top of page

‘‘బైసన్‌’’ స్పోర్ట్స్‌ డ్రామా కాదు

  • Guest Writer
  • 5d
  • 3 min read

ree

తమిళనాడులోని ఓ మారుమూల గ్రామం.. కానీ అక్కడ ప్రతి మనిషి శరీరంలో కబడ్డీ కూత పెడుతుంది. అందరిలాగే ఆ గ్రామం లోని కిట్టయ్య (ధ్రువ్‌ విక్రమ్‌)కి కబడ్డీ అంటే ఇష్టం. కానీ ఆ ఆటను ఆడే హక్కును కులం నిర్ణయిస్తుందనే తెలియని వయస్సు. ఎలాగైనా ఆడాలి..గెలవాలి అనే తనప కసి. ఇక కిట్టయ్య తండ్రి వేలుస్వామి (పశుపతి) ఒకప్పుడు కబడ్డీని ప్రాణం లా ప్రేమించాడు. కానీ అతని జీవితంలో జరిగిన ఒక సంఘటన.. ఒక ఆటగాడిని చంపిన వ్యవస్థ.. మౌనం ఆయనలో భయాన్ని నాటింది. అప్పటి నుంచి ఆయన నమ్మకం ఒకటే: ‘‘ఈ మట్టి కబడ్డీ ఆడేవాళ్లను నిలబెట్టదు, మింగేస్తుంది.’’ కానీ కిట్టయ్య ఆ మట్టినే ఆశ్రయిస్తాడు. తండ్రి నిషేధాన్ని పట్టించుకోకుండా, అక్క సాయంతో మైదానంలోకి అడుగు వేస్తాడు. అక్కడే మొదలవుతుంది కబడ్డీ కాదు, కులంతో పోరాటం.

ఇక కబడ్డీపై ఇష్టం, ప్రేమ చంపుకోలేని కిట్టయ్య ఆసక్తిని గమనించిన కోచ్‌ పీఈటీ మాస్టర్‌ (మదన్‌ కుమార్‌) స్కూల్‌ టీమ్‌లో చేర్చుకుంటాడు. మైదానం చిన్నదే అయినా, ప్రతి పట్టు, ప్రతి ఊపిరి పెద్దవిగా మార్చుకుంటాడు. క్రమంగా స్కూల్‌ నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం వరకు కిట్టయ్య ఒక్కో అడుగుతో తన పేరుని ‘‘బైసన్‌’’గా మార్చుకుంటాడు. స్కూల్‌ టీమ్‌ నుంచి మొదలైన కిట్టయ్య కబడ్డి ప్రస్థానం ఇండియా టీమ్‌లోకి ఎంపిక చేస్తుంది. ఆ తర్వాత జపాన్‌ దాకా వెళ్లి భారతదేశం తరపున ఆడి దేశ ప్రతిష్టను పెంచేలా ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో అతను ఎదుర్కొన కష్టాలు ఏమిటి? కిట్టయ్య అక్క రాజి ( రజిషా విజయ్‌) అతనికి ఎలా సపోర్ట్‌ అందజేసింది? రాణికి (అనుపమ పరమేశ్వరన్‌)కు కిట్టయ్య మధ్య ప్రేమ విషయం ఏమైంది? ఈ కథలో పాండ్యరాజ్‌ (అమీర్‌) కందసామి (లాల్‌)ల మధ్య గొడవ ఏమిటి? చివరికి ఏం జరిగింది? అనేది బైసన్‌ కథాంశం.

విశ్లేషణ మొదటి నుంచీ మారి సెల్వరాజ్‌ సినిమాలన్నీ తన జీవితంలోని గాయాలనుంచే పుట్టినవే. ‘బైసన్‌’ కూడా అదే తరహా వ్యక్తిగత అనుభవానికి సినిమాటిక్‌ విస్తరణ. కానీ ఈసారి ఆయన కొత్తగా చేసిన ప్రయోగం G కులంRకబడ్డీ అనే అసాధారణ మేళవింపు. ఈ కథ వెనుక ఉన్న అసలు ఆత్మ కాలమాడన్‌ (మనతి పి. గణేశన్‌) అనే నిజజీవిత కబడ్డీ ఆటగాడు. 1993 జపాన్‌ ఏషియన్‌ గేమ్స్‌లో ఇండియాను పాకిస్తాన్‌పై గెలిపించిన ఆ మనిషి జీవితం ఈ సినిమా కథకి బలమైన బిందువు. కానీ మారి దానిని బయోపిక్‌గా కాకుండా, సామాజిక సంకేతాల కథగా మలచారు.

కథలో పెద్ద ట్విస్టులు లేవు, కానీ హీరో జర్నీలోని అడ్డంకుల రూపంలోనే డ్రామా నిర్మాణం ఉంది. మారి సెల్వరాజ్‌ ఇక్కడ ఒక పెద్ద ప్రపంచాన్ని నిర్మించాడు. అది కిట్టయ్య జీవితానికి ప్రత్యక్ష సంబంధం లేనట్టే కనిపించినా, ఆ ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన కిట్టయ్య మనసును నరికే దెబ్బలాగా పని చేస్తుంది. అతను ఎదగటం కేవలం క్రీడాపరమైన కష్టం కాదు. సిస్టమ్‌తో, సైలెన్స్‌తో, సొంత వర్గపు ద్రోహంతోనే పోరాటం. ‘‘ఒక్కోసారి మనోడు కాదు అనుకునే మనిషి కంటే మనవాడు అనుకున్నవాడే ప్రమాదకరం.’’ ఈ ఒక్క డైలాగ్‌తోనే మారి తన స్టాంప్‌ను వదిలేస్తాడు.

