మొన్న స్వప్న.. నిన్న శ్రీకర్
- NVS PRASAD

- 2 hours ago
- 3 min read
SBI అకౌంట్‌లో మరో డెత్ క్రెడిట్
ఇద్దరూ అప్పటి రీజనల్ మేనేజర్ TRM రాజు బాధితులే
A10గా చేర్చినా వెనకేసుకొస్తున్న ఎస్‌బీఐ
DSP రాసిన లేఖ బుట్టదాఖలు
స్వప్నప్రియ సూసైడ్ కేసులో వాంగ్మూలం మిస్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
విశాఖపట్నం మధురవాడ వద్ద ఉన్న మిథిలాపురి ఉడా కాలనీలో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న ఓ యువకుడు తొట్లకొండ సమీపంలో ఉన్న సముద్రంలో పడి మృతిచెందినట్లు విశాఖ పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం సముద్ర తీరానికి వెళ్లిన ఆయన చాలా సమయమైనా ఇంటికి రాకపోవడంతో తల్లి సత్యవతి ఫోన్ చేస్తే స్పందన రాలేదు. దీంతో తండ్రి సూరిబాబు పోలీసులకు సమాచారం అందించారు. ఒడ్డుకు వచ్చిన మృతదేహాన్ని ఆదివారం పోలీసులు కాళ్ల శ్రీకర్ (39)గా గుర్తించారు. క్రైమ్ సీన్ నుంచి ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే..
కాళ్ల శ్రీకర్ నరసన్నపేట ఎస్‌బీఐ బజార్ బ్రాంచ్‌కు మేనేజర్‌గా పని చేశారు. నకిలీ రుణాలు మంజూరు చేయడం వల్ల ఆయన్ను ప్రస్తుతం ఎస్‌బీఐ సస్పెన్షన్‌లో ఉంచింది. దీనికి తోడు ఆయన వివాహ జీవితం కూడా విడాకులైనట్టు విశాఖపట్నం ఎడిషన్‌లో కథనాలు వచ్చాయి. కట్ చేస్తే.. భార్యతో ఎప్ప్పుడో విడిపోయిన శ్రీకర్‌కు ప్రస్తుతం ఉన్న సమస్య ఎస్‌బీఐ నకిలీ రుణాల కుంభకోణమే. బజారు బ్రాంచిలో వివిధ వ్యక్తుల పేర్లతో స్మాల్, మీడియం రుణాలు మంజూరయ్యాయని, వాటిని లబ్ధిదారుల పేరుతో బ్యాంకు సిబ్బందే సొంతానికి వాడుకున్నారని, వీలున్నప్ప్పుడల్లా ఈఎంఐలు చెల్లిస్తున్నారంటూ ‘సత్యం’ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన విషయం పాఠకులకు విదితమే. ఆ తర్వాత శ్రీకర్ బ్యాంకుకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పరారయ్యారు. అదే సమయంలో అసలు ఈ రుణాలన్నీ మంజూరు చేయించింది అప్పటి రీజనల్ మేనేజర్‌గా వ్యవహరించిన TRM రాజేనని, రీజనల్ మేనేజర్ సంతకం లేకుండా ఒక్క రుణం కూడా మంజూరు కావడం కుదిరే పని కాదంటూ శ్రీకర్ బ్యాంకు వర్గాలను ఉద్దేశించి ఒక లేఖ రాశారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది, ఇది సంచలనమైంది కూడా. ఆ తర్వాత బజారు బ్రాంచికి సంబంధించి ఆడిటింగ్ కోసం ఆమదాలవలసలో సీనియర్ మేనేజర్‌గా పని చేస్తున్న అధికారిని బ్యాంకు పంపింది. అయితే ఇక్కడ లెక్కాపత్రం లేని వ్యవహారాలు అనేకం ఉన్నాయని, తనవల్ల కావడంలేదని శ్రీకర్‌కు ముందు కూడా ఏం జరిగిందో తెలియడంలేదంటూ సీనియర్ మేనేజర్ బ్యాంకుకు సమాచారం ఇవ్వడంతో డైరెక్ట్‌గా ఈ కేసును సీఐడీకి అప్పగించారు. అప్పట్నుంచి ఈ కేసు జీడిపాకంలా సాగుతోంది. శ్రీకర్ మీద సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇటువంటి సమయంలో శ్రీకర్ సముద్రం ఒడ్డున విగతజీవిగా కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈయన ఆత్మహత్య చేసుకున్నారా? లేదూ అంటే రోజూ ఆ స్పాట్‌కు వెళ్లే శ్రీకర్ మూమెంట్‌ను తెలుసుకొని ఎవరైనా నీటిలో తోసేశారా? అనేది తేలాల్సివుంది. ఈ కేసు నుంచి శ్రీకర్ బయటపడాలంటే బినామీ పేర్లతో మంజూరు చేసిన రుణాల వాయిదాలు రూ.65 లక్షల వరకు రీజనల్ మేనేజర్ టీఆరఎం రాజు శ్రీకర్‌తో కట్టించారని వినికిడి. అయినా ఆయన్ను సస్పెండ్ కాకుండా TRM రాజు కాపాడలేకపోయారని బ్యాంకు వర్గాల్లో చర్చ నడిచింది. గ్యారెంటీ కింద ఎటువంటి ఆస్తులూ పెట్టకుండానే రూ.10 లక్షల రుణాలు ఇచ్చే అధికారం బ్రాంచి మేనేజర్‌కు ఉంది. అయితే కోట్లలో రుణం ఇవ్వాలంటే ఆ మేరకు ఏదో ఒక ఆస్తి గ్యారెంటీ పెట్టాలి. ఇవన్నీ రీజనల్ మేనేజర్‌కు తెలియకుండా జరిగే ప్రసక్తే ఉండదు.
