top of page

కాపాడబోయి.. కాటుకు గురయ్యారు!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 2 hours ago
  • 3 min read
  • బాధ్యుల్ని సస్పెండ్ చేయాలన్న సీఎస్

  • పరిస్థితి అదుపులో ఉందన్న కూర్మారావు

  • బుధవారం కేసులు పెరగడంతో కమిషనర్‌కు ఎసరు

  • కాళ్లకు చక్రాలు కట్టుకు తిరుగుతున్న ఎమ్మెల్యే


(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జెట్ వేగంతో స్పందించారు.. కానీ వ్యాధి కూడా సూపర్‌సోనిక్ యుద్ధ విమానంలా విస్తరించేసింది. ‘సత్యం’లో సాయంత్రం 4 గంటలకు డయేరియా కథనం ఫ్లాష్ అయితే 5 గంటల లోపు కలెక్టర్ శిమ్మన్న ఆసుపత్రిలో ఉన్నారు. కమిషనర్ హనుమంతు కూర్మారావు కూడా అక్కడికే వచ్చారు. అయినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. శాసనసభ సమావేశాలకు వెళ్లిన ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం సభ ముగిసిన తర్వాత శ్రీకాకుళం రావాల్సివుండగా, మధ్యలోనే హుటాహుటిన మంగళవారమే బయల్దేరి వచ్చారు. అప్పటికే డయేరియా ఉధతమైపోయింది. దీనికి కలుషితమైన నీరు కారణమా? చౌకగా అమ్మిన చికెన్ కారణమా? లేదూ అంటే గార మండలంలో జరుగుతున్న వత్సవలస యాత్రకు వెళ్లినవారు తెచ్చిపెట్టినదా? అనే విషయం అప్ప్పుడే తేలదు. ఆ తర్వాత ప్రభుత్వం ఎలా అనుకుంటే అలా ప్రకటిస్తుంది. కానీ తక్షణ ఉపశమనం కలిగించడంలో మాత్రం అధికారం, రాజకీయం అన్న తేడా లేకుండా అందరూ శక్తివంచన లేకుండా కష్టపడ్డారు. కానీ దీనికి కమిషనర్ బలైపోయారు.

నగరంలో డయేరియాకు సంబంధించి బాధ్యులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మంగళవారం రాత్రి కమిషనర్ హనుమంతు కూర్మారావుకు ఫోన్‌లో చెప్పారు. డయేరియాకు కారణాలు ఏమైనప్పటికీ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి డీఈ, ఏఈ, ఎంఈ, ఎంహెచ్‌వో.. వీరిలో ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి సస్పెండ్ చేయాలని కోరారు. అయితే కూర్మారావు సీఎస్‌కు సర్దిచెప్పారు. మొదటిరోజు కంటే పరిస్థితి అదుపులో ఉందని, 50 శాతం మంది రోగులు డిశ్చార్జి అయిపోయారని, ఎవరిపైనా చర్యలు తీసుకోవాల్సినంత తీవ్రత లేదని సర్దిచెప్పారు కానీ బుధవారం నాటికి ఆసుపత్రుల్లో చేరినవారి సంఖ్య పెరిగిపోయింది. మరోవైపు మరణించినవారి సంఖ్య కూడా పెరిగిందన్న ఇంటెలిజెన్సీ రిపోర్టు ఉండటంతో నేరుగా రోణంకి కూర్మారావునే ప్రభుత్వం సస్పెన్షన్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11న రథసప్తమి తర్వాత విధుల్లో చేరిన కూర్మారావు నిజాయితీ గల అధికారి. ఏ శాఖలో పని చేసినా అవినీతి ఆరోపణలు అంటలేదు. కానీ నగరంలో డయేరియా వ్యాధికి మాత్రం ఆయన్ను బలి తీసుకున్నారు. ఇది నీరు కలుషితం కావడం వల్ల జరిగితే ఇంజినీరింగ్ సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించవచ్చు. కానీ అసలు డయేరియా అని తేలినప్ప్పుడు దీనికి ప్రాథమికంగా బాధ్యత వహించాల్సింది మున్సిపల్ హెల్త్ అధికారి. కానీ ఎక్కడా ఆయన టాపిక్కే లేకుండాపోయింది. స్వయంగా కలెక్టర్ ఈ ప్రాంతాల్లో పర్యటించి శానిటేషన్ చేయిస్తుంటే.. ఇన్ని రోజులూ ఎంహెచ్‌వో ఏం చేశారన్న ప్రశ్న తలెత్తకపోవడం విచిత్రం. డయేరియా ప్రబలడానికి కారణాలు ఎవరివి వారికి ఉన్నాయి. కానీ వైద్యానికి, పరిశుభ్రతకు సంబంధించి బాధ్యత వహించాల్సింది మాత్రం డాక్టర్ చదివిన మున్సిపల్ హెల్త్ అధికారి మాత్రమే. శ్రీకాకుళం నగరంలో ఎన్ని డివిజన్లు ఉన్నాయో, ఏవి ఎక్కడ ఉన్నాయో ఇంకా పూర్తిగా తెలియని కూర్మారావు మాత్రం సస్పెండ్ అయిపోయారు. వాస్తవానికి ఎవరో ఒకర్ని సస్పెండ్ చేసుంటే.. కూర్మారావుకు ఈ పరిస్థితి వచ్చివుండేది కాదు. అయితే సస్పెన్షన్ ఎవరికైనా ఒకటేనని, ఎవరైనా బాధపడతారన్న కోణంలో కూర్మారావు సీఎస్ ఫోన్ చేసినప్ప్పుడు వారిని వెనకేసుకొచ్చారు.

