top of page

బాలుకు కృష్ణకు మధ్య ఎక్కడ చెడిరది?

  • Guest Writer
  • May 19
  • 4 min read

ree

టాలీవుడ్‌ వివాదాల్లో మోస్ట్‌ ఇంట్రస్టింగ్‌ టాపిక్‌ సూపర్‌స్టార్‌ కృష్ణ గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మధ్య జరిగింది. కృష్ణ, బాలు చాలా సన్నిహిత మిత్రులు. ఇద్దరూ ఒకే టైమ్‌లో ఇండస్ట్రీలో ఎదిగారు. ఉన్నత స్థానాలకు చేరారు. ఇద్దరూ నాన్‌ కాంట్రవర్షియల్‌గా వెళ్లాలనే తపన ఉన్నవారే. అయితే వారి మధ్యే కొన్ని సంవత్సరాలు నిశ్చబ్ద యుద్దం కొనసాగింది. కృష్ణకు బాలు పాట లేకుండా పోయింది. ఎందుకు? ఏం జరిగింది?

సూపర్‌ స్టార్‌ కృష్ణ, గాన గంధర్వ బాలసుబ్రహ్మణ్యం ఇద్దరూ ఒకే సంవత్సరం అటూ ఇటూగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. కృష్ణను ఆదుర్తి సుబ్బారావు తేనెమనసులు చిత్రం ద్వారా 1965లో పరిచయం చేశారు. సరిగ్గా ఆ తర్వాత సంవత్సరమే బాలసుబ్రహ్మణ్యాన్ని శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా ఎస్పీ కోదండపాణి తెరకెక్కించారు.

నేనంటే నేనే సినిమాలో గుంతలకిడి గుమ్మ పాటతో కృష్ణకు బాలు పాడితేనే వింటాం అని ఆడియన్స్‌ తేల్చి చెప్పేశారు. బాబూ మూవీస్‌ బ్యానర్‌ మీద మూడో సినిమా అంతా కొత్తవారితో తీయాలని సంకల్పించారు ఆదుర్తి సుబ్బారావు.

అందులో ఇద్దరు హీరోల్లో ఒక హీరో ఛాన్స్‌ కృష్ణను వరించింది. నిజానికి ఆ వేషం కోసం కృష్ణంరాజు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అదృష్ణం కృష్ణనే వరించింది. కృష్ణ నటించిన రెండో సినిమా కన్నెమనసులు యావరేజ్‌ అయింది. దీంతో ఏం చేయాలో తోచని పరిస్ధితి.

అలాంటి సిట్యుయేషన్‌లో ప్రముఖ నిర్మాత డూండీ పిల్చి మల్లిఖార్జునరావు డైరక్షన్‌లో గూఢచారి 116 చేసే ఛాన్స్‌ ఇచ్చారు. అలా కృష్ణ దశ తిరిగింది. ఆ వెంటనే సాక్షి. ఇలా ఫామ్‌ లోకి వచ్చేశాడు. గూఢచారి 116లో డీరిడీరి పాట ఘంటసాల పాడరేమో అనే అనుమానించారు డూండీ. కానీ సంగీత దర్శకుడు చలపతిరావు నేను పాడిస్తా కదా అని ధైర్యం చెప్పి పాడిరచేశారు.

నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటకు చెందిన శ్రీపతి పండిరాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఇంజనీరింగ్‌ చదవడానికి చెన్నై వచ్చి గాయకుడుగా కూడా ప్రయత్నాలు చేశాడు. ఒక స్టేజ్‌ ప్రోగ్రాంలో బాలు పాట విన్న సంగీత దర్శకుడు కోదండపాణి తొలి అవకాశం ఇచ్చారు.

పద్మనాభం బ్యానర్‌ లో వచ్చిన శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్నలో ఏమీ ఈ వింత మౌనం అంటూ సాగే పాటలో తన గాత్రం వినిపించారు బాలు. బాలు, కృష్ణలు ప్రవేశించే సమయానికి ఘంటసాల టాప్‌ పొజిషన్‌ లో ఉన్నారు. ఆయనకు సమీపంలో కూడా మరో గాయకుడు లేని పరిస్ధితి.

శోభన్‌ బాబు లాంటి కుర్ర హీరోలు కూడా తమకు ఘంటసాలతోనే పాడిరచమని ఒత్తిడి తెస్తున్న కాలమది. అలాంటి టైమ్‌ లో ఎంట్రీ ఇచ్చిన బాలసుబ్రహ్మణ్యం రాజబాబు తదితర కమేడియన్లకు పాడడంతోనే కథ నడపాల్సి వచ్చింది.

