కన్నతల్లి.. చేసింది ఘోరకలి!
- SATYAM DAILY
- 2 days ago
- 2 min read
నెలల పసికందు సహా ఇద్దరు బిడ్డల గొంతు కోసిన మహిళ
అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నం
ఉదయాన్నే వెదుళ్లవలసను వణికించిన ఈ భయానక ఘటన
కొన ఊపిరితో ఉన్న నిందితురాలు ఆస్పత్రికి తరలింపు
ఇంత దారుణానికి ఎందుకు తెగించిందో ఆ మహాతల్లి?
(సత్యంన్యూస్, ఆమదాలవలస)
కన్నపేగే కత్తిలా మారి ఘోరకలిని సృష్టించింది. పచ్చని పల్లెను గుండెలు పిండేసే విషాదంలో నింపేసింది. ఏం జరిగిందో తెలియదు గానీ.. ముక్కుపచ్చలారని నాలుగు నెలల పసికందును, బుడిబుడి నడకలతో ఇప్పుడిప్పుడే ఈ లోకాన్ని ఆస్వాదిస్తున్న మÖడేళ్ల చిన్నారిని గొంతు కోసి హతమార్చిన ఓ మహాతల్లి.. ఆ వెంటనే తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉదయం తెలతెలవారుతుండానే వెలుగుచూసిన ఈ ఘటనతో ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామం విలవిల్లాడిపోయింది. అప్పటికే బిడ్డలిద్దరూ మరణించగా కొనప్రాణంతో ఉన్న తల్లిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టడానికి కారణాలేమిటో కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే కుటుంబంలో ఎలాంటి కలహాలు, సమస్యలు లేవని చాలామంది చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాల సేకరణ ప్రారంభించిన వారికి కూడా ఇంతవరకు తగిన కారణాలు లభించలేదు. అయితే కుటుంబంలో బయటివారికి తెలియని స్పర్థలు, కలహాలు ఉన్నాయనుకున్నా తాను ఆత్మహత్యా యత్నానికి పాల్పడటమే కాకుండా.. ఏ పాపం తెలియని, సొంత పేగుబంధమైన ఇద్దరు కూతుళ్లను కడతేర్చడం ఏమిటన్న ఆగ్రహంతో కూడిన ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తలుపు తెరవగానే భీతావహ దృశ్యం
ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందిన కూర్మాపు రమణ వలస కూలీగా ఉంటూ తెలంగాణలోని వరంగల్‌లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కాగా అతని భార్య కూర్మాపు వరలక్ష్మి(30) తన అత్త లక్ష్మితో కలిసి గ్రామంలో నివసిస్తున్నది. రమణ, వరలక్ష్మి దంపతులకు భవానీ(3), చాందినీ (4 నెలలు) సంతానం. యథాప్రకారం సోమవారం రాత్రి వరలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి లోపల పడుకోగా, అత్త లక్ష్మి ఇంటి బయట వరండాలో పడుకుంది. అయితే మంగళవారం ఉదయం నిద్రలేచి ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లిన లక్ష్మి అక్కడి భీతావహ దృశ్యాన్ని చూసి భయకంపితురాలైంది. పీకలు తెగి రక్తపు మడుగులో ఉన్న పిల్లలను, కోడలిని చూసి భయంతో కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారందరూ చేరుకుని అక్కడి దృశ్యం చూసి బిత్తరపోయారు. అప్పటికే బిడ్డలిద్దరూ నిర్జీవులు కాగా.. వరలక్ష్మి మాత్రం కొనప్రాణంతో ఉందని గమనించి 108ను రప్పించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ సమాచారం అందుకున్న ఆమదాలవలస పోలీసులు గ్రామానికి చేరుకుని ఘటన జరిగిన ఇంటి పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఒకే ఇంట్లో ఇద్దరు పసిపిల్లలు శవాలుగా మారడం, తల్లి చావుబతుకుల్లో ఉండటంతో వెదుళ్లవలస గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
అంతుచిక్కని కారణాలు
వరలక్ష్మి ఇంత ఘాతుకానికి ఒడిగట్టడానికి కారణాలు ఏమై ఉంటాయన్న చర్చ జరుగుతున్నది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఆ కుటుంబంలో ఎలాంటి గొడవలు గానీ, ఆర్థికపరమైన వివాదాలు గానీ, ఇబ్బందులు గానీ లేవు. పోనీ బయటివారెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారేమో అనుకోవడానికి ఆ కుటుంబానికి ఎవరితోనూ గొడవలు కూడా లేవంటున్నారు. అయితే అత్త లక్ష్మితో వరలక్ష్మికి ఇబ్బందులు ఉన్నాయని, ఆమె వేధింపులే ఈ దారుణానికి కారణం కావచ్చన్న అనుమానాలు వినిపిస్తున్నా.. వాటిని ఎవరూ ధ్రువీకరించడం లేదు. ఈ పరిస్థితుల్లో వరలక్ష్మి మానసిక పరిస్థితి ఎలా ఉందన్న కోణాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మానసిక దౌర్భల్యం కారణంగా ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో హత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు కూడా ఉండటంతో ఆ దిశగా కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. డీఎస్పీ వివేకానంద కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించగా, ఆమదాలవలస ఎస్సై బాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.










Comments