సరిగ్గా మూడేళ్ల క్రితం గార ఎస్‌బీఐలో తాకట్టు పెట్టిన నగలు మాయమైన కేసులో కూడా టీఆరఎం రాజు అప్పటి చెస్ట్ కస్టోడియన్‌లో ఒకరైన స్వప్నప్రియ మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. వాస్తవానికి లాకర్‌లో ఉన్న ఒక నగ తీయాలంటే ఇద్దరు కస్టోడియన్ల వద్ద ఉన్న రెండు తాళాలు పెట్టి ఓపెన్ చేస్తే గాని నగలు బయటకు రావు. కానీ అప్పటి ఆరఎం TRM రాజు ఒక్క స్వప్నప్రియ మీదే ఫిర్యాదు చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. అదే సమయంలో రెండో కస్టోడియన్ ముంజి సురేష్‌ను తప్పిస్తూ ఆయన మీద స్వప్నప్రియ మనుషులు దాడి చేయించారంటూ ఓ కథను అల్లారు. ఒకవైపు మాయమైన తాకట్టు నగలు కేసు తన మీద పెట్టడం, మరోవైపు మరో తాళంచెవి ఉన్న ముంజి సురేష్‌పై తాను దాడి చేయించానని ప్రచారం చేయించడంతో స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకుంది. ప్రాణం పోయిన తర్వాత తీరిగ్గా అసలు ముంజి సురేష్ మీద దాడే జరగలేదని, అదంతా కట్టుకథని పోలీసులు తేల్చేశారు. తాజాగా డీఎస్పీ వివేకానంద కూడా RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అంటే.. ఇదంతా అప్పటి రీజనల్ మేనేజర్ TRM రాజు కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అదే సమయంలో కేసు విచారణ ముందుకు వెళ్తున్నకొద్దీ స్వప్నప్రియ కుటుంబ సభ్యులకు కొత్త విషయాలు తెలుస్తుండటంతో తాజాగా ఎస్పీ మహేశ్వర్‌రెడ్డిని కలిసి స్వప్నప్రియ తల్లి తన కూతురి ఆత్మహత్యకు TRM రాజే కారణమంటూ ఫిర్యాదు ఇచ్చారు. అదే సమయంలో ముఖ్యమంత్రి గ్రీవెన్స్‌కు ఒక ఫిర్యాదిచ్చారు. దీని మీద అప్పటి రీజనల్ మేనేజర్ రాజును A10గా చేర్చారు. వాస్తవానికి గార కుంభకోణం కూడా రాజు కనుసన్నల్లోనే జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏడాదికి పైగా నగలన్నీ ప్రైవేటు బ్యాంకుల్లోకి పద్దుకు వెళితే.. గార బ్రాంచికి ఆడిట్‌కు వచ్చిన అధికారులు మాత్రం లాకర్‌లో నగలన్నీ పదిలమనే రిపోర్టు ఇవ్వడం ఇందుకు ఓ ఉదాహరణ.
రీజనల్ మేనేజర్‌గా ఉన్న రాజు ఒక బ్రాంచిలో బంగారం కనిపించడం లేదంటే ముందుగా ఫిర్యాదు చేయాల్సింది బ్రాంచి మేనేజర్ మీద. ఆ తర్వాత చెస్ట్ కస్టోడియన్ల మీద. అలా కాకుండా ఒక్క స్వప్నప్రియ మీదే ఫిర్యాదు చేయడం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అప్పటి పోలీసులను మేనేజ్ చేసిన రాజు ఆయన ఫిర్యాదు మేరకే కేసు కట్టేలా చూసుకున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన స్వప్నప్రియ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్ప్పుడు అప్పటి పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఇప్ప్పుడు స్వప్నప్రియ స్టేట్‌మెంట్ పోలీసు రికార్డుల్లో కనిపించడం లేదు. ఇది ఆరోపణ కాదు.. సమాచార హక్కు చట్టం మేరకు అడిగిన ఒక ప్రశ్నకు స్వయంగా పోలీసులే ఇచ్చిన సమాధానం. ఇన్ని తప్ప్పులను పద్ధతిగా చేసుకువెళ్లిపోయినా TRM రాజు మీద చర్యలు తీసుకోడానికి బ్యాంకు ఇంతవరకు ముందుకు రాలేదు. స్వయంగా డీఎస్పీనే ఇందులో అప్పటి రీజనల్ మేనేజర్ TRM రాజు పాత్ర ఉందని, ఆయన మీద బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ బ్యాంకు విజిలెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు లేఖ రాస్తే, దాన్ని సంబంధిత అధికారి వరకు చేరనీయకుండా మధ్యలోనే మాయం చేశారు. శ్రీకాకుళం గార బ్రాంచిలో జరిగిన వ్యవహారం ఇప్పటికీ ముంబయిలో ఉన్న ఎస్‌బీఐ కార్పొరేట్ ఆఫీసుకు తెలియదు. TRM రాజును సర్కిల్ స్థాయిలోనే కొందరు కాపాడేస్తున్నారు. ఇప్ప్పుడు తాజాగా శ్రీకర్ అనుమానాస్పద మృతితోనైనా శ్రీకాకుళం రీజియన్‌లో ఎస్‌బీఐ రాజు హయాంలో ఎన్ని పాపాలు మూటకట్టుకుందో తెలిసొస్తుందేమో చూడాలి.






Comments