నిబంధనల మేరకైతే ప్రతీ వార్డు సచివాలయ పరిధిలోనూ ఎమినిటీ సెక్రటరీ, వాల్వ్ ఆపరేటర్ ప్రతీరోజు పర్యటించాలి. నీరు విడుదల దగ్గర్నుంచి, దాని నాణ్యత వరకు ప్రజలతో మాట్లాడాలి. కానీ అటువంటివేవీ జరిగినట్టు ప్రజలు చెప్పడంలేదు. ఇక అప్పటికీ రెండు రోజుల నుంచి తాము తాగే నీరు మురికి వాసన వస్తుందని ప్రజలు చెబుతున్నారు గానీ ఎక్కడ లీకయిందో ఇప్పటికీ మున్సిపల్ యంత్రాంగం చెప్పలేకపోతోంది. అమత్ పథకం అమలులోకి వచ్చినప్ప్పుడు తెల్లకార్డు ఉన్నవారందరికీ కుళాయి కనెక్షన్లు ఉచితంగా ఇచ్చారు. ఇందుకోసం వాడిన మెటీరియల్‌కు సహజంగానే తక్కువ నాణ్యతతో ఉంటుంది. దీనికి తోడు ప్రతీ ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడం కోసం కాలువలు, కుంటలు చూడకుండా పైప్‌లైన్లు నడిపేశారు. ఎక్కడ లీకయినా పట్టుకోవడం ఇప్ప్పుడంత సులువు కాదు. వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే ప్రధాన లైన్‌కు లీకుంటే దాన్ని కనిపెట్టవచ్చు. కానీ ఇంటికి వెళ్లే కనెక్షన్‌లో లీకేజులుంటే మాత్రం ప్రస్తుతం మున్సిపాలిటీ వద్ద ఉన్న సిబ్బందితో దాన్ని కనిపెట్టడం అసాధ్యం. ఎంతమంది డయేరియా బారిన పడ్డారు? వారేం తిన్నారు? వారేం తాగాలన్న డేటా సేకరించడంలోనే వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం తలమునకలైవుంది. దీనికి మున్సిపాలిటీ కూడా చేయూతివ్వాల్సిన అవసరం వచ్చింది. అలా కాకుండా మొత్తం ఫిట్టర్ వ్యవస్థను రంగంలోకి దించి పైప్‌లైన్లను సరిచేసే ప్రక్రియ ఆరోజే మొదలుపెట్టివుంటే భవిష్యత్తుకైనా ఉపయోగపడివుండేది. కార్పొరేషన్ కమిషనర్ డయేరియా అరికట్టడానికి ఎంత చేయాలో అంతా చేశారు. కానీ మంగళవారం కేసులు తగ్గుముఖం పట్టినట్టే కనిపించి బుధవారం ఆసుపత్రిలో చేరినవారి సంఖ్య పెరిగింది. దీంతో పరిస్థితి అదుపు తప్ప్పుతుందని భావించి ఈయన్ను సస్పెండ్ చేశారు. ఎలాగూ ఈయన రిలీవ్ అయిపోయారు కాబట్టి నెపం ఆయన మీదకు నెట్టేసి దీన్ని ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టేస్తారు.

డయేరియా అంటువ్యాధి.. ఒక ప్రాంతంలో ఏది కలుషితమైనా ఆ మనుషుల ద్వారా వేరే ప్రాంతంలో ఉన్నవారికి కూడా వ్యాపిస్తుంది. సోమవారం ‘సత్యం’లో కథనం వచ్చిన తర్వాత కలెక్టర్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే పరిస్థితి అదుపులో ఉందని భావించారు. కానీ పరామర్శలకు వెళ్లిన ఆయన భార్య గొండు స్వాతి ఇచ్చిన రిపోర్టు మేరకు మంగళవారం సాయంత్రం విజయవాడ నుంచి బయల్దేరి రాత్రికి శ్రీకాకుళం చేరిపోయారు. అప్పట్నుంచి కంటిన్యూగా ఒకటికి రెండుసార్లు బాధితులను కలిశారు. ఆసుపత్రి నుంచి బయటకు రాగానే మళ్లీ కొత్త పేషెంట్ చేరారని తెలిస్తే మరోసారి వెళ్లి భరోసా ఇచ్చి వస్తున్నారు. ఎన్ని చేసినా డయేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది. అదష్టవశాత్తు మంగళవారం తర్వాత మతుల సంఖ్య నమోదు కాలేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page