కర్మ రిటర్న్స్ అంటే ఇదేనేమో! అతీక్ నేరసామ్రాజ్యం అంతం
- DV RAMANA

- 4 hours ago
- 3 min read
ఆ కుటుంబం ఆధీనంలో పెద్ద నేర సామ్రాజ్యం
ప్రయాగ్‌రాజ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో వారంటే హడల్
హత్యలు, దాడులు, కిడ్నాప్‌లు సహా వందలాది కేసులు
ఆ నేరాలే వారి పతనానికి దారులు వేశాయి
తండ్రి హతం, తల్లి పరార్, ఇద్దరు కుమారులు మృతి, మరో ఇద్దరు కటకటాల వెనుక
ఒంటరిగా మిగిలిన చిన్న కుమారుడు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తుంటాయి. ఒకే దుర్ఘటనలో మరణాలు ఎక్కువగా సంభవించే వాటి గురించి సమాచార మాధ్యమాల్లో పెద్దగా వార్తలు వస్తుంటాయి.. ప్రజలు కూడా చర్చించుకుంటుంటారు. ఒకరిద్దరిని బలిగొన్న ప్రమాదాల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజుల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గూగుల్ సెర్చింగ్ ట్రెండింగ్ అంశంగా నిలిచింది. దీనికి కారణం.. మృతుల్లో ఒక యువకుడి కుటుంబ నేపథ్యమే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ నగర సమీపంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న నలుగురిలో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరిలో ఒకడైన అబాన్ అహ్మద్(21) నేపథ్యమే ఈ ఘటనకు ప్రాముఖ్యతను ఆపాదించింది. అబాన్ అహ్మద్ కుటుంబం సామాన్యమైనది కాదు. ఈ కుటుంబం మొత్తానిది పెద్ద క్రిమినల్ చరిత్రే. హత్యలు, హత్యాయత్నాలు, బెదిరింపులు, కిడ్నాప్‌లు వంటి తీవ్రమైన నేరాలతో నిండిన రక్తచరిత్రే. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్(నేటి ప్రయాగ్‌రాజ్), ఝాన్సీ, పూల్‌పూర్ తదితర ప్రాంతాల్లో ఈ కుటుంబం పేరెత్తితేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి ఉండేది. వందలాది కేసులు ఉన్న ఈ కుటుంబ పెద్ద అతీక్ అహ్మద్ పేరుమోసిన డాన్‌గానే కాకుండా రాజకీయాల్లోనూ ఒకప్పుడు పెత్తనం సాగించాడు. కానీ అన్నీ రోజులు ఒక్కలా ఉండవు. కాలం మారకతప్పదు. పాపం పండకా తప్పదు. దాన్నే కర్మ రిటర్న్స్ అంటారు. అతీక్ అహ్మద్ కుటుంబం విషయంలోనూ అదే జరిగింది. కొన్నేళ్లపాటు తన నేర సామ్రాజ్యం ద్వారా ప్రజాజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేసి పెత్తనం సాగించిన అతీక్ కుటుంబం మÖడేళ్లలోనే నామరూపాల్లేకుండా పోయింది. మనం ఏది చేస్తే.. భవిష్యత్తులో మనకు అదే ప్రాప్తిస్తుందన్నట్లు ఈ నేర కుటుంబ పెద్ద అతీక్ అహ్మద్ సుమారు మÖడేళ్ల క్రితమే గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురికాగా.. అతని భార్య కేసుల భయంతో అప్పటినుంచీ పరారీలోనే ఉంది. ఇక ఐదుగురు కుమారుల్లో ఇద్దరు ఇప్పటికే మరణించగా, మరో ఇద్దరు జైళ్లలో ఉన్నారు. చివరికి చిన్న కుమారుడు మాత్రమే బయట ఉన్నాడు.
