top of page

భర్తలు బలిపశువులు.. భార్యలే విలన్లు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 3 min read
  • మట్టికరుస్తున్న మగమహారాజులు!

  • సమాజం మారుతోంది.. పరిస్థితి తిరగబడుతోంది

  • 69 శాతం ఈ తరహా హత్యల్లో భార్య, ప్రియుల ప్రమేయం

  • వేధింపులు, తప్పుడు ఫిర్యాదులు తట్టుకోలేక మరికొందరి ఆత్మహత్య

  • గత పదేళ్లలో 82 శాతం పెరిగిన భర్తల అసహజ మరణాలు

  • నిర్థారిస్తున్న జాతీయ క్రైమ్ రికార్డులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్యయనాలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

`జూలై 18.. మహారాష్ట్రలోని పుణే జిల్లా లోహ్‌గడ్ కోటలో షియా గోయల్ అనే యువతి తన ప్రియుడు చేతన్ చౌదరీతో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను కొండపై నుంచి తోసి హతం చేసింది. ఆ కేసు ఇప్పటికీ దేశంలో కలకలం రేపుతున్నది.

`రెండేళ్ల క్రితం డిసెంబర్‌లో.. బెంగళూరుకు చెందిన 34 ఏళ్ల టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.మÖడు కోట్ల భరణం ఇవ్వాలని భార్య డిమాండ్, ఆమె తరఫువారి వేధింపులే ఈ బలవన్మరణానికి కారణమని మృతుడు రాసిన సూసైడ్ నోట్, వీడియో ద్వారా వెల్లడైంది.

ఈ రెండు కేవలం ఉదాహరణలు మాత్రం భారతీయ సమాజంలో భర్తల అసహజ మరణాలు, ఆత్మహత్యలు ఊహించనంతగా పెరిగిపోతున్నాయి. ఎంతగా అంటే.. గత మÖడు నాలుగేళ్లలో మహిళల బలవన్మరణాలను పురుషుల మరణాలు దాటేసి దూసుకుపోయేంతగా! గురుగ్రామ్‌కు చెందిన ఏకం న్యాయ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద తాజాగా విడుదల చేసిన నివేదికలో గణాంకాలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం మనదేశంలో ఈ ఏడాది జనవరి నుంచి జూలై 14 మధ్య.. అంటే అరున్నర నెలల వ్యవధిలోనే 554 మంది భర్తలు హత్యకు గురికావడమో.. ఆత్మహత్యలు చేసుకోవడమో జరిగింది. వీటిలో భార్యల చేతిలోనో, వారి ప్రియుల చేతిలోనో లేదా ఇద్దరి కారణంగానో హత్యకు గురైనవారే 322 మంది కాగా.. వైవాహిక వివాదాలు, గృహహింస తదితర కారణాలతో 232 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఈ రిపోర్టులో పేర్కొన్నారు. ఏకం న్యాయ ఫౌండేషన్ భార్యా బాధిత భర్తలకు న్యాయ సహాయం చేసేందుకు 2024లో ఏర్పాటైంది. దీని ప్రధాన నిర్వాహకురాలు దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే అనే మహిళ కావడం విశేషం. భార్యా బాధిత పురుషులకు, వారి కుటుంబాలకు కౌన్సెలింగ్ చేయడం, న్యాయపోరాటంలో తగిన సాయం చేయడంతోపాటు భార్యల చేతిలో భర్తలు హత్యకు గురవుతున్న ఉదంతాలపై అధ్యయనాలు చేస్తూ.. నివేదికల రూపంలో ఆ వివరాలు ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంటుంది. డాక్యుమెంటరీలు కూడా రూపొందించి సమాజ చైతన్యానికి కృషి చేస్తున్నది.

