top of page

మేజర్‌ కవిత.. బ్రహ్మపుత్ర విజేత

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 28, 2025
  • 3 min read
  • అటు సైన్యం.. సాహసయాత్రలతో ప్రత్యేక గుర్తింపు

  • ఏకంగా ఐదుసార్లు గౌరీచెన్‌ పర్వతారోహణ

  • అత్యంత ప్రమాదకరమైన హిమాలయన్‌ నదిలో రాఫ్టింగ్‌

  • ఏకంగా 28 రోజులపాటు 1040 కి.మీ. విజయ యాత్ర

  • సైన్యంలో కెప్టెన్‌ నుంచి మేజర్‌ స్థాయికి ఎదుగుదల

  • వైద్య కోర్సు చేసినా ధైర్యంగా ఆర్మీ సేవల్లో చేరిక

  • వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు ఆమె స్వగ్రామం

  • మహిళల విషయంలో సమాజం ఎంత మారినా.. ఎంత చైతన్యవంతమైనా.. ఇంకా అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లకు ఉన్నత చదువులెందుకన్న అభిప్రాయం బలంగా ఉంది.

  • చదువుల సంగతి సరే.. ఆడపిల్లలు సైన్యం వంటి రక్షణదళాల్లో చేరడాన్ని అభ్యంతరపెట్టే.. వింతగా చూసే పరిస్థితులు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉన్నాయి.

  • ఎంబీబీఎస్‌ చేసిన అమ్మాయి ఏ ప్రభుత్వ ఉద్యోగమో లేదా ప్రైవేట్‌ ఆస్పత్ల్రులోనో పని చేయడం లేదా సొంతంగా క్లినిక్‌ పెట్టుకుని కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉండకుండా రక్షణ సర్వీసుల్లో చేరడం ఏమటిటన్న మూతివిరుపులూ సహజమే.

  • .. వీటన్నింటినీ బ్రేక్‌ చేసిన ధీర వనిత కవిత వాసుపల్లి. వైద్య విద్యనభ్యసించిన ఆమె తన ఇష్టానికి అనుగుణంగా.. దేశ సేవలో భాగస్వామి కావాలన్న తపనతో భారతీయ సైన్యంలో చేరి మేజర్‌ హోదాకు ఎదిగారు. క్లిష్టమైన ఉద్యోగంలోనూ సాహసాలను వెతుక్కుంటూ.. వాటిలో విజయాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్న కవిత శ్రీకాకుళం జిల్లా ఆడపడుచు కావడం గర్వకారణం.


(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన చెందిన కవిత వాసుపల్లి నలుగురు నడిచే దారిలో కాకుండా.. భిన్నంగా ప్రయాణించే ప్రత్యేకత చాటుకునే తత్వం కలిగిన యువతి. చిన్నతనం నుంచీ అదే విధంగా పెరిగారు. తల్లిదండ్రులు కాదన్నా.. ఒప్పించి మరీ వారినే తన దారికి తెచ్చుకునే తత్వం ఆమెది. ఆ విధంగా ఆమె భారత ఆర్మీలో మేజర్‌ హోదాలో వైద్యాధికారిగా పని చేస్తూనే పర్వతారోహణం, రివర్‌ రాఫ్టింగ్‌ వంటి సాహాస క్రీడల్లో ప్రతిభ చూపుతూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారు. ఉద్దానం ప్రాంతమైన వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు ఆమె స్వగ్రామం. తండ్రి వాసుపల్లి రామారావు రైల్వేలో క్లర్క్‌ స్థాయి ఉద్యోగి. ప్రస్తుతం అసోంలో పని చేస్తున్నారు. తల్లి రమ్య గృహిణి. ఈ దంపతులకు కవిత ప్రథమ సంతానం కాగా.. మరో కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేరవుతున్నాడు. కవితకు చిన్నప్పటి నుంచీ క్రీడలు, సిమ్మింగ్‌ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఈత సాధన చేసి బెస్ట్‌ స్విమ్మర్‌గా పేరుపొందారు. కానీ చదువు దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఆమెను కుటుంబ సభ్యులు పోటీలకు పంపలేదు. ఇక విశాఖలోని శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌లో టెన్త్‌ వరకు చదువుకున్నారు. అక్కడే ఇంటర్‌ చదివిన అనంతరం వైద్యవిద్య వైపు మళ్లారు. సొంత జిల్లా అయిన శ్రీకాకుళంలోని రిమ్స్‌ వైద్య కళాశాలలో చదివి ఎంబీబీఎస్‌ పట్టా అందుకున్నారు.