రౌడీయిజం, రాజకీయం
ఈ నొటోరియస్ కుటుంబ పెద్ద అయిన అతీక్ అహ్మద్ ప్రయాగ్‌రాజ్‌లో ఒక గుర్రపు బగ్గీ నడిపే వ్యక్తి కుమారుడు. పేద కుటుంబం కావడంతో డబ్బు సంపాదన కోసం అతీక్ నేరాల వైపు మళ్లాడు. తొలినాళ్లలో రైళ్లలో బొగ్గు చోరీ చేసి అమ్ముకునేవాడు. ఆ తర్వాత రైల్వే కాంట్రాక్టర్లను బెదిరించి టెండర్లు దక్కించుకోవడం ప్రారంభించాడు. ప్రయాగ్‌రాజ్‌లో 1979లో జరిగిన ఒక హత్య కేసు ద్వారా తొలిసారి అతీక్ అహ్మద్ పేరు క్రైమ్ రికార్డుల్లోకి ఎక్కింది. అప్పటినుంచి అతగాడి నేరసామ్రాజ్యం శరవేగంగా విస్తరించింది. ఆయన కుటంబం మొత్తం అందులో భాగస్వాములుగా ఉండేవారు. హత్యలు, హత్యాయత్నాలు, బెదిరింపులు సహా ఒక్క అతీక్‌పైనే 160కిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేర నేపథ్యం ఆధారంగానే అతీక్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1989లో తొలిసారి ఆయన అలహాబాద్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అక్కడినుంచి వరుసగా 2002 వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అతీక్ 2004, 2009, 2014, 2018, 2019 ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసినా 2004 మాత్రమే విజయం సాధించారు. సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, అప్నాదళ్(కే) పార్టీý తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు.
రాజుపాల్ హత్యతో పతనం ప్రారంభం
అతీక్ అహ్మద్ పతనం ఆయన రాజకీయ ప్రత్యర్థి అయిన రాజుపాల్ హత్యతోనే మొదలైందని అంటారు. ఐదుసార్లు అలహాబాద్ వెస్ట్ ఎమ్మెల్యేగా కొనసాగిన అతీక్ అహ్మద్ 2004లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికవ్వడంతో ఎమ్మెల్యే పదవిని వదులుకున్నాడు. దాంతో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అతీక్ సోదరుడు ఖలీద్ అజీమ్‌ను నిలబెట్టినప్పటికీ.. బీఎస్పీ అభ్యర్థి రాజుపాల్ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2005లో జరిగిన కాల్పుల్లో ఆయన చనిపోయారు. ఈ కేసులో అతీక్‌నే ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చినా.. అదే హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్‌పాల్‌ను కూడా కిడ్నాప్ చేసి హత్య చేశారన్న ఆరోపణలతో మళ్లీ అరెస్టయిన అతీక్ అహ్మద్‌ను 2023 ఏప్రిల్ 15న కోర్టుకు తరలించేముందు వైద్యపరీక్షల కోసం అహ్మద్ ను, అతని సోదరుడిని పోలీసు వ్యానులో తీసుకెళ్తుండగా గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు మీడియా ప్రతినిధులు రూపంలో వచ్చి జరిపిన కాల్పుల్లో అతీక్ అహ్మద్ హతమయ్యాడు.
అతీక్ పెద్ద కుమారుడు అసద్ అహ్మద్ 2023లో పోలీసు ఎదురుకాల్పుల ఘటనలో మరణించాడు.
రెండో కుమారుడు అలీఅహ్మద్ పది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటుండగా.. కొన్నింటిలో శిక్ష అనుభవిస్తూ ప్రస్తుతం ఝాన్సీ జైలులో ఉన్నాడు.
మూడో కుమారుడు ఉమర్ అహ్మద్ కూడా 11 క్రిమినల్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉండగా, కొన్నింటిలో నేరం నిర్థారణ కావడంతో లక్నో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
ఇక నాలుగో కుమారుడు అబాన్ అహ్మద్ తాజాగా జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఝాన్సీ జైలులో ఉన్న తన అన్నను కలిసేందుకు వెళ్తుండగానే కారు అదుపుతప్పి బోల్తాపడటంతో అబాన్ చనిపోయాడు.
కాగా అతీక్ తర్వాత ఆ కుటుంబ పెద్దదిక్కుగా ఉండాల్సిన అతని భార్య పర్వీన్.. ఉమేష్‌పాల్ హత్య కేసులో అరెస్టు చేస్తారన్న భయంతో అప్పటినుంచీ పరారీలో ఉన్నారు. ఇప్పటివరకు ఆమె ఆచూకీ లభించలేదు. ఆమెను పట్టించేవారికి పోలీసులు రూ.50 వేల రివార్డు ప్రకటించారు.
దాంతో ఆ కుటంబంలో చివరి కుమారుడు ఆజం అహ్మద్ మాత్రమే మిగిలాడు. ప్రస్తుతం చదువుకుంటున్న ఈ కుర్రాడు ఎవరూ లేని ఒంటరి అయ్యాడు. ఎంతో పెద్ద కుటుంబం.. ఒకప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలను గడగడలాడించి పెత్తనం సాగించిన కుటుంబం ఇప్పుడు కర్మఫలం కారణంగా ఛిన్నాభిన్నమైపోయింది.






Comments