘ఆపరేషన్ సాగర్’ ప్రాజెక్ట్‌ను తన స్వలాభం కోసం వాడుకోవాలనుకుంటాడు. అందుకోసం రాజకీయ నాయకుడు సిద్ధప్పతో రూ.లక్ష కోట్ల బ్లాక్ అండ్ వైట్ డీల్ కుదుర్చుకుంటాడు. అయితే లక్ష కోట్లు చేతులు మారటం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. అందుకే ఈ భారీ లావాదేవీని ఏ ఇబ్బంది లేకుండా పర్‌ఫెక్ట్‌గా నిర్వహించేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ తేజ్ (నాగార్జున) సహాయాన్ని తీసుకుంటాడు. అందుకోసం దీపక్‌ని జైలు నుంచి బయిటకు తెస్తాడు. దీపక్ తన ఆట మొదలెడతాడు. తన మాస్టర్ మైండ్ ప్లాన్‌తో నలుగురు బిచ్చగాళ్లను సెట్ చేసి, వారి పేరిట విదేశాల్లో ఫేక్ కంపెనీలు, అకౌంట్లు సృష్టించి డబ్బు ట్రాన్స్‌ఫర్ ప్లాన్ చేస్తాడు. అయితే డీల్ పూర్తికాగానే, బిచ్చగాళ్లను ఖతం చేయాలన్న నీరజ్ ప్లాన్. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకున్న టైమ్‌లో ఒక్క దేవా(ధనుష్) మాత్రం తప్పించుకుంటాడు. ఇప్పుడు దేవాని స్విస్ అకౌంట్‌లో ఉన్న రూ.10వేల కోట్ల కోసం నీరజ్-దీపక్ గ్యాంగ్ చుట్టుముడుతుంది. అప్పుడు ఏమైంది.. దేవా నిజంగా బిచ్చగాడేనా? అతని గతం ఏమిటి? దీపక్ అతనికి సహాయం చేశాడా, మోసం చేశాడా? సమీరా (రష్మిక) అతని జీవితంలో ఎలా ప్రవేశించింది? ఆ డబ్బుతో చివరికి దేవా ఏం చేశాడు?
ఈ మల్టీ-లేయర్డ్ నెరేషన్‌లో ఎలా పావులు మారతాయి, ప్లాన్లు ఎలా పాముల్లా మలుపులు తిరుగుతాయి.. ధన బలం ముందు మానవ విలువలు నిలబడతాయా అన్న ప్రశ్నకు తెరపై సమాధానం లభిస్తుంది.
‘కుబేర’ స్క్రీన్‌ప్లే పరంగా ఒక అర్బన్ పొలిటికల్ థ్రిల్లర్. ఈ సినిమా కథలో అసలైన బ్యూటీ.. పొలిటికల్ కరప్షన్, కార్పొరేట్ ప్రాబల్యంతో జాతీయ వనరుల దోపిడి, లార్జ్-స్కేల్ మనీ లాండరింగ్, మానవ జీవితాల విలువను లెక్కచేయని వ్యవస్థలపై విమర్శ. అలాగే బిచ్చగాళ్లను బినామీలుగా ఉపయోగించి లక్ష కోట్ల స్కీమ్‌ను నడిపించడం అన్నది కథలోని అద్భుతమైన, ఒరిజినల్ కాన్సెప్ట్. ఇది కథను థ్రిల్లర్ టోన్‌తో ప్రారంభించడమే కాకుండా, సామాజిక అసమానతల్ని చక్కగా చూపిస్తుంది.
అయితే ఈ ఎత్తుగడ ఎంత నీట్‌గా డిజైన్ చేసారో.. అందుకు పూర్తి వ్యతిరేకంగా మిగతా ట్రీట్మెంట్ నడుస్తుంది. శేఖర్ కమ్ముల తన గత సినిమాల లాగానే క్లైమాక్స్‌లో తాత్వికతను కలపాలని ప్రయత్నిస్తూ, కథను అవసరం లేని దిశగా సాగదీయటం కనిపిస్తుంది. ముఖ్యంగా రిపిటేటివ్ ఎపిసోడ్లు, డైలాగ్ బరువు, మెసేజ్ ఓవర్‌డోస్ అనిపించేలా ఉంటుంది. కథలో లోతు ఉంది. దాన్ని స్పష్టంగా అందించే కథనం లేదు.
