బయోవేస్ట్ యార్డులో బీరుబాటిళ్లా?!
- SATYAM DAILY
- 3h
- 1 min read
రెయిన్‌బో కాంట్రాక్ట్‌ను రద్దు చేయండి
స్వచ్ఛాంధ్ర` స్వర్ణాంధ్రలో కుళ్లిన శరీర భాగాలను స్వయంగా ఎత్తిన ఎమ్మెల్యే

(సత్యంన్యూస్, శ్రీకాకుళం టౌన్)
స్వచ్ఛాంధ్ర` స్వర్ణాంధ్ర కార్యక్రమం కోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి (రిమ్స్) ఎమ్మెల్యే వస్తున్నారన్న సమాచారం ఉండటంతో రోడ్డుకిరువైపులా బ్లీచింగ్ పౌడర్ చల్లేసి, వార్డుల్లో ఫినాయిల్ వాసన వచ్చేటట్టు శుభ్రం చేసిన రిమ్స్ యంత్రాంగం.. ఆయన ఫొటోకు ఫోజిస్తారనుకొని ఒక బుట్ట, చీపురు రెడీ చేసి ఉంచారు. కట్ చేస్తే.. ఎమ్మెల్యే గొండు శంకర్ నేరుగా రిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వెనుక ఉన్న, మార్చురీకి పక్కనే ఉన్న బయోవేస్ట్ యార్డుకు వెళ్లి, అక్కడ పరిస్థితిని గమనించారు. మూటకట్టి ఉన్న ఒక గోనెసంచిని విప్పడానికి ప్రయత్నించారు. అందులో చెత్త ఉందని, ఇప్ప్పుడు డిస్పోజ్ అయిపోతుందని సూపర్‌వైజర్ చెప్ప్పుకొచ్చారు. బయోవేస్ట్ యార్డులో ఈ మూట ఏమిటని ఓపెన్ చేస్తే.. అందులోంచి ఖాళీ బీరు బాటిళ్లు, క్వార్టర్ బాటిళ్లు బయటపడ్డాయి. ముక్కుపుటాలదిరిపోయేలా దుర్ఘందం వస్తున్న ఆ చోట మందు బాటిళ్లు ఉండటమేమిటని ఆయన సిబ్బందిని ప్రశ్నించారు. బయోవేస్ట్ నిల్వ ఉంచే గొడౌన్‌ను పరిశీలిస్తే, అందులో మూటలు మూటలుగా బయోవేస్ట్‌లు పడివున్నాయి. పోస్టుమార్టం చేసినప్ప్పుడు, ఆపరేషన్ చేసి కొన్ని శరీర భాగాలను తొలగించినప్ప్పుడు వచ్చిన వ్యర్థాలతో పాటు వాడిన ఇంజక్షన్ సిరంజిలు కూడా ఉన్నాయి. వీటిని ఉదయాన్నే క్లియర్ చేయాలి కదా.. అని అడిగితే, చేసేశామంటూ సూపర్‌వైజర్ సమాధానమిచ్చారు. ఆ మేరకు రికార్డు కూడా చూపించారు. అయితే ఉదయం 10 గంటలకు బయో వేస్ట్ తరలిస్తే, మళ్లీ 2 గంటల ప్రాంతానికి ఇంత పెద్ద ఎత్తున వేస్ట్ ఎలా చేరిందంటూ నిలదీయడంతో పాటు రిమ్స్ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ డి.పార్వతితో బయోవేస్ట్‌ను డీకంపోజ్ చేసే రెయిన్‌బో సంస్థ ప్రతినిధితో మాట్లాడించారు. ఎమ్మెల్యే కూడా మాట్లాడితే, ఉదయం రిమ్స్‌లో బయోవేస్ట్‌ను కలెక్ట్ చేయలేదని, నరసన్నపేటలో కలెక్ట్ చేశామని చెప్పడంతో వెంటనే కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని డాక్టర్ పార్వతికి ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాండ్రంకి శంకర్, ప్రధాన విజయరామ్, అంధవరపు సంతోష్, నవీన్ మెడికల్ బుజ్జి, రెడ్డి గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు.










Comments