డెభైల్లో ఘంటసాల అనారోగ్యం పాలవడం.. ఎక్కువ పాటలు పాడలేకపోవడం జరిగింది. ఆ టైమ్‌లో ఎన్‌.టి.ఆర్‌, ఎఎన్నార్‌లకి మాత్రమే ఘంటసాల పాడేవారు. క్రిష్ణ, శోభన్‌బాబు లాంటి హీరోలకు పాడేందుకు బాలుకు అవకాశాలు వచ్చేవి.

అలా వచ్చిన అవకాశమే ఆస్తులు అంతస్తులులో ఒకటై పోదామా మమతల కోవెలలో.. అంటూ వచ్చిన పాట. అలాగే మహాబలుడులో విశాలగగనంలో చందమామ బాలుకు మంచి పేరు తెచ్చాయి. ఘంటసాల ఉన్నంతకాలం కెరీర్‌ సాఫీగా సాగించిన బాలసుబ్రహ్మణ్యానికి ఘంటసాల మరణించడంతో దెబ్బ తగిలింది.

ఘంటసాల మరణం వల్ల ఎక్కువ నష్టపోయింది బాలూనే. అలాంటి క్లిష్ట పరిస్ధితుల్లో తనకు వెన్నుదన్నుగా నిలబడి ఏం పర్వాలేదు అని ధైర్యం చెప్పి ముందుకు నడిపించినవాడు సూపర్‌స్టార్‌ కృష్ణ. ఘంటసాల సంగీత దర్శకత్వంలో వచ్చిన ఆలీబాబా నలభై దొంగలు సినిమాలో భామలో చందమామలో అనే పాటలో ఘంటసాలతో గొంతు కలిపారు బాలసుబ్రహ్మణ్యం.

ఆ తర్వాత ఏకవీరలో ప్రతిరాత్రి వసంతరాత్రి అంటూ ఘంటసాలతో కలిసిపాడారు. ఈ రెండు పాటలూ సూపర్‌ హిట్టు. ఆ తర్వాత ఇద్దరుమిత్రులులో ఎన్నాళ్లో వేచిన ఉదయం పాటలో మరోసారి ఘంటసాలతో స్వరం కలిపారు బాలు. ముందు శోభన్‌ బాబుకు, ఘంటసాల కృష్ణకు బాలు అనుకున్నారు కోదండపాణి. తీరా స్టూడియోకి వెళ్లాక సీన్‌ మారింది. కృష్ణ పోర్షన్‌ రఫ్‌ గా పాడాల్సి రావడంతో ఘంటసాలే పాడేశారు.

ఘంటసాల సంగీత దర్శకత్వంలో తులసి చిత్రం కోసం సెలయేటి గలగలా అనే డ్యూయట్‌ను సుశీలతో కల్సి పాడారు బాలు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఘంటసాల కన్నుమూశారు. ఇది చలన చిత్ర పరిశ్రమకు పెద్ద షాక్‌. ఘంటసాల మరణంతో ఎన్‌.టి.ఆర్‌ పాటలు లేని పాత్రలు చేస్తూ రావాల్సి వచ్చింది.

నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం చిత్రాల్లో రామారావుకు పాటలు ఉండవు. ఘంటసాలను పోలిన గాత్రంతో రామకృష్ణ అప్పటికే ఎంట్రీ ఇచ్చారు. దీంతో అక్కినేని, శోభన్‌ బాబు, కృష్ణంరాజు లాంటి హీరోలందరూ రామకృష్ణతోనే పాడిరచుకోవడం ప్రారంభించారు.

బాలు కేవలం కమెడియన్స్‌కు మాత్రమే పాడుకుంటూ కాలం వెల్లదీయాల్సి వచ్చింది. అలాంటి పరిస్ధితిలో బాలుకు ధైర్యం చెప్పింది సూపర్‌స్టార్‌ కృష్ణ.

ఎవరు ఎవరితో పాడిరచుకున్నా పర్లేదు. మీ వాయిస్‌ నాకు సెట్‌ అయింది. దీన్ని మార్చాల్సిన అవసరం లేదు. నా సినిమాలకు మీరు మాత్రమే పాడండి అని బాలును ప్రత్యేకంగా కోరారు కృష్ణ. సంవత్సరానికి నాలుగైదు సినిమాలు ఉంటాయనే భరోసా కూడా కల్పించారు.

ఇంత చేసి ఒకటే కోరిక కోరారాయన. అదేంటంటే కమేడియన్స్‌ కు పాడకుండా ఉంటే మంచిదనేది. ఈ కోరికను బాలు తీర్చలేదు గానీ బాలుకు అవకాశాలు మాత్రం వచ్చాయి. అక్కినేని ఆలుమగలు సినిమా టైమ్‌ లో సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు ఓ సలహా చెప్పారు బాలుకి. రామారావు, నాగేశ్వర్రావులకు పాడి మెప్పించాలంటే రెండే మార్గాలు. ఒకటి ఘంటసాలను ఇమిటేట్‌ చేయడం.. రెండు నేరుగా ఆ నటులనే ఇమిటేట్‌ చేయడం.

