‘భూతశుద్ధి వివాహం’ చేసుకున్న సమంత
- SATYAM DAILY
- Dec 1, 2025
- 1 min read
ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు, నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఉన్న లింగభైరవి దేవి సన్నిధిలో భూతశుద్ధి వివాహం ద్వారా ఒకటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్ఠ ప్రక్రియే ఈ భూతశుద్ధి వివాహం. లింగభైరవి ఆలయాల్లో, లేదా కొన్ని ఎంపిక చేసే ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ క్రతువు వధూవరుల దేహాల్లోన్ని పంచభూతాలను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని వీరి నమ్మకం.

ఎవరీ లింగభైరవి?
ఈశా ఫౌండర్ జగ్గీ వాసుదేవ్ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ చేయబడిన లింగభైరవీదేవి స్త్రీశక్తికి సంబంధించిన ఉగ్ర, కారుణ్య స్వరూపం. జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో విశిష్టమైన ఆచారాలకు ఈ ఆలయం ప్రసిద్ధి. విశ్వంలోనే సృజనాత్మక శక్తికి ప్రతీకగా నిలిచే ఈ 8 అడుగుల శక్తిస్వరూపం భక్తుల మనఃశరీరాలను, శక్తులను సిద్ధపరుస్తూ జననం నుంచి మరణం వరకు జీవితంలోని ప్రతీ దశలోనూ వారికి అండగా నిలుస్తుందన్న ప్రచారం ఉంది.
గత కొంతకాలంగా సమంత - రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాజ్‌తో సమంత క్లోజ్‌గా ఉన్న ఫొటోలను పంచుకున్నారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. రాజ్- డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్`2’, ‘సిటడెల్: హనీ బన్నీ’లో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాజెక్ట్‌ల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్‌కు, ఆమెకు మధ్య స్నేహం ఏర్పడిరది. సమంత నిర్మించిన ‘శుభం’ చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేశారు. ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో వీరి ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా వివాహ ఫొటోలు ఆమె షేర్ చేయడంతో నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.











Comments