దువ్వాడ అరెస్టుపై హైడ్రామా!
- SATYAM DAILY
- 2 hours ago
- 2 min read
స్టేషన్ ముందు బైఠాయించిన మాధురి
ఎటూ తేల్చలేకపోయిన పోలీసులు

(సత్యంన్యూస్, కొత్తూరు)
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను కొత్తూరు పోలీసులు అరెస్టు చేస్తారా? లేదా? అనే అంశం మీద సోమవారం సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఓ టీవీ చర్చా కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వంజరాపు సింహాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని సింహాచలం చేసిన ఫిర్యాదు ఆధారంగా మార్చి 8న కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం నెంబరు 21/2025 కింద కేసు నమోదైన తర్వాత దువ్వాడకు విచారణకు రమ్మని మూడు సార్లు నోటీసులిచ్చారు. ఇందులో భాగంగా సోమవారం దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీధర్ బాబాలతో కొత్తూరు స్టేషన్‌కు వెళ్లిన శ్రీనివాస్‌ను సీఐ ప్రసాదరావు విచారించారు. ఈలోగానే శ్రీనివాస్ సోదరుడు బాబా తన సోషల్ మీడియా అకౌంట్‌లో శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసినట్లు పోస్టింగ్ పెట్టారు. దీంతో దివ్వెల మాధురి పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. సీఐ ప్రసాద్ బయటకు వచ్చి దువ్వాడను విచారిస్తున్నామని, ఇంకా అరెస్ట్ చేయలేదంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా తాను ధర్నాకు దిగుతున్నట్లు ప్రకటించారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 353(2), 351(2)తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కూడా కేసును నమోదు చేశారు. వాస్తవానికి ఇవి ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లే. కాబట్టి అరెస్టయితే స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. 353(2) బీఎనఎస్ సెక్షన్ ప్రకారం ప్రసార మాధ్యమాల ద్వారా సమాజంలో ద్వేషాన్ని, పుకార్లను వ్యాప్తి చేయడం. దీనికి మూడుడేళ్ల వరకు జైలుశిక్ష. అయితే ఇది కొందరు బెయిలబుల్ అని, కొందరు నాన్‌బెయిలబుల్ అని చెబుతున్నారు. అలాగే బీఎన్‌ఎస్ సెక్షన్ 351(2) క్రిమినల్ బెదిరింపులకు పాల్పడటం. దీనికి రెండేళ్ల వరకు జైలుశిక్ష వర్తిస్తుంది. అయితే ఇందులో కూడా కొన్నిచోట్ల స్థానిక సవరణల మేరకు నాన్‌బెయిలబుల్‌గా పరిగణించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఐటీ చట్టం సెక్షన్ 67 ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో అశ్లీల, అభ్యంతరకర సమాచారాన్ని ప్రసారం చేయడం. ఇందులో మొదటిసారికి మూడేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. అయితే ఇది కూడా నాన్ బెయిలబుల్ అనే కొందరు న్యాయవాదులు చెబుతున్నారు. మొదటితప్ప్పు కాబట్టి కోర్టు బెయిలిస్తుందన్నవారూ ఉన్నారు. బీఎన్‌ఎస్, ఐటీ యాక్ట్‌లు రెండూ నాన్‌బెయిలబుల్ సెక్షన్లు కావడం వల్ల పోలీసులు స్టేషన్ బెయిలిచ్చే అవకాశం ఇచ్చే అవకాశం లేదంటుంటే, ఇంకొందరు స్టేషన్ బెయిల్ ఉంటుందంటున్నారు. ఏది ఏమైనా అరెస్టంటూ జరిగితే కోర్టులో బెయిల్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయన్నవారూ లేకపోలేదు. దువ్వాడ సోదరుడు బాబా కూడా న్యాయవాది కావడంతో ఈ సెక్షన్లపై హైకోర్టు న్యాయవాదుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతానికి దువ్వాడ శ్రీనును ఇంకా విచారిస్తున్నామని, అరెస్టు చేయలేదని సీఐ ప్రసాదరావు ‘సత్యం’కు తెలిపారు.






Comments