ఇక స్క్రీన్‌ప్లే విషయానికి వస్తే... మారి సెల్వరాజ్‌ ఒక పెద్ద కాన్వాస్‌ను తీసుకున్నాడు. ఇదే ఆయన బలం కూడా, బలహీనత కూడా. కథ పెద్దదైపోయినప్పుడు, ఆయన విజువల్‌ లాంగ్వేజ్‌ తగ్గిపోతుంది. ‘‘పాత్రలు మాట్లాడుతాయి, ఫ్రేమ్‌లు కాదు.’’ ‘‘బైసన్‌’’లో కూడా అదే జరిగింది. కుల రాజకీయాలు, క్రీడా రాజకీయాలు, వ్యక్తిగత భావాలు అన్నీ డైలాగ్‌లతోనే చెబుతారు, ఫ్రేమ్‌లు మనతో మాట్లాడే అవకాశం తక్కువ. మొదటి భాగంలో కారణం లేకుండా జరిగే గొడవలు నేరేషన్‌ని సడలిస్తాయి. ఇంటర్వెల్‌ సీన్‌ మాత్రం భావోద్వేగ పరాకాష్ట ు కిట్టయ్య తండ్రి నిశ్శబ్దం అక్కడే అణచివేసిన గర్జనగా మారుతుంది. సెకెండ్‌ హాఫ్‌లో సినిమా కొద్దిగా గాడిలో పడుతుంది. కబడ్డీ ఆట, శిక్షణ, అవమానాలు, త్యాగం ఇవన్నీ కలిసిన ఎమోషన్‌తో నిండుతాయి.

అయితే మారి ఎక్కడ తడబడ్డాడు అంటే కబడ్డీ ఆటను చూపాలా, కుల వివక్షను చూపాలా? ఈ రెండిరటి మధ్య బ్యాలెన్స్‌ తప్పింది..మనకు తడిసి ముద్దైంది. మొదటి నుంచీ మారి సెల్వరాజ్‌ ఫిల్మోగ్రఫీ ప్రత్యేకమైనది.. అతని భావాలు ఎప్పుడూ ప్రజలకు సంభందించినవి, వ్యక్తులకు కాదు. అందుకే ప్రేమ కంటే సామాజిక ద్రోహమే ఎక్కువ బరువైన థీమ్‌గా నిలుస్తుంది. టెక్నికల్‌గా... ‘‘బైసన్‌’’లోని కొంత భాగం ‘‘పరియేరుం పెరుమాళ్‌’’, ‘‘కర్ణన్‌’’ మాదిరిగా డిజైన్‌ చేయబడిరది. కిట్టయ్యపై దాడి సన్నివేశాలు కరుప్పి మరణ సీక్వెన్స్‌ను గుర్తు చేస్తాయి. బస్‌ సెట్‌పీస్‌, ప్రజా ఆగ్రహం.. ఇవన్నీ మారి సిగ్నేచర్‌ మోటిఫ్స్‌లా కనిపిస్తాయి. అయినా, ప్రతి ఫ్రేమ్‌ వెనుక మట్టి వాసన, మనిషి గౌరవం ఉంది. అదే మారి యొక్క విజువల్‌ పొలిటిక్స్‌. అందుకు మిగతా టెక్నికల్‌ డిపార్టమెంట్‌ మొత్తం సహకరించారు.

మారి ఇక్కడ ఒక ఆసక్తికరమైన గ్రే జోన్‌ సృష్టించాడు. కిట్టయ్య ప్రతిభను గుర్తించే వారు ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు. అంటే, కులం దాటే క్షణాల్లో క్రీడే ఏకత సూత్రం అవుతుంది. ఇది ఒక సబ్‌టైటిల్‌ మెసేజ్‌.. స్పోర్ట్స్‌ యూనిఫార్మ్‌ ముందు జాతి, మతం, కులం అన్నీ మసకబారతాయి. కానీ ఈ అందమైన ఆలోచన కూడా డైలాగ్‌లలో మునిగిపోయింది. ఫైనల్‌ థాట్‌... ‘‘బైసన్‌’’లో మారి సెల్వరాజ్‌ ఒక స్పోర్ట్స్‌ బయోపిక్‌గా తీయలేదు. అతను కబడ్డీ మైదానాన్ని సామాజిక పోరాటానికి ప్రతీకగా వాడుకున్నాడు. సినిమా కొన్నిచోట్ల గందరగోళంగా, కొన్నిచోట్ల గుండెను తాకేలా ఉంటుంది. ఇది ఫిల్మ్‌ కాదు. ఒక నినాదం, ఒక నిశ్శబ్ద విప్లవం అన్నట్లుగా మలిచాలనే ప్రయత్నం. ‘‘బైసన్‌’’ ఒక కబడ్డీ సినిమా కాదు ఇది మైదానంలో అణగారిన గళం ఎలా వినిపించుకోవాలో చెప్పే గాథ. చూడచ్చా అందరికీ నచ్చే సినిమా కాదది..అలాగని ఎవరికీ నచ్చని పాయింట్‌ కూడా కాదు. కాబట్టి ఓ లుక్కేయండి..మీక నచ్చవచ్చేమో.


జోశ్యుల సూర్యప్రకాశ్‌

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page