top of page

SBI అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 2 hours ago
  • 1 min read
కేసు నమోదు చేయాలని SP కి స్వప్నప్రియ తల్లి ఫిర్యాదు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గార శాఖలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేసిన తన కుమార్తె ఉరిటి స్వప్నప్రియ ఆత్మహత్యకు బ్యాంకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ, ఆమె తల్లి ఉరిటి సరళ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మహేశ్వర్‌రెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, క్రిమినల్ కుట్ర, బెదిరింపులకు సంబంధించిన ఆధారాలను ఎస్పీకి అందజేశారు. సంబంధిత అధికారులపై ఎఫఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 2023 నవంబరులో గార ఎస్‌బీఐ శాఖలో బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయిన ఘటనలో తన కుమార్తెను ఉద్దేశపూర్వకంగా నిందితురాలిగా చిత్రీకరించి, రీజినల్ మేనేజర్‌తో పాటు పలువురు అధికారులు నిరంతరం మానసికంగా వేధించారని పేర్కొన్నారు. శాఖలో నిర్వహించిన సమావేశాల్లో బహిరంగంగా అవమానించడం, పోలీసుల ద్వారా ఒత్తిడి తేవడం, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన స్వప్నప్రియ 2023 నవంబర్ 28న ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించినట్లు తెలిపారు. రీజినల్ మేనేజర్ టి.ఆర్.ఎమ్.రాజు, క్యాష్ ఆఫీసర్ ముంజి సురేష్, జాయింట్ కస్టోడియన్ జి.లోకనాథం, బ్రాంచ్ మేనేజర్ రాధాకృష్ణతో పాటు మరికొందరు అధికారులు ఈ ఘటనకు బాధ్యులని ఫిర్యాదులో ఆరోపించారు. డిపార్ట్‌మెంటల్ విచారణలో కొందరి ప్రమేయం బయటపడిందని, అయినప్పటికీ కేసు పురోగతి లేదని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని ఆత్మహత్యకు ప్రేరేపించడం, క్రిమినల్ కుట్ర, మోసం, ఫోర్జరీ, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని, విచారణ నివేదికను బహిర్గతం చేయాలని, అవసరమైతే సీబీఐ విచారణకు సిఫారసు చేయాలని సరళ తన ఫిర్యాదులో కోరారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page