గిరిజన మహిళ హత్య!
- SATYAM DAILY
- Jun 11
- 1 min read
చెరువులో మృతదేహం లభ్యం
కాళ్లూచేతులు కట్టేసి ఉండటంతో అనుమానాలు

(సత్యంన్యూస్, పాలకొండ)
తమ కుటుంబ సభ్యురాలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారికి ఆమె మృతదేహం స్వాగతం పలికింది. పాలకొండ మండల తమరాడ గ్రామ సమీపంలోని చెరువులో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. కుటుంబ సభ్యులు గుర్తించడంతో మృతురాలు బిడ్డిక ఉషారాణిగా నిర్ధారణ అయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం.. పాలకొండ మండలం బర్న సీతంపేట గ్రామానికి చెందిన బిడ్డిక ఉషారాణి ఈ నెల ఆరో తేదీ నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. అప్పటినుంచీ ఆమె ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలు, తెలిసినవారి ఇళ్లలో వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఫిర్యాదు చేసేందుకు గురువారం ఉదయం పాలకొండ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అదే సమయంలో తుమరాడ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి కాళ్లూచేతులు కట్టేసిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని వెలికితీయడంతో పాటు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారికి చూపించగా, వారు దాన్ని గుర్తించి బిడ్డిక ఉషారాణిగా నిర్థారించారు. ఆమె వయసు 32 ఏళ్లు ఉండవచ్చని అంచనా. ఆమె గతంలో బర్న సీతంపేట గ్రామ వలంటీర్‌గా పని చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






Comments