కథను టైట్‌గా కట్ చేయకపోవటం ఇబ్బంది పెట్టింది. టెక్నికల్‌గా శేఖర్ కమ్ముల కథ కొత్తగా ఉంది కానీ, స్క్రీన్‌ప్లేని నడిపించిన తీరు కథకు తగ్గ స్థాయిలో లేదు. అయితే బలమైన పాత్రలు మాత్రం బాగా రాసుకున్నారు. శేఖర్ కమ్ముల సినిమా అంటే పాటలు రిలీజ్‌కు ముందే సూపర్ హిట్. అవే థియేటర్‌కు ఓపినింగ్స్ రప్పిస్తాయి. అయితే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌లో ఆ మ్యాజిక్ మిస్సైంది. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా సహజంగా ఉంది. ఎడిటింగ్ పరంగా.. సెకండాఫ్ చాలా భాగం ట్రిమ్ చేసి రన్ టైమ్ తగ్గిస్తే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ ఖర్చు తెరపై బాగా రిచ్‌గా కనిపిస్తోంది. శేఖర్ కమ్ముల మార్క్ షాట్స్ చాలాచోట్ల పలకరిస్తాయి. ఈసారి కొత్తదనం పేరుతో శేఖర్ కమ్ముల పూర్తిగా మాయమయ్యాడు. అర్బన్ థ్రిల్లర్ నేరేషన్‌లో కథ చెప్పాలనేది శేఖర్ కమ్ములకు ఇష్టమేమో కానీ ఎందుకనో పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేదు. బాగోలేదని చెప్పలేం కానీ అద్బుతం అని మాత్రం అనలేం.
కథలో విషయముంది. కథనం రాసుకున్న తీరు కూడా ఆసక్తిగొలిపేలా ఉంది. అయితే పూర్తి రసాస్వాదన కలగడానికి నిడివి పెద్ద అడ్డమయ్యింది. మూడుగంటల పైచిలుకు నిడివి గల సినిమాలు వస్తున్నాయి, ఆడుతున్నాయి. కానీ సాగదీస్తున్నట్టు అనిపించకుండా ఉన్నప్పుడే వాటి ఫలితం ఆశాజనకంగా ఉంటుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. ప్రథమార్ధంలో చాలాసేపు గ్రిప్పింగ్‌గా నడిచింది. పాయింట్ టు పాయింట్ కన్వెన్సింగ్‌గా అనిపిస్తూ వచ్చింది. ఓపెనింగ్ సీన్లోనే కథ తాలూకు మెయిన్ పాయింట్ ఎస్టాబ్లిష్ అయిపోవడం, కాంఫ్లిక్ట్ పాయింట్ కూడా త్వరగానే రావడం వల్ల ఎంగేజింగ్‌గా అనిపించింది. కానీ రష్మిక ఎంట్రీ సీన్ నుంచి కథ టెంపో మారడం, వెంటనే ఇంటర్వల్ పడకపోవడంతో లెంగ్దీగా అనిపించింది. మళ్లీ సెకండాఫ్ కథ టేకాఫ్ బాగుంది. కానీ కథ ముందుకు వెళ్తున్నా కూడా అక్కడక్కడే నడుస్తున్న ఫీలింగొస్తుంది. అయితే ఉన్నంతలో రష్మిక ట్రాక్ కాస్త రిలీఫ్ ఇచ్చింది. ‘క్షణక్షణం’లో శ్రీదేవి తరహా కేరెక్టర్ ఆర్క్ ఆమెది. తన ప్రమేయం లేకుండా అనుకోకుండా పెద్ద సమస్యలో ఇరుక్కున్న అమాయకురాలి పాత్ర.
కంటెంట్ మీద మమకారంతో ఎడిటర్‌ని పూర్తిగా వాడుకోలేదో లేక కట్ చేయడానికి వీల్లేదని ఎడిటరే చెప్పారో తెలీదు కానీ సినిమా లెంగ్దీగా అనిపించడానికి వీళ్లిద్దరూ బాధ్యులే. ఈ అప్‌లు, డౌన్‌లు పక్కనపెడితే ధనుష్ తన పాత్రలో జీవించాడు. అమాయకత్వం, మంచితనం, ఉన్నంతలోనే తెలివిని వాడే విధానం, చదువు లేకపోయినా జ్ఞాపకశక్తితో ముందుకు వెళ్లడం లాంటి గుణాలన్నీ చాలా నేచురల్‌గా పెర్‌ఫామ్ చేసాడు. నాగార్జునది పాజిటివ్ షేడ్ ఉన్న నెగటివ్ పాత్ర. పర్యవసానాల వల్ల, అనుభవాల వల్ల, అవసరాల వల్ల, భయం వల్ల ఒక పాజిటివ్ బ్యూరోక్రాట్ నెగెటివ్‌గా మారితే ఎంత ప్రమాదమో ఈ పాత్ర ద్వారా చూడొచ్చు. ఈ తరహా పాత్ర ఆయనకి బాగా నప్పింది. ఇలాంటివి ఇంకా చేయొచ్చు. జిం షర్భ్ విలన్‌గా ఆకట్టుకున్నాడు.
చెప్పుకోదగ్గ సన్నివేశాలు, గుర్తుండే షాట్లు కొన్ని ఉన్నాయి. బిచ్చగత్తెకి పుట్టిన పిల్లవాడి చేతులతో విలన్‌కి బిచ్చమేయించే సీన్ నిజంగా హత్తుకుంది. అలాంటి పొయెటిక్ మూమెంట్స్ ఇంకొన్ని బలంగా ఉంటే బాగుండేది. కాస్త నిడివి తగ్గి ఉంటే ఈ చిత్రం ఇంకొంచెం పైస్థాయిలో ఉండేది.










Comments