అతడు.. ఆమె.. ఓ భార్య!
- SATYAM DAILY
- 1 day ago
- 2 min read
సహజీవన కాంక్షతో ప్రేయసితో పరారైన భర్త
కోయంబత్తూరో నెల రోజులుగా కాపురం
వారిద్దరికీ నచ్చజెప్పి వెనక్కి తీసుకొచ్చేందుకు భార్య యత్నం
మార్గమధ్యంలో రైలు బాత్రూంలోనే ప్రేయసీప్రియుల ఆఘాయిత్యం
చావుబతుకుల మధ్య సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స
ఇద్దరూ వివాహితులే కావడంతో.. రెండు కుటుంబాల్లో విషాదం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఇద్దరికీ వేర్వేరుగా వివాహాలు జరిగాయి.. సొంత సంసారాలు ఉన్నాయి. కానీ వివాహేతర సంబంధం, సహజీవన కాంక్ష వారిని ఆనందమయమైన వైవాహిక జీవితాన్ని, కుటుంబాన్ని కాలదన్ని ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించింది. రైలులో ఈ ఘటన జరగ్గా.. బలవన్మరణానికి ప్రయత్నించిన ఇద్దరూ ప్రస్తుతం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన నేపథ్యం కూడా కాస్త చిత్రంగానే ఉంది. పారిపోయిన తన భర్త, అతగాడి ప్రేయసిని స్వయంగా అతని భార్యే ఒప్పించి తీసుకువస్తుండటం, విడిపోవాల్సి వస్తుందనో.. ఇంకేదో ఆలోచనతోనో వారిద్దరూ రైల్లోనే విషం తాగి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం వారి స్వగ్రామమైన చాపరలో కలకలం సృష్టించింది. సికింద్రాబాద్ జీఆర్పీ(జనరల్ రైల్వే పోలీస్) ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వరగౌడ్‌తోపాటు చాపర గ్రామస్తుల వివరాలు ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన శ్రీరామ్ శిరీష్‌కుమార్ అలియాస్ సతీష్ (34) వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. అతనికి సులోచన అనే యువతితో కొన్నేళ్ల క్రితమై వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చక్కాగా సాగుతున్న ఆ సంసారంలో అక్రమ సంబంధం నిప్పులు కురిపించింది. శిరీష్‌కు తమ గ్రామానికే చెందిన వివాహిత(34)తో పరిచయం ఏర్పడింది. తన భర్త అనారోగ్యం కారణంగా ఆ వివాహిత తన ఇద్దరు పిల్లలను తీసుకుని హైదరాబాద్ వెళ్లి మÖసాపేటలో ఉంటున్న తన సోదరి ఇంట్లో కొన్నాళ్లుగా నివాసం ఉంటున్నది. ఆ ఎడబాటును సహించలేని శిరీష్‌కుమార్ తరచూ హైదరాబాద్‌కు వెళ్లి ఆమెతో గడిపి వచ్చేవాడు.
అక్కడి నుంచి ఇద్దరూ పరార్
అదేవిధంగా నెలరోజుల క్రితం శిరీష్‌కుమార్ ప్రేయసిని కలుసుకునేందుకు మÖసాపేటకు వెళ్లాడు. అక్కడినుంచి వారిద్దరూ అదృశ్యమయ్యారు. అప్పటినుంచీ భార్య సులోచన, ఆమె కుటుంబ సభ్యులు వారికోసం గాలిస్తున్నారు. అయితే వారిద్దరూ తమిళనాడులోని కోయంబత్తూరు ఉన్నట్లు తెలుసుకున్న సులోచన కొందరు బంధువులను తీసుకుని అక్కడికి వెళ్లారు. ఆచూకీ తెలుసుకుని కలుసుకున్నారు. సులోచన భర్తకు నచ్చజెప్పి అతన్ని ప్రియురాలితో సహా తీసుకుని సోమవారం మధ్యాహ్నం శబరి ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో హైదరాబాద్‌కు బయల్దేరింది. అంతా సర్దుకుంటుందని అనుకుంటున్న సమయంలో జరగరానిది జరిగింది. రైలు చర్లపల్లి స్టేషన్‌కు సమీపిస్తున్న తరుణంలోనే మంగళవారం ఉదయం 11`12 గంటల మధ్య శిరీష్, అతని ప్రియురాలు అందరి కళ్లుగప్పి ఒకేసారి రైలులోని బాత్రూమ్‌లోకి వెళ్లి గడ్డిమందు తాగేశారు. ఇంటికి వెళ్తే తమను విడదీస్తారని భయపడ్డారో.. విడిగా జీవించలేమని అనుకున్నారో ఏమో గానీ.. బలవన్మరణానికి ప్రయత్నించారు. చాలాసేపైనా వారు బయటకు రాకపోవడంతో తోటి ప్రయాణికుల సాయంతో సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు సులోచన సమాచారం అందజేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు బాత్రూమ్ తలుపులను బలవంతంగా తెరవగా ఇద్దరూ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, అత్యవసర చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.






Comments