ఈగల మందుతో విషప్రయోగం?
- BAGADI NARAYANARAO

- 2 days ago
- 2 min read
కేజీబీవీలో కలకలం
పాల దొంగతనాన్ని నిలదీసినందుకే కక్ష
పీఈటీ, వాచ్‌మెన్‌లకు టీలో కలిపి ఇచ్చిన తోటమాలి

(సత్యంన్యూస్, ఎచ్చెర్ల)
పొన్నాడ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో మంగళవారం ఘోర కలకలం రేగింది. పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ సన్యాసమ్మ, వాచ్‌మెన్ ఉషాలపై తోటమాలి విషప్రయోగానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈగలను నివారించడానికి వాడే రసాయన ద్రవాన్ని (లిక్విడ్) టీలో కలిపి ఇవ్వడం వల్లే ఇద్దరు ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
అసలేం జరిగిందంటే..?
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పొన్నాడ కేజీబీవీలో సోమవారం తోటమాలి పద్మ విద్యార్థుల కోసం ఉంచిన పాలను లీటరున్నర బాటిల్‌లో దొంగతనంగా నింపి, సంచిలో పెట్టుకుని వెళ్తుండగా పీఈటీ సన్యాసమ్మ గమనించారు. సంచిని చూపించాలని పీఈటీ కోరగా పద్మ నిరాకరించింది. దీంతో వాచ్‌మెన్ ఉషా సహకారంతో పీఈటీ బలవంతంగా సంచిని లాక్కుని, పాలను స్వాధీనం చేసుకుని ఎస్‌వో దృష్టికి తీసుకెళ్లారు. తమ దొంగతనాన్ని పట్టుకుని, అధికారులకు ఫిర్యాదు చేశారనే కక్షతో తోటమాలి పద్మ వీరిపై పగ పెంచుకున్నట్లు తెలుస్తోంది.
వ్యూహాత్మకంగా టీలో విషం..!
మంగళవారం ఉదయం విద్యార్థులకు రాగిజావ పంపిణీ పూర్తయిన తర్వాత, పాఠశాలలోని బోధనా సిబ్బంది అంతా టీ తాగేశారు. కేవలం పీఈటీ సన్యాసమ్మ, వాచ్‌మెన్ ఉషా మాత్రమే తాగాల్సి ఉంది. ఇదే అదనుగా భావించిన తోటమాలి పద్మ, వారికి వ్యూహాత్మకంగా టీ తెచ్చి ఇచ్చింది. అయితే, అప్పటికే ఆ టీలో ఈగలను నివారించే ప్రమాదకర లిక్విడ్‌ను కలిపినట్లు కేజీబీవీ సిబ్బంది అనుమానిస్తున్నారు. టీ తాగిన కొద్ది నిమిషాలకే వారిద్దరికీ తీవ్రస్థాయిలో వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. పీఈటీ సన్యాసమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా, వాచ్‌మెన్ ఉషా పరిస్థితి కూడా విషమించింది. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఎస్‌వో సమాచారం ఇచ్చారా, లేదా అన్నదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అపస్మారక స్థితిలో ఉన్న బాధితులను హుటాహుటిన పొన్నాడ పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు చికిత్స పొందిన అనంతరం, వారి కుటుంబ సభ్యులు వచ్చి ఇంటికి తీసుకెళ్లిపోయారు.
మరోవైపు, పీఈటీ తాగిన కప్పులో మిగిలిన టీ శాంపిల్‌ను శ్రీకాకుళం ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు పంపినట్లు ఎస్‌వో చెబుతుండగా.. తమకు ఎలాంటి శాంపిల్స్ రాలేదని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మి ‘సత్యం’కు స్పష్టం చేయడం గమనార్హం.

చేతులు కడగకుండానే టీ ఇచ్చా
ఈ విషప్రయోగంపై తోటమాలి పద్మను అధికారులు విచారించగా, తాను కావాలని ఎలాంటి లిక్విడ్ కలపలేదని చెప్పినట్లు తెలిసింది. పాఠశాల ప్రాంగణంలో ఈగల నియంత్రణ కోసం లిక్విడ్‌ను పిచికారీ చేసి వచ్చానని, ఆ తర్వాత చేతులు కడగకుండానే వారికి టీ తెచ్చి ఇచ్చానని, అంతకంటే తానేమీ తప్పు చేయలేదని అధికారులకు చెప్పినట్లు సమాచారం. అయితే, గతంలో హెడ్‌కుక్‌గా పనిచేసి, వ్యక్తిగత కారణాలతో తోటమాలిగా మారిన పద్మ.. పాత కక్షల వల్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటుందని తోటి సిబ్బంది బలంగా నమ్ముతున్నారు.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం: ఏపీసీ
ఈ వ్యవహారంపై బుధవారం సమగ్ర శిక్ష ఏపీసీని వివరణ కోరగా.. ఘటన జరిగిన సమయంలో తమకు సమాచారం లేదని, విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కేజీబీవీలో బోధన, బోధనేతర సిబ్బంది మధ్య ఎప్పటి నుంచో నడుస్తున్న కోల్డ్ వార్ కూడా ఈ విషప్రయోగానికి ఒక కారణమై ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కేజీబీవీని స్వయంగా పరిశీలించి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీసీ స్పష్టం చేశారు.






Comments