ఈ రెంటిలో రెండోదే బెస్ట్‌ అనుకున్నాడు బాలు. ఘంటసాలను ఇమిటేట్‌ చేసిన రామకృష్ణ వెనకతట్టు పట్టి, స్వంత గళం వినిపించిన బాలు సెటిలైపోయాడు.

సూపర్‌స్టార్‌ కృష్ణ, బాల సుబ్రహ్మణ్యం మంచి మిత్రులనే ఇండస్ట్రీలో పేరు పడిరది. ఆ తర్వాత చాలా కాలానికి డెభ్బై దశకంలోనే కృష్ణ హీరోగా కె.ఎస్‌.ఆర్‌ దాస్‌ దర్శకత్వంలో కెప్టెన్‌ కృష్ణ సినిమా వచ్చింది. ఆ సినిమా నిర్మాతలు బాలసుబ్రహ్మణ్యానికి సన్నిహితులు. బాలు ఆ మూవీకి సమర్పకుడుగా వ్యవహరించారు.

ఇలా నడుస్తున్న స్నేహం మధ్యలో తెగిపోయింది. కారణం ఏమిటి చూద్దాం. రమేష్‌ నాయుడు సంగీత దర్శకత్వంలో వచ్చిన సూర్యచంద్ర చిత్రంలో రాజ్‌ సీతారాం అనే గాయకుడు కృష్ణకు పాడాడు. అది జస్ట్‌ ప్రయోగం అనుకున్నారంతా. తీరా చూస్తే ఆ తర్వాత కృష్ణ డైరక్షన్‌ లో వచ్చిన మెగా మూవీ సింహాసనంలో పాటలు కూడా రాజ్‌ సీతారామే పాడడంతో బాలు కృష్ణల మధ్య చెడిరదనే మాట ప్రచారం అయింది.

1985 అక్టోబర్‌ ప్రాంతంలో మొదలైన ఈ వివాదం 1988 వరకు కొనసాగింది. సూర్యచంద్ర సినిమాతో మొదలైన ఎడబాటు విజయబాపినీడు డైరక్షన్‌ లో వచ్చిన మహారాజశ్రీ మాయగాడు వరకు కొనసాగింది. మహారాజశ్రీ మాయగాడు చిత్రానికా లేక రౌడీ నంబర్‌ ఒన్‌ కో గానీ సంగీత దర్శకత్వం వహించిన రాజ్‌ కోటి పట్టుపట్టి కృష్ణ బాలును కలిపారు.

అయితే అసలిద్దరి మధ్య ఏం జరిగింది?

సూర్యచంద్ర టైమ్‌లో కృష్ణతో రెగ్యులర్‌గా సినిమాలు తీసే ఓ నిర్మాతతో బాలసుబ్రహణ్యానికి చిన్న వివాదం జరిగింది. ఆ బ్యానర్‌ లో తనకు రావాల్సిన బకాయి గురించి కొంచెం గట్టిగా అడిగారాయన. విషయం కృష్ణ దగ్గరకు వెళ్లింది.

నేరుగా బాలుకి ఫోన్‌ చేశారు. ఏమిటండీ డబ్బులిస్తే తప్ప పాడను అన్నారట, అనడమే కాదు కెప్టెన్‌ కృష్ణ టైమ్‌లో నాకివ్వాల్సిన బకాయి కూడా పంపండి అనేశారు. కృష్ణ నిర్మాత నుంచి బాలూకు రావాల్సిన బకాయి వచ్చేసింది. అలాగే బాలు కూడా కృష్ణకు బకాయిపడ్డ సొమ్ము పంపేశారు. అంతే ఆ క్షణం నుంచి మూడేళ్లు కలసి పనిచేయలేదు ఇద్దరూ.

అలా చెడిన రిలేషన్స్‌ బాగుచేయడానికి నడుం బిగించిన రాజ్‌ కోటి స్వయంగా బాలుతో మాట్లాడారు. కృష్ణతో మాట్లాడిద్దాం అనుకున్నారు. అయితే కాదని బాలునే స్ట్రెయిట్‌గా తను కృష్ణను పద్మాలయా ఆఫీసులో కల్సి సారీ చెప్పబోయారు. అయితే ఆయన అవేవీ పట్టించుకోలేదు.

