top of page

‘మాధవ్’ మాయాజాలం

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 4 days ago
  • 1 min read
  • ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరిత విజయం

  • ఒత్తిడిలోనూ చెలరేగిన యువ ఆల్ రౌండర్ తివారీ

  • సజీవంగా ఢిల్లీ ప్లేఆఫ్ ఆశలు

అది పరుగుల ప్రవాహం.. ఉత్కంఠకు పరాకాష్ట. 211 పరుగుల భారీ లక్ష్యం.. తడబడిన టాప్ ఆర్డర్. కానీ, ఆ యువకుడి కళ్లలో బెరుకు లేదు, చేతుల్లో వణుకు లేదు. ఇండోర్ కుర్రాడు మాధవ్ తివారీ ఆల్ రౌండ్ షోతో ఢిల్లీ క్యాపిటల్స్ అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసింది. సోమవారం జరిగిన హై-వోల్టేజ్ పోరులో ఢిల్లీ 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసి, ప్లేఆఫ్ రేసులో నిలిచింది.

మ్యాచ్ మలుపు తిప్పిన తివారీ

పంజాబ్ విసిరిన 211 పరుగుల ఛేదనలో ఢిల్లీ 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ అర్ధ సెంచరీలతో ఆదుకున్నా, చివర్లో మ్యాచ్ ఎటువైపు తిరుగుతుందో తెలియని స్థితి. అప్పుడు క్రీజులోకి వచ్చిన మాధవ్ తివారీ, అశుతోష్ శర్మతో కలిసి అద్భుతమే చేశాడు. స్టేడియం హోరును పట్టించుకోకుండా, కేవలం బంతిపైనే దృష్టి పెట్టి బాధ్యతాయుతంగా ఆడి లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే పూర్తిచేశాడు. అంతకుముందు బౌలింగ్‌లోనూ కీలకమైన రెండు వికెట్లు తీసి పంజాబ్ స్కోరును నియంత్రించడంలో మాధవ్ కీలక పాత్ర పోషించాడు.

‘ఇది కేవలం బ్యాట్‌కు, బంతికి మధ్య జరిగే ఆట. నేను నా బేసిక్స్‌పైనే దృష్టి పెట్టాను. ప్రేక్షకుల అరుపులు కూడా నాకు వినిపించలేదు, నా లక్ష్యం ఒక్కటే.. మ్యాచ్ గెలవడం.’

- మాధవ్ తివారీ, ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్

బ్యాటింగ్ అంటేనే ఇష్టం

నిజానికి మాధవ్ తనను తాను ఒక బ్యాటర్‌గానే చూసుకోవడానికి ఇష్టపడతాడు. ‘బౌలింగ్ చేయడం చాలా అలసటగా ఉంటుంది, శరీరానికి కష్టంగా అనిపిస్తుంది. కానీ బ్యాటింగ్ అంటే ప్రేమ. ఎంతసేపైనా బ్యాటింగ్ చేయగలను’ అని చిరునవ్వుతో చెప్పుకొచ్చాడు. అయితే, కోచ్ అమే ఖురాసియా ప్రోద్బలంతో తను ఒక పూర్తిస్థాయి ఆల్ రౌండర్‌గా ఎదిగానని, ఆధునిక క్రికెట్‌లో దాని ప్రాముఖ్యత ఇప్పుడు అర్థమవుతోందని పేర్కొన్నాడు.

నేపథ్యం, ఆశయాలు

ఇండోర్‌లో పెరిగిన ఈ 22 ఏళ్ల యువకుడి తండ్రి ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారి. కుటుంబం నుంచి లభించిన అండదండలే తనను ఈ స్థాయికి చేర్చాయని మాధవ్ కృతజ్ఞతగా తెలిపాడు. ‘నా లక్ష్యం స్పష్టం. భారత్ తరఫున ఆడి అత్యుత్తమ ఆటగాడిగా ఎదగాలి. నా ఆటను ఇంకా మెరుగుపరుచుకోవాల్సి ఉంది’ అని వినమ్రంగా ముగించాడు.

- సత్యం స్పోర్ట్స్ డెస్క్

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page