కెప్టెన్‌ నుంచి మేజర్‌ హోదాకు

ఆ తర్వాత మెడికల్‌ పీజీ చేయాలన్న చాలామంది సూచించినా కుటుంబ పరిస్థితులు, అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కుటుంబానికి ఆదరువుగా ఉండాలన్న ఉద్దేశంతో పైచదువులకు కాకుండా ఉద్యోగం వైపు కవిత మొగ్గు చూపారు. అయితే ఏ ఆస్పత్రిలోనో చేరకుండా.. భారత సైన్యం(ఆర్మీ)లో చేరారు. బంధువులు, తల్లిదండ్రులు వద్దంటున్నా.. వారిని ఒప్పించి 2021లో ఆర్మీ వైద్యాధికారిగా కెప్టెన్‌ హోదాలో తొలి పోస్టింగ్‌ పొందారు. అనంతరం ప్రమోషన్‌ పొంది ప్రస్తుతం మేజర్‌ హోదాలో ఉన్నారు. తొలి పోస్టింగ్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లో పొందారు. అక్కడ పని చేస్తున్నప్పుడే తనకు ఇష్టమైన సాహస యాత్రలు చేస్తూ అబ్బురపరుస్తున్నారు. గుర్తింపు పొందుతున్నారు. సాహస క్రీడలపై ఇష్టంతోనే అరుణాచల్‌ప్రదేశ్‌లోనే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ అండ్‌ అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ అనే సంస్థలో చేరి పర్వతారోహణకు సంబంధించి రెండు, రివర్‌ రాఫ్టింగ్‌(నదిలో చిన్న పడవలతో సుదీర్ఘ ప్రయాణం చేయడం)లో ఒక ప్రత్యేక కోర్సు చేశారు. సైన్యంలో కొనసాగుతూనే వ్యక్తిగతంగా ఈ కోర్సులు పూర్తి చేశారు.

ఐదుసార్లు గౌరీచెన్‌ అధిరోహణ

పర్వతారోహణలో శిక్షణ తీసుకున్న మేజర్‌ కవిత.. అరుణాచల్‌ ప్రదేశ్‌లోనే అత్యంత ఎత్తయిన పర్వతంగా పేరొందని గౌరీచెన్‌ను కవిత ఐదుసార్లు అధిరోహించడం విశేషం. 6858 మీటర్ల ఎత్తున ఈ పర్వతాన్ని కల్నర్‌ రణవీర్‌సింగ్‌ జమ్వాల్‌ నేతృత్వంలలోని బృందంలో సభ్యురాలిగా కవిత ఉన్నారు. ఎవరెస్ట్‌ శిఖరాన్ని మూడుసార్లు అధిరోహించిన టెన్సింగ్‌ నార్కే అవార్డు గ్రహీత, మౌంటెనీరింగ్‌ సంస్థ డైరెక్టర్‌ అయిన రణ్‌వీర్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఒకసారి గౌరీచెన్‌ అధిరోహించి తిరిగి కిందకి దిగివస్తున్న సమయంలో ఆ బృందంలోని ఒక యువ సభ్యురాలు ఊపిరి అందక ప్రమాదంలో పడితే.. స్వయంగా వైద్యురాలైన మేజర్‌ కవిత ఆమెకు స్వయంగా ప్రథమ చికిత్స చేసి ప్రాణగండం తప్పించి దిగువకు తీసుకొచ్చారు. తన సాహస యాత్రల్లో ఈ ఘటన ఒక మైలురాయిగా నిలిచిపోతుందని మేజర్‌ కవిత ‘సత్యం’తో మాట్లాడుతూ పేర్కొన్నారు.

