మూడు జట్లు.. వ్యూహం ఒక్కటే.. టార్గెట్ ఒక్కడే!
- DV RAMANA

- 8 hours ago
- 3 min read
తెరపైకి 1992లో మార్టిన్‌క్రో అనుసరించిన వ్యూహం
అభిషేక్ శర్మను ఎదుర్కోవడానికి అదే శరణ్యం
అదే ఎత్తుగడతో సక్సెస్ సాధించిన మూడు జట్లు
భారత జట్టు వద్ద దీనికి విరుగుడు వ్యూహం ఉందా?
సూపర్- 8లో ఎలా గట్టెక్కుతారోనని అభిమానుల ఆందోళన

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
కురుక్షేత్ర యుద్ధంలో చిచ్చరపిడుగులా చెలరేగిపోతున్న కుర్రయోధుడైన అభిమన్యుడిని ఎదుర్కోకోలేక.. అతన్ని నిర్జించడానికి పద్మవ్యూహం పన్ని అందులో ఇరికించారు కౌరవసేనలోని వ్యూహకర్తలు. సరిగ్గా అటువంటి పరిస్థితులే ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీలో కనిపించాయి. నాటి అభిమన్యుడి మాదిరిగానే ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో అరివీర భయంకర బ్యాటర్‌గా యువసంచలన అభిషేక్‌శర్మ పేరుపొందాడు. టీ20ల్లో అతని స్ట్రైక్‌రేట్ 193.30 శాతం అంటేనే అతగాడి వీరబాదుడు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అతను క్రీజ్‌లో ఉన్నప్పుడు బౌలింగ్ చేయాలంటేనే మహామహా బౌలర్లే తత్తరపాటు గురయ్యే పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. మరి అంత భీకర బ్యాటర్ అత్యంత ప్రతిష్టాత్మకమైన టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఎందుకు విఫలమవుతున్నాడు? లీగ్ దశలో ఏకంగా మూడు మ్యాచుల్లో తొలి ఓవర్లోనే ఎందుకు సున్నాకే అవుటై.. అతి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దీనికి కారణాలు అన్వేషిస్తే.. అసలు విషయం బయటకొచ్చింది. ఆధునిక క్రికెట్‌కు ప్రతినిధి అయిన అభిషేక్‌శర్మ చెలరేగిపోకుండా అతన్ని మ్యాచ్ ప్రారంభంలోనే అవుట్ చేసేందుకు ఇతర దేశాల క్రికెట్ జట్లు భారీ కసరత్తే చేశాయి. దాని ఫలితంగానే 34 నాలుగేళ్లనాటి ఒక వ్యూహం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అభిషేక్ దూకుడుకు కళ్లెం వేసింది. అంతర్జాతీయ క్రికెట్ పెద్దగా అనుభవం లేని బ్యాటర్‌ను అవుట్ చేయడానికి ఏకంగా మూడు జట్ల కెప్టన్లు అదే వ్యూహాన్ని అమలు చేసి ఉచ్చు బిగించడం.. అభిషేక్ అందులో చిక్కుకుని సున్నాలు చుట్టడం పెద్ద విశేషం.
ఆరంభంలోనే ఆఫ్‌స్పిన్ తంత్రం
ప్రపంచ కప్ టోర్నీలో రెండో దశగా చెబుతున్న కీలకమైన సూపర్ 8 పోటీలకు రంగం సిద్ధమైంది. శనివారం రాత్రి పాకిస్తాన్, న్యూజీలాండ్ జట్లు తొలిపోరులో తలపడుతుండగా, ఆదివారం రాత్రి ఇండియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగనుంది. లీగ్‌దశలో మూడు మ్యాచ్‌లనూ గెలిచి అగ్రస్థానంలో నిలిచి అజేయంగా సూపర్ 8లోకి ప్రవేశించినప్పటికీ భారత్ అభిమానులను, మేనేజ్‌మెంట్‌ను ఒక విషయం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అదే ఈ ప్రపంచకప్ టోర్నీలో భారత తరుపు ముక్కగా అందరూ భావించిన అభిషేక్ శర్మ వరుసగా సున్నాకే అవుటవుతుండటం. క్రికెటర్లు నిరంతరం నిలకడగా ఆడుతూ భారీ స్కోర్లు చేయడం, బౌలర్లయితే పెద్దఎత్తున వికెట్లు తీయాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఎంతటి బ్యాటర్‌కైనా, బౌలర్‌కైనా అది అసాధ్యం. కానీ అభిషేక్ శర్మ లాంటి హిట్టింగ్ బ్యాటర్ వరుసగా మూడు మ్యాచుల్లో సున్నాకే అవుతుండటం ఆశ్చర్యం, విస్మయం కలిగిస్తోంది. టెక్నిక్ లేకుండా ఫ్లూక్‌గా బ్యాట్‌ను ఊపేయడం ద్వారా వికెట్‌ను పారేసుకుంటున్నాడని అనుకోవడానికి కూడా లేదు. ఆయన బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎటువంటి లోపం లేదని మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. మరి ఎందుకు అవుటవుతున్నాడంటే.. ప్రత్యర్థి జట్ల ఎత్తులే కారణమని చెప్పాలి. అభిషేక్‌లాంటి ప్రమాదకర బ్యాటర్ ఎక్కువసేపు క్రీజ్‌లో ఉంటే భారత స్కోర్ బోర్డును అదుపు చేయలేమని, ఆ జట్టు విధించే భారీ టార్గెట్‌ను ఛేదించడం అసాధ్యంగా మారుతుందని భావించిన టోర్నీలోని మిగతా జట్లు ఒక్క అభిషేక్ శర్మను తప్పించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదనుపెట్టాయి. అందులో భాగంగానే 34 ఏళ్ల క్రితంనాటి ఒక వ్యూహానికి బూజు దులిపి అతనిపై ప్రయోగించాయి. 