మాకంటే ఎవడు తోపు.. దమ్ముంటే ఆపు!
- BAGADI NARAYANARAO

- Sep 19, 2024
- 3 min read
ఎమ్మెల్యేకే సవాల్ విసురుతున్న ఆ నలుగురు
గతంలో వారించినా ఆగని దందా
మైన్స్, రెవెన్యూ అధికారులను కొనేసిన వైనం
టీడీపీలో ఇసుక దుమారం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

‘‘శ్రీకాకుళం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నప్పుడు ఎవరూ ఆయన వెనుక లేకపోయినా నేనొక్కడ్నే ఉన్నాను. ఇప్పుడు ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇసుక ఎత్తుకుంటే వచ్చిన అభ్యంతరమేమిటి? ఆయన చెప్పినంత మాత్రాన ఆపేస్తామా?..’’ ఇది స్వయంగా ఎమ్మెల్యే స్వగ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడి వాదన.
‘‘శ్రీకాకుళం టిక్కెట్ గుండ లక్ష్మీదేవికి ఇవ్వకపోయినా పార్టీ సింబల్ శంకర్‌తో ఉంది కాబట్టి నేను ఆయన గెలుపు కోసం పని చేశాను. ఇప్పుడు నా పంచాయతీ పరిధిలో ఉన్న ఇసుకను అమ్ముకుంటే ఆయనకొచ్చిన నొప్పేంటి? ఆయన చెప్పినంత మాత్రాన ఆగిపోతే మరి మేమెందుకు రాజకీయాలు చేయడం?’’.. ఇది బూరవిల్లిలో మరో టీడీపీ నాయకుడి భావన.
పోనీ గొండు శంకర్‌తో మొదట్నుంచి ఉన్నానని చెబుతున్న వ్యక్తికి ఈ నియోజకవర్గంలో, లేదూ అంటే ఆయన సొంత గ్రామం కిష్టప్పేటలో శంకర్ కంటే బలముందా అంటే అదీ లేదు. పోనీ శంకర్ గెలుపు కోసం ఆయన ఆస్తులు కరగదీసుకున్నారా అంటే ఆవైపే ఆలోచించక్కర్లేదు. కానీ కాసులు కురిపిస్తున్న ఇసుక విషయంలో మాత్రం ఆయన ఎమ్మెల్యేని లెక్క చేయడంలేదు. ఇక బూరవిల్లిలో ఉన్న టీడీపీ నాయకుడు సర్పంచ్‌గా గెలవగలడా? అంటే.. కష్టమనే మాట గతంలో జరిగిన అనేక ఎన్నికలు రుజువు చేశాయి. గుండ కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా మూడో కంటికి తెలియకుండా ఇసుకను తరలించుకుపోయిన వీరు ఇప్పుడు ఇసుక అక్రమ రవాణాకు తాను వ్యతిరేకమని శంకర్ ప్రకటిస్తే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గెలిచినా, ఓడినా శంకరే కాబట్టి తమ పని మాత్రం ఆపే ప్రసక్తి లేదనే సంకేతాలు ఇస్తున్నారు. శంకర్ కాదన్నా తాము చేసుకుపోతామని, ఎందుకంటే రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడి సోదరుడికి ఇందులో ఒకరు దగ్గరి బంధువు. కాబట్టి శంకర్ ఒకటి రెండు సార్లు చెప్పి ఊరుకుంటారని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ కొద్ది రోజుల క్రితం ‘శంకరా.. నిన్ను చల్లగా ముంచేస్తున్నారబ్బాయా’ అనే శీర్షికతో ‘సత్యం’ కథనం ప్రచురించిన తర్వాత అచ్చెన్నాయుడు ఈ విషయం మీద ఆరా తీసి ఆధారాలు తన వద్ద పెట్టుకున్నారు. రాష్ట్రంలో వరదల కారణంగా బిజీ అయిపోయిన అచ్చెన్నాయుడు ఇంకా ఇటువైపు దృష్టి సారించకపోవడంతో తాము చేసే పనులకు మంత్రి కుటుంబం వైపు నుంచి అండదండలున్నాయని వీరికి వీరే సర్టిఫికెట్ ఇచ్చుకొని ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు.
అవసరమైన క్వాంటిటీ ఎప్పుడో తరలించేశారు
శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం ఒక్క భైరి ర్యాంపునే గుర్తించింది. అది కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇంకా ప్రారంభం కాలేదు. కానీ గార మండలం బూరవిల్లితో పాటు మరికొన్ని చోట్ల టీడీపీ నాయకులు చల్లా వాసు, మల్లా అబ్బాయినాయుడులు ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైల్వే నిర్మాణాలకు ఇసుక ఇవ్వాలన్నా ఒక ఆర్డర్‌ను పట్టుకొని ఇప్పటికీ నదుల్లో దిగి తవ్వుకుపోతున్నారు. వీరికి అవసరమైన క్వాంటిటీ ఎప్పుడో తరలించేశారని ‘సత్యం’ కథనం ప్రచురించిన రోజు రాత్రే ఎమ్మెల్యే వీరిద్దర్నీ పిలిచి తన కార్యాలయంలో ఇక చాలు ఆపేయండి అంటూ చెప్పారు. అక్కడికి మూడు రోజులు సైలెంట్ అయిపోయి ఆ తర్వాత మళ్లీ ఇసుక తవ్వుకోవడం మొదలుపెట్టారట. తన నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని ఎమ్మెల్యే ఇచ్చిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం మూడురోజులు కాపు కాసి చిలకపాలెం పాపారావుకు చెందిన జేసీబీని రెండుసార్లు, భైరికి చెందిన దొండపాటి ఈశ్వరరావు, మల్లా ఈశ్వరరావు తెప్పించిన లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో రెండు