భువీ.. నువ్వు సూపరెహే!
- SATYAM DAILY
- 4 days ago
- 2 min read
డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ ఎమోషనల్ స్పీచ్!
గోల్డెన్ డకౌట్ అయినా.. జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న విరాట్
‘వరల్డ్ క్లాస్ భువీ’ అంటూ సీనియర్ పేసర్‌పై ప్రశంసల జల్లు

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జైత్రయాత్ర కొనసాగుతోంది. రాయ్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆఖరి బంతికి విజయాన్ని అందుకున్న ఆర్‌సీబీ, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా ప్లేఆఫ్స్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. కేవలం రెండు వికెట్ల తేడాతో లభించిన ఈ విజయం అనంతరం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.
కుప్పకూలిన టాప్ ఆర్డర్.. నిలబెట్టిన కృనాల్, భువీ!
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ‘గోల్డెన్ డక’గా వెనుదిరగగా.. పడిక్కల్, పాటిదార్ కూడా విఫలమయ్యారు. 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కృనాల్ పాండ్యా (73 పరుగులు) వీరోచితంగా ఆదుకున్నాడు. కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నా వెనక్కి తగ్గకుండా పోరాడాడు. ఆఖరి ఓవర్లో భువనేశ్వర్ కుమార్ సిక్సర్‌తో జోరు పెంచగా, చివరి బంతికి రసిఖ్ సలామ్ పరుగు తీసి విజయాన్ని ఖాయం చేశాడు.
ఇది కదా టీమ్ అంటే: విరాట్ కోహ్లీ
మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ మాట్లాడుతూ.. “మనం ఇలాంటి మెగా టోర్నమెంట్‌లు గెలవాలంటే ఒక టీమ్‌గా ఆడాలి. ఈ రోజు మనకు ఇలాంటి మ్యాచ్ అవసరం. గెలుపు కోసం చివరి వరకు పోరాడటం గొప్ప విషయం. బ్యాటింగ్ ఆరంభంలో మనం తడబడ్డాం, కానీ మిడిల్ ఆర్డర్ అద్భుతంగా నిలబడింది. కృనాల్ నీపై మాకు ఎప్పుడూ నమ్మకం ఉంటుంది. టిమ్ డేవిడ్ భాగస్వామ్యం కూడా చాలా కీలకం,” అని కొనియాడారు.
‘భువీ.. నువ్వు వరల్డ్ క్లాస్’
ముంబై బ్యాటింగ్ లైనప్‌ను తన స్వింగ్‌తో దెబ్బతీసిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (4/23)పై కోహ్లీ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ‘భువీ, పవర్‌ప్లేలో నీ బౌలింగ్ అద్భుతం. రోహిత్, సూర్య వికెట్లు తీయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. నీ నైపుణ్యం కచ్చితంగా వరల్డ్ క్లాస్. 11 మ్యాచ్‌లలో 6 సార్లు 3కు పైగా వికెట్లు తీయడం మామూలు విషయం కాదు’ అని ప్రశంసించారు. ప్రస్తుతం 21 వికెట్లతో భువీ పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
బౌలింగ్‌లో రాణించిన రొమారియో షెపర్డ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్ దార్‌ల కృషిని కూడా కోహ్లీ అభినందించారు. ఈ విజయంతో ఆర్‌సీబీ క్యాంప్‌లో జోష్ నెలకొంది. తదుపరి మ్యాచ్‌లో గెలిస్తే బెంగళూరు అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.
- సత్యం స్పోర్ట్స్ డెస్క్






Comments