భార్యలను అధిగమించిన భర్తలు

సమాజంలో తొలినుంచీ మహిళల పట్ల సానుభూతి కనిపిస్తుంది. వరకట్న మరణాలు, అత్తింటి వేధింపులు, భర్తల అక్రమ సంబంధాలు మహిళల ఉసురు తీస్తున్నాయన్న కారణంతో రాజ్యాంగం, చట్టపరంగా మహిళలకు అనేక రక్షణలు కల్పించారు. ఇప్పటికే మహిళలే బలిపశువులు అవుతున్నారన్న భావన సమాజంలో బలంగా ఉంది. కానీ నేర గణాంకాలు ఈ భావనను, వాదనలను తిరస్కరిస్తున్నాయి. పరిస్థితి తిరగబడిందని స్పష్టం చేస్తున్నాయి. గతంలో భర్తలు, అత్తింటివారి కారణంగా మహిళల హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయన్నది ముమ్మాటికీ వాస్తవమే. కానీ 2022 నుంచి పరిస్థితి మారిపోయింది. భర్తల చేతిలో భార్యల కంటే.. భార్యý చేతిలో భర్తలే ఎక్కువగా బలి అవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏకం న్యాయ ఫౌండేషన్‌తోపాటు ప్రభుత్వానికి చెందిన ఎన్‌సీఆర్‌బీ(నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) గణాంకాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. వీటి ప్రకారం.. 2022లో 3926 మంది మహిళలు ఈ తరహా మరణాలకు గురైతే.. దానికి మించి 4237 మంది పురుషులు బలయ్యారు. అలాగే 2023లో 4180 మంది మహిళలు చనిపోతే.. 4863 మంది పురుషులు మరణించారు. 2024లో మహిళల మరణాలు 3900 ఉండగా.. పురుషుల మరణాలు 4536గా నమోదయ్యాయి. అదే పదేళ్ల క్రితం.. అంటే 2015 నాటి గణాంకాలు ప్రకారం నాలుగువేల మంది మహిళలు మరణిస్తే.. పురుషుల సంఖ్య 2497గా ఉంది. అంటే పదేళ్ల కాలంలోనే వేధింపుల మరణాల విషయంలో మహిళలను పురుషులు దాటిపోయారు. ఈ పెరుగుదల ఏకంగా 82 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.

అక్రమ సంబంధాలే ఎక్కువ

వేధింపుల హత్యలు, బలవన్మరణాýకు గురవతున్న పురుషుల్లో అధిక శాతం మంది 30 ఏళ్లు పైబడినవారేనని తేలింది. 2019`23 మధ్య ఈ వయసు మహిళలు 6619 మంది మరణిస్తే.. అదే సమయంలో 10816 మంది పురుషులు ఈ లోకాన్ని వీడారు. విడాకులు, దంపతులు విడిపోవడం, అక్రమ సంబంధాలు, వరకట్న వివాదాలు, ఇతర కుటుంబ కలహాలు మరణాలకు కారణమవుతున్నాయి. ఆత్మహత్యల సంగతి ఎలా ఉన్నా.. భార్యలు తమ భర్తలను హత్య చేసేందుకు ఉపయోగిస్తున్న పద్ధతులు వారి క్రిమినల్ మెంటాలిటీని బట్టబయలు చేస్తున్నాయి. భర్తల హత్యల్లో అత్యధికంగా అంటే 40 శాతం విషప్రయోగం ద్వారా జరిగినవేనని అంచనా. అలాగే గొంతు నులమడం ద్వారా 25 శాతం, సుపారీ లేదా కాంట్రాక్ట్ కిల్లర్స్ ద్వారా 15 శాతం హత్యలు జరుగుతుండగా మిగిలిన వాటిని భార్యలే స్వయంగా నరికి ముక్కలు చేయడం వంటి కిరాతక పద్ధతుల ద్వారా జరుగుతన్నాయని విశ్లేషణల్లో వెల్లడైంది. ఈ తరహా కేసుల్లో 69 శాతం భార్యా, ప్రియుడు కలిసి చేసినవే.. అంటే అక్రమ సంబంధాల కారణంగా జరిగినవేనని తేలింది. ఇలాంటి కేసుల్లో మరణాలను ఆత్మహత్య లేదా ప్రమాదంగా చిత్రీకరించడం ద్వారా పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కూడా తక్కువేం కాదు. కాగా భర్తల ఆత్మహత్యలకు కారణాల గురించి ఆరా తీస్తే భార్యలు వారి తరఫువారు భర్త వేధిస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేయడం, బెదిరింపులకు పాల్పడటం, చట్టాలను ఆసరా చేసుకుని తప్పుడు సాక్ష్యాలతో వేధిస్తున్నారంటూ తప్పుడు కేసులు దాఖలు చేయడం వంటివి పురుషుల బలవన్మరణాలకు దారితీస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే భర్తల మరణాలపై చాలావరకు కేసులు వెలుగు చూడటం లేదు. ఎన్సీఆర్‌బీ రికార్డుల్లో భార్యల చేతిలో భర్త హతమయ్యారు అన్న కారణంతో జరిగే హత్యలను విడిగా చూపించరు. మరోవైపు చాలా కుటుంబాలు సిగ్గుతో, సమాజంలో పరువు పోతుందన్న భయంతో ఇలాంటి ఘటనలను బయటకు చెప్పకోవడానికి ఇష్టపడరు. కేసుల వరకు అసలు వెళ్లరు. ఈ పరిస్థితుల్లో ఏకం న్యాయ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలే ఈ లెక్కలకు, భర్తలపై జరుగుతున్న ఆఘాయిత్యాలకు ప్రధాన ఆధారాలుగా నిలుస్తున్నాయి. అయితే రికార్డుల్లో లేకపోయినా పోలీసువర్గాలు కూడా భర్తలపై అఘాయిత్యాలు పెరుగుతున్న విషయాన్ని అంగీకరిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page