top of page

భర్తను కత్తిపీటతో కడతేర్చిన భార్య..!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 10 hours ago
  • 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మద్యం కోసం అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్యపై దాడికి దిగడమే కాకుండా, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేస్తున్న భర్తను.. భార్యే కత్తిపీటతో కొట్టి ప్రాణాలు తీసిన ఘోర ఘటన శ్రీకాకుళం నగరంలో కలకలం రేపింది. ప్రకాష్‌నగర్ కాలనీలో గురువారం అర్ధరాత్రి ఈ విషాదం వెలుగు చూసింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన ధర్మాన అసిరినాయుడు (49) గత ఏడాదిన్నరగా జలుమూరు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య జయలక్ష్మి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు మణికంఠ స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ కుటుంబం రెండు నెలల క్రితమే నగరంలోని ప్రకాష్ నగర్‌లో అద్దె ఇంట్లోకి మారింది.

ఏసీ ధ్వంసం చేస్తుండటంతో..

అసిరినాయుడు మద్యానికి బానిస కావడంతో, ప్రతిరోజూ డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. గురువారం రాత్రి కూడా భార్య వద్ద మద్యం కోసం డబ్బులు తీసుకున్న ఆయన, కొద్దిసేపటికే మళ్లీ వచ్చి అదనపు డబ్బులు కావాలని గొడవ పడ్డాడు. జయలక్ష్మి నిరాకరించడంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన అసిరినాయుడు రెండు నెలల క్రితమే కొనుగోలు చేసిన ఏసీని పగలగొట్టడానికి ప్రయత్నించాడు. దీంతో ఆవేశం ఆపుకోలేకపోయిన జయలక్ష్మి, వెనుక నుంచి కత్తిపీటతో భర్త తలపై బలంగా కొట్టింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అసిరినాయుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

కుమారుడి రాకతో వెలుగులోకి..

గురువారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన కుమారుడు మణికంఠ, తండ్రి రక్తం మడుగులో పడి ఉండడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే ఆయన ‘112’ అత్యవసర నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.

కథనాల మధ్య పొంతన లేదు

రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తన సిబ్బంది, క్లూస్ టీమ్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అయితే కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుకు, పోలీసుల ప్రాథమిక విచారణకు మధ్య తేడాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

డబ్బుల గొడవలో తండ్రి తనను కొట్టాడని, ఎదురుదాడిలో వెనక్కి నెట్టడంతో కిందపడి స్పృహ కోల్పోయాడని తల్లి తనకు చెప్పినట్లు కుమారుడు మణికంఠ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కానీ ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా అనుమానిస్తున్నామని సీఐ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలు జయలక్ష్మిని అదుపులోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన కత్తిపీటను స్వాధీనం చేసుకున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page