రోజుల పాటు ఇసుక అక్రమ రవాణాను నిలిపేసిన చల్లా వాసు, అబ్బాయినాయుడు రెండు రోజుల నుంచి మళ్లీ అక్రమంగా ఇసుకను తవ్వి లారీల్లో విశాఖకు తరలించడం ప్రారంభించారని తెలుస్తుంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు సింగుపురం అడ్డురోడ్, భైరి, కరజాడ అండర్ పాసేజ్ వద్ద ఉంటున్న రెవెన్యూ, పోలీస్‌లను మేనేజ్ చేసి ఇసుకను లారీల్లో సరిహద్దులు దాటిస్తున్నారట. శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలో భైరి, గార మండలం బూరవల్లి నుంచి ఇసుకను విశాఖకు తరలించడం వెనుక గనులశాఖ అధికారుల జోక్యం ఉందని విశ్వసనీయ సమాచారం. టీడీపీ నాయకులుగా చలామణి అవుతున్న చల్లా వాసు, మల్లా అబ్బాయి నాయుడు రైల్వే ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ కోసం జిల్లాలో పూండి, నౌపడ, కోటబొమ్మాళి, తిలారు, దూసి, పొందూరు రైల్వేస్టేషన్లలో భవనాల నిర్మాణం కోసం కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్‌ను చూపించి నదుల్లో తవ్వేస్తూ, లారీల్లో ఇసుకను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు.
రూ.50వేలకు ఇసుక రీచ్ వద్ద విక్రయిస్తున్నారు
శాంతి కన్‌స్ట్రక్షన్ పేరుతో కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్‌ను చల్లా వాసు, అబ్బాయినాయుడు సొంతానికి వినియోగిస్తున్నారు. కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్‌లో గార మండలం అంబళ్లవలస నుంచి 457 మెట్రిక్ టన్నులు, బూరవల్లి నుంచి 43 మెట్రిక్ టన్నులు మొత్తం 500 మెట్రిక్ టన్నులకు మాత్రమే అనుమతిచ్చారు. దీన్ని చల్లా వాసు, అబ్బాయినాయుడు సొంతం కోసం వినియోగించుకొని ఒక్కో లారీని రూ.50వేలకు ఇసుక రీచ్ వద్ద విక్రయిస్తున్నారు. జిల్లాలోని పొందూరు, పలాస, పూండి తదితర ప్రాంతాల పేరుతో 20 టన్నుల లారీకి రూ.6,800కు బిల్లు ఇస్తున్నారు. జాతీయ రహదారిపైకి వచ్చిన తర్వాత ఎక్కడైనా పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకుంటే శాంతి కన్‌స్ట్రక్షన్ పేరుతో కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్‌ను కొన్ని సార్లు, ఒడిశా నుంచి లోడ్ చేయించి తెస్తున్నట్టు బిల్లులు చూపించి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
విశాఖ నుంచి ఆర్డర్స్
భైరిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా చేస్తున్న వారంతా మూడు గ్రూపులుగా విడిపోయారు. టీడీపీలో శంకర్, గుండ లక్ష్మీదేవి వర్గాలు ఉండగా వైకాపా ఒక వర్గంగా మారింది. మొత్తం మూడు వర్గాల్లో రెండు వర్గాలుగా మారిన టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. వైకాపా వర్గం అవకాశం కోసం ఎదురుచూస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వంలో పెద్దల పేరు చెప్పి దొండపాటి ఈశ్వరరావు, మల్లా ఈశ్వరరావు కలిసి భైరిలో ఇసుక అక్రమరవాణాకు తెరలేపారు. దీనిపై గ్రామస్తులు కొందరు ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు అడ్డుకొని లారీలను అక్కడి నుంచి పంపించేశారు. అనుమతులు లేకుంగా ఇసుక తరలించడం కోసం విశాఖ నుంచి లారీలు రోడ్డుపై బారులు తీరి ఉన్నా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ప్రశ్నించడం లేదు.
రగిలిపోతున్న టీడీపీ కేడర్
గార, శ్రీకాకుళం మండంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నది ఈ నలుగురేనని టీడీపీలో చర్చ సాగుతుంది. ఎమ్మెల్యే వారించినా లెక్క చేయకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేయిస్తుండడంపై టీడీపీ మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరికి మాత్రమే ఇసుక తవ్వకాలు, రవాణాకు అవకాశం ఇచ్చి మిగతావారి చేతులు కట్టేశారని రగిలిపోతున్నారు. ఇసుక అక్రమ రవాణా చేయకుండా అడ్డుకోవాల్సిన రెవెన్యూ సిబ్బందిని చల్లా వాసు, అబ్బాయినాయుడు మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మూడు సిప్ట్‌లలో విధుల్లో ఉండాల్సిన రెవెన్యూ సిబ్బంది కేవలం రెండు సిప్ట్‌లకే పరిమితమయ్యారు. ఇసుకను అక్రమంగా తరలించేవారు, ఇసుకను తరలించకుండా అడ్డుకుంటున్నవారు అందరూ స్థానికులే కావడం విశేషం.










Comments