బ్రహ్మపుత్రను జయించిన తొలి మహిళ

మేజర్‌ కవిత మరో అరుదైన ఘనత సాధించారు. అత్యంత క్లిష్టమైన బ్రహ్మపుత్ర నదిలో రివర్‌ రాఫ్టింగ్‌ చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. హిమాలయాల్లో పుట్టి చైనా, భారత్‌, బంగ్లాదేశ్‌లలో ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిసే బ్రహ్మపుత్ర చాలా ఉధృతంగా ప్రవహించే నది. అందులోనూ నది పొడవునా ప్రవాహ తీవ్రత, అలల ఉధృతి కారణంగా సుడిగుండాలు ఏర్పడుతుంటాయి. వీటికితోడు నదిలో నీరు మంచులా గడ్డ కట్టించేంత చల్లగా ఉంటుంది. అందువల్ల ఆ నదిలో ప్రయాణం అత్యంగా ప్రమాదకరంగా పేర్కొంటారు. అటువంటి నదిలో కల్నల్‌ రణవీర్‌సింగ్‌ నేతృత్వంలోని పదిమంది సభ్యుల బృందం 1040 కిలోమీటర్ల మేరకు విజయవంతంగా రివర్‌ రాఫ్టింగ్‌ పూర్తిచేసింది. ఈ బృందంలో కవిత ఒక్కరే మహిళా సభ్యురాలు కావడం విశేషం. భారత`టిబెట్‌ సరిహద్దుల్లోని అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో గెల్లింగ్‌ గ్రామం వద్ద నుంచి బ్రహ్మపుత్రలో ప్రయాణం ప్రారంభించి ఏకధాటిగా 28 రోజులపాటు సాగిన సాహసయాత్ర అసోంలోని బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న హాట్సింగిమారి వద్ద ముగిసింది. ఈ యాత్రలో కవితతో సహా ఒక సుడిగుండంలో చిక్కుకుని ప్రమాదంలో పడిరది. కొన్ని నిముషాలపాటు ఆమె పడవలోంచి నదిలో పడి నీటి అడుగుకు వెళ్లిపోయారు. అయితే అదృష్టవశాత్తు వెంటనే తేరుకుని ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డారు. ఈ యాత్రలో రోజుకు 12 గంటలపాటు ఏకబిగిన 70 కిలోమీటర్ల మేరకు ప్రయాణించి రాత్రివేళల్లో విశ్రాంతి తీసుకునేవారమని కవిత చెప్పారు.

గవర్నర్‌ ప్రశంసలు

సైన్యంలో మేజర్‌ హోదాలో డాక్టర్‌గా పని చేస్తున్న కవిత సాధించిన విజయాలు, సృష్టించిన రికార్డులు చరిత్రకెక్కడంతోపాటు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాయి. అవార్డులు అందిస్తున్నాయి. ఈ నెల 26న ఏపీ గవర్నర్‌ నజీర్‌ అహ్మద్‌ను మేజర్‌ కవిత తన తల్లిదండ్రులతో సహా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ కవిత సాహసకృత్యాలను ప్రశంసించారు. ప్రశంసాపత్రం కూడా అందజేశారు. ఇక సైన్యంలో సేవలకు గుర్తింపుగా కవిత చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాప్‌ అవార్డు అందుకున్నారు. గౌరీచెన్‌ పర్వతారోహణ సందర్భంగా ప్రమాదంలో పడిన తోటి పర్వతారోహకురాలిని చికిత్స చేసినందుకు మేజర్‌ కవిత రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్‌కు ఎంపికయ్యారు. బ్రహ్మపుత్రలో రివర్‌ రాఫ్టింగ్‌ను విజయవంతంగా చేసినందుకుగాను అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఫెమా ఖండు ఆమెను ప్రశంసించారు. బ్రహ్మపుత్రలో రివర్‌ రాఫ్టింగ్‌ చేసిన రికార్డును లండన్‌లోని వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నమోదు చేసింది. ఆ మేరకు కవితకు సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఈ సాహసయాత్ర తన జీవితంలో మధురానుభూతిగా నిలిచిపోతందని కవిత పేర్కొన్నారు. తన విజయాలకు తల్లిదండ్రులే కారణమని అన్నారు. వారి సహకారం, ప్రోత్సాహంతోనే పట్టుదలతో చదివి వైద్యవిధ్య అభ్యసించడం, సైన్యం చేరడం తనకు సాధ్యమైందని మేజర్‌ కవిత చెప్పారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page