1992 వన్డే వరల్డ్ కప్‌లో అప్పటి న్యూజీలాండ్ కెప్టన్ మార్టిన్ క్రో ఈ వ్యూహాన్ని తొలుత ప్రయోగించాడు. అప్పట్లో దీన్ని అసాధారణమైన ఎత్తుగడగా క్రికెట్ పండితులు అభివర్ణించారు. సాధారణంగా వన్డే, టీ20, టెస్ట్ మ్యాచ్.. ఫార్మట్ ఏదైనా బౌలింగ్ జట్టు మొదట ఫాస్ట్ బౌలర్లతోనే దాడి ప్రారంభిస్తుంది. కానీ ఆ వరల్డ్ కప్‌లో న్యూజీలాండ్ కెప్టన్ మార్టిన్ క్రో ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఫాస్ట్ బౌలర్లకు బదులు ఆఫ్‌స్పిన్ బౌలర్ అయిన దీపక్‌పటేల్‌తో తొలి ఓవర్ నుంచి బౌలింగ్ చేయించాడు. ఈ వ్యూహం ఆస్ట్రేలియా, భారత్‌లాంటి మేటి జట్లను బెంబేలెత్తించింది. ఈ వ్యూహంలో ఉన్న కిటుకు ఏమిటంటే ఎడమచేతివాటం బ్యాటర్లు(లెఫ్ట్ హ్యాండర్లు) ఆఫ్‌స్పిన్‌ను ఎదుర్కోవడం కష్టం కావడమే. ఈ లోపాన్ని అందుపుచ్చుకుని నాడు మార్టిన్‌క్రో లెఫ్ట్‌హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్లు ఉన్న జట్లను టార్గెట్ చేశాడు.
ఉచ్చులో చిక్కుకుంటున్న లెఫ్ట్ హ్యాండర్లు
అదే ఎత్తుగడకు ప్రస్తుతం జరుగుతున్న టీ20 టోర్నీలో అభిషేక్ శర్మ బలైపోతున్నాడు. గ్రూప్ స్టేజ్‌లో ఏకంగా మూడు జట్లు.. పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా అతన్ని ఇదే వ్యూహంతో బుక్ చేశాయి. ఈ ఆఫ్ స్పిన్ అస్త్రంలో అభిషేక్ శర్మ వరుసగా చిక్కుకుంటుంటే.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. వీరిద్దరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే. క్రికెట్ సూత్రాల ప్రకారం లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆడటం కష్టమైన పని. ఆఫ్ స్పిన్‌లో బంతి వికెట్ల అవతలి నుంచి లోపలికి తిరుగుతుంది. దీనివల్ల వారు షాట్లు కొట్టడం కష్టం. లీగ్ దశలో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కోల్పోయిన 31 వికెట్లలో దాదాపు మూడో వంతు అంటే 11 వికెట్లు ఆఫ్ స్పిన్నర్లకే దక్కడం గమనార్హం. ఇక మార్టిన్‌క్రో వ్యూహాన్ని అనుసరిస్తూ.. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా స్వయంగా తనే ఆఫ్ స్పిన్‌తో మొదటి ఓవర్ వేసి అభిషేక్ శర్మను అవుట్ చేశాడు. తర్వాత నెదర్లాండ్స్ కూడా అదే చేసింది. ఆఫ్ స్పిన్నర్ ఆర్యన్ దత్ మొదటి ఓవర్‌లో అభిషేక్‌ను బోల్తా కొట్టించడమే కాకుండా ఇషాన్ కిషన్‌ను కూడా పెవిలియన్ పంపాడు. ఇక నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ తన ఆఫ్ స్పిన్‌తో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి భారత్‌ను వణికించాడు. ఈ లోపాన్ని అధిగమించి భారత్ సూపర్`8లోకి అడుగుపెట్టింది. ఈ దశలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ జట్లను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ జట్లలో ఎయిడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, సికిందర్ రజా, బ్రయాన్ బెన్నెట్, రోస్టన్ చేజ్ వంటి అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్లు ఉన్నారు. స్లో పిచ్‌లపై ఈ ఫింగర్ స్పిన్ మరింత ప్రమాదకరంగా మారుతుందని బౌలింగ్ కోచ్‌లు చెబుతున్నారు. గ్రూప్ దశలో దీనికి ప్రతివ్యూహాన్ని అనుసరించడంపై భారత జట్టు వ్యూహకర్తలు పెద్దగా దష్టి సారించినట్లు కనిపించలేదు. మరోవైపు వరుసగా విఫలమవుతున్నాడన్న కారణంతో అభిషేక్‌ను జట్టు నుంచి తప్పించేందుకు ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అది సరైన వ్యూహం కాదని క్రికెట్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. అభిషేక్ అవుటవుతున్న తీరు.. అతని కోసం ప్రత్యర్థి జట్లు అమలు చేస్తున్న వ్యూహాలను పసిగట్టి.. వాటిని ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయాలు అన్వేషించాలే తప్ప ఆటగాడిని జట్టు నుంచి తప్పించడం సమస్యకు పరిష్కారం కాబోదు. బ్యాటింగ్ కోచ్‌లు అతని లోపాన్ని ఎత్తిచూపి ఆఫ్ స్పిన్‌ను ఎదుర్కోగలిగే మెలకువలు చెప్పి సాధన చేయిస్తే అభిషేక్ మళ్లీ విజంభిస్తానడంలో సందేహం లేదు.










Comments