అవేవీ తవ్వొద్దండీ మనం కల్సి పన్జేస్తున్నాం అంతే అని షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి పంపేశారు. అలా తిరిగి కృష్ణకు బాలు పాడడం ప్రారంభమైంది. అభిమానులు పండగ చేసుకున్నారు. ఆ తర్వాత రాజ్‌ సీతారామ్‌ గాత్రం వినిపించలేదు. అలా ఓ నటుడికీ గాయకుడికీ మధ్య మొదలైన యుద్దం శాంతియ్నుతంగా ముగిసింది.

అసలు జవాబుల్లేని ప్రశ్నలు చూద్దాం... ఎవరూ చెప్పరు, చెప్పడానికి ఇష్టపడరు, బాలు ఎలాగూ లేడు, కృష్ణ అనవసర వివాదాల్లో వేలుపెట్టడు. సరే, ఆ ప్రశ్నలేమిటీ అంటే..

1) అందరినీ కలుపుకుని పోయే తత్వమున్న కృష్ణకే అంత కోపం వచ్చిందంటే, తప్పు బాలు వైపు నుంచే ఉన్నట్టు లెక్క. సో, ఇద్దరి మధ్య తగాదాకు అసలు కారణమేమిటి..? అంతటి కృష్ణకే కోపమొచ్చేట్టుగా బాలు ప్రవర్తన ఏమై ఉంటుంది..?

2) కృష్ణ కోపం తాటాకుమంట, సాయంత్రానికి చల్లారేది.. ఐనా మూణ్నాలుగేళ్లు బాలును నిష్కర్షగా ఎందుకు దూరం పెట్టాడు..?

3) నువ్వు పాడకపోతే లోకం ఆగిపోతుందా అనే స్థాయిలో కృష్ణకు కోపం వచ్చిందంటే, అది బాలు వైపు నుంచి జరిగిన ఏదో పెద్ద తప్పే ఐఉంటుంది. అది ఎప్పటికీ ఒక మిస్టరీ.

4) ఇద్దరికీ సంధి కుదిరింది సరే, ఆ తరువాత అంతటి దయార్ద్ర హృదయుడైన కృష్ణ కూడా రాజ్‌ సీతారాంను నిర్దాక్షిణ్యంగా ఎందుకు వదిలేశాడు. ఓ కరివేపాకులా ఎందుకు పరిగణించాడు, అది ఆయన తత్వం కాదుగా.. అంటే బాలు ‘సంధి షరతు’గా రాజ్‌ సీతారాంను డిస్‌కార్ట్‌ చేయించాడా కావాలనే..?!

5) నేను తప్ప ఎవరితో పాడిరచుకున్నా నేను దూరమవుతాను, పాడను అని బాలు తన మార్క్‌ షరతులు పెట్టాడా..? అలాగే చాలామందిని తొక్కేశాడనే విమర్శలు ఉన్నవి కదా..? బయటికి ఎవరూ చెప్పరు గానీ బాలు తొక్కుడు కళ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే

6) పోనీ, ఒకటీఅరా పాటలు ఇస్తూ రాజ్‌సీతారాంను ఆదుకోవాలి కదా కృష్ణ.. అదే కదా తన తత్వం, ఐనా ఎందుకు దూరం పెట్టేశాడు..?

7) తరువాత రాజ్‌ సీతారాంకు ఒక్క పాట కూడా లేదు, ఇండస్ట్రీ నుంచి ఔట్‌.. బాలు కోపం ఆ స్థాయిలో ఉంటుందా..?

8) అసలు ఆ రాజ్‌ సీతారాం ఎవరు..? తరువాత ఏమయ్యాడు..? ఇప్పుడు ఏం చేస్తున్నాడు..? ఈ ప్రశ్నలకు జవాబులు దొరకడం కష్టమే. బాలు ఆహా, బాలు ఓహో అనే కథనాలు, పొగడ్తల నుంచి మనం బయటికి రాగలిగినప్పుడు ఈ ప్రశ్నలకూ జవాబులు దొరుకుతాయి. ఆరోజు వస్తుందా..?!

రంగావర్జుల భరద్వాజ

1 Comment


bhajag.9
May 19

"ఎన్నాళ్ళో వేచిన హృదయం పాట మంచి మిత్రులు సినిమాలోది. ఇద్దరు మిత్రులు సినిమా కాదు. ఇందులో బాలు గారిని స్వార్ధ పరుడు, ఇంకొక గాయకులని నొక్కేస్తాడు అని రాశారు. సినీ రంగంలో ఇది సర్వసామాన్యం. ఈ విషయంలో లతా మంగేష్కర్ మీద కూడా ఇలాటివే వచ్చాయి. ఇప్పటికి తెలుగు సినీ రంగంలో ఇలా నొక్కుడు కార్యక్రమం జరుగుతూనే